Take a fresh look at your lifestyle.

ఇం‌టింటికీ టీకా..

  • వినూత్న మార్గాలను అన్వేశించండి
  • స్థానిక మత పెద్దల సహాయం తీసుకోవాలి
  • తక్కువ వ్యాక్సినేషన్‌ అయిన జిల్లాల మెజిస్ట్రేట్‌లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్

న్యూదిల్లీ, నవంబర్‌ 03: వ్యాక్సినేషన్‌ ‌కవరేజీ తక్కువగా ఉన్న 40కి పైగా జిల్లాల మేజిస్ట్రేట్‌లతో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం సమావేశం నిర్వహించారు.కోవిడ్‌-19 ‌వ్యాక్సినేషన్‌ ‌డ్రైవ్‌ను ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రధాని నొక్కి చెప్పారు. ప్రచారాన్ని పెంచడానికి వినూత్న మార్గాలను అనుసరించాలని ఇప్పటి వరకూ తక్కువ టీకాల పంపిణీ జరిగిన జిల్లాల అధికారులను ఆయన కోరారు.

వీడియో కాన్ఫరెన్సింగ్‌ ‌ద్వారా జరిగిన ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..తాను ఇటీవల వాటికన్‌ ‌సిటీలో పోప్‌ ‌ఫ్రాన్సిస్‌ను కలిశానని చెబుతూ మత పెద్దల సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించడంపై కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్‌-19 ‌టీకాలపై అవగాహన కల్పించేందుకు, పుకార్లపై పోరాడేందుకు స్థానిక మత పెద్దల సహాయం తీసుకోవాలని జిల్లా అధికారులను ఆయన కోరారు. తక్కువ కవరేజీ ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ను పెంచేందుకు వినూత్న మార్గాలను అవలంబించాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. ఇప్పటి వరకు వ్యాక్సినేషన్‌ ‌కేంద్రాలకు ప్రజలను తీసుకెళ్లే పనిలో ఉన్న అధికారులు ఇప్పుడు ప్రతి ఇంటికి చేరుకుని ‘హర్‌ఘర్‌ ‌దస్తక్‌’ ‌ప్రచారంతో పని చేయాల్సిన సమయం వొచ్చిందన్నారు.

టీకాలు అసలు వేసుకోని వ్యక్తులకు మొదటి డోస్‌ ఇచ్చేలా చూడాలని, రెండవ డోస్‌పై కూడా అంతే శ్రద్ధ వహించాలని ప్రధాన మంత్రి అధికారులకు చెప్పారు. మొదటి డోస్‌లో 50 శాతం కంటే తక్కువ వ్యాక్సినేషన్‌ అయిన జిల్లాలు, రెండవ డోస్‌కు సంబంధించి తక్కువ తక్కువ వ్యాక్సినేషన్‌ అయిన జిల్లాలపై ఈ సమావేశంలో దృష్టి సారించారు. 40 జిల్లాలు జార్ఖండ్‌, ‌మణిపూర్‌, ‌నాగాలాండ్‌, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌, ‌మహారాష్ట్ర మరియు మేఘాలయ, ఇతర కొన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్‌ ‌థాకరే, ఛత్తీస్‌గఢ్‌కు సిఎం భూపేష్‌ ‌బఘేల్‌ ‌సహా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో హాజరయ్యారు. జీ20, సీఓపీ26 సమావేశాలకు హాజరైన ప్రధాని మోదీ విదేశాల నుంచి తిరిగి వొచ్చిన వెంటనే ఈ సమావేశాన్ని నిర్వహించారు.

Leave a Reply