Take a fresh look at your lifestyle.

తగినన్నీ టీకాలు ఇస్తే 3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి ..!

  • వ్యాక్సిన్ల లోటు లేకుండా చూడాలని కేంద్రానికి సిఎం  కేజ్రీవాల్ విజ్ఞప్తి
  • ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి,న్యూ దిల్లీ,మే8:
ఢిల్లీ ప్రజలకు సరిపడు టీకాలు ఇస్తే, రానున్న మూడు నెలల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 80 నుంచి 85 లక్షల వ్యాక్సిన్లు కావాలన్నారు. అప్పుడే ఢిల్లీలోని మొత్తం జనాభాకు 3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తిచేయగలమని కేజ్రీ చెప్పారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాబోయే థర్డ్ వేవ్ ముప్పు గురించి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. థర్డ్ వేవ్ ముప్పు నుంచి రక్షించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే రక్షక కవచం. చిన్నారులకు కూడా వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకురావాలి. చిన్నారుల భవిష్యత్తు గురించే మనమంతా ఆందోళన చెందుతున్నాం’’ అని అన్నారు. ఢిల్లీ లో కోటి 50 లక్షల మంది 18 ఏళ్ల పైబడిన వారు ఉన్నారని చెప్పారు. రెండు డోసులు కలిపి వీరి కోసం 3 కోట్ల డోసులు కావాలన్నారు. ఇప్పటి వరకు ఢిల్లీ కేవలం 40 లక్షల డోసులు మాత్రమే పొందిందని, ఇంకా 2 కోట్ల 60 లక్షల డోసులు కావాలని తెలిపారు. 3 నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే రోజుకు 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలన్నారు. కానీ, ప్రస్తుతం రోజుకు లక్ష మందికి టీకాలు వేస్తున్నట్లు వివరించారు. అందువల్ల ఢిల్లీ కి తగినంత టీకాలు లభించేల చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సినేషన్ కోసం నగరంలోని 250 నుంచి 300 పాఠశాలలను ఉపయోగిస్తున్నట్లు కేజ్రీవాల్ తెలిపారు.
ఢిల్లీకి 976 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అంటున్న మనీష్ సిసోడియా రాబోయే రోజుల్లో అవసరాలను కలుపుకొని ఢిల్లీకి ప్రతి రోజు 976 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం అని ఢిల్లీ డిప్యూటి సిఎం మనీష్ సిసోడియా అన్నారు. కొత్తగా మరిన్ని ఆక్సిజన్ బెడ్లను  బెడ్లను ప్రభుత్వం అందుబాటులోకి తేనుందన్నారు. ప్రస్తుత పరిస్థితులకు కనీసం 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని చెప్పారు.  అయితే, మే 5 న అవసరానికి తగ్గట్లుగా 730 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిందన్నారు. కానీ, మే6 న 577 మెట్రిక్ టన్నులు, మే 7 న కేవలం 487 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిందని చెప్పారు. తగ్గిన ఆక్సిజన్ కొరత పేషెంట్లపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Reply