Take a fresh look at your lifestyle.

ఉత్తుత్తి హామీలు ..కేటాయించని నిధులు..!

హైదరాబాద్‌, ‌ఫిబ్రవరి 3 : 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్‌ ‌ప్రజలకు ఇచ్చిన హామీలు…బడ్జెట్‌లో నిధుల కేటాయింపు గురించి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ ‌రావుకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి శుక్రవారం బహిరంగ లేఖ లేఖ రాసారు. లేఖ పూర్తి పాఠం..‘2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరు ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్‌, ‌బైబిల్‌ అని నమ్మబలికారు. రైతులు, నిరుద్యోగ యువత, బీసీ, దళిత, మైనారిటీ వర్గాలకు అనేక వరాలు కురిపించారు. మరో దఫా అధికారం ఇస్తే ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటామని చెప్పారు.

ఇప్పటికి నాలుగు బడ్జెట్‌లు పూర్తయ్యాయి. ప్రతి బడ్జెట్‌లో సగటున రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అదనంగా అప్పులు తెచ్చారు. ఇంతా చేసి ఒక్క హామీనైనా నెరవేర్చారా అంటే అదీ. లేదు. కొన్ని హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. మరికొన్నింటికి నిధులు కేటాయించినా ఖర్చు చేసింది లేదు. మరో పది నెలల్లో మీ ప్రభుత్వ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో ప్రవేశపెట్టబోతూన్న చివరి బడ్జెట్‌లోనైనా ఆయా హామీలకు సంపూర్ణంగా నిధులు కేటాయించి, ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మీకు గుర్తు చేసేందుకు ఈ లేఖ రాస్తున్నాను. మీరిచ్చిన హామీలు, వాటి అమలు పరిస్థితిని కూడా మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను.

1. రైతు రుణమాఫీ
2018 ఎన్నికల సమయంలో మళ్లీ అధికారంలోకి వొస్తే రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బ్యాంకర్ల నివేదిక మేరకు 47.4 లక్షల మంది రైతులు ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. దానికి గాను రూ.24,738 కోట్లు అవసరం అని తేల్చారు. ఒకే కుటుంబంలో ఇద్దరు అర్హులన్న నెపంతో ఇందులో రూ.3,881 కోట్లకు కోత విధించారు. మొదట ఏక మొత్తంలో రుణమాఫీ అని చెప్పి…అధికారంలోకి వొచ్చాక దానిని నాలుగు విడతలుగా మార్చారు. గడిచిన నాలుగేళ్లలో రెండు విడతల్లో కలిపి మొత్తం మీరు మాఫీ చేసింది కేవలం రూ.3,881 కోట్లు మాత్రమే. ఇంకా రూ.20,857 కోట్లు మాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆ మొత్తానికి వడ్డీ కట్టుకోలేక రైతుల నడ్డి విరుగుతుంది.
2. దళితబంధు
దళిత సామాజిక వర్గానికి మీరు తీరని అన్యాయం చేశారు. తొలి దళిత ముఖ్యమంత్రి మొదలు, ప్రతి కుటుంబానికి మూడెకరాలు భూమి వరకు ఒక్కటంటే ఒక్క హామీని నెరవేర్చలేదు. తాజాగా దళితబంధు పేరుతో ఆ వర్గాలను మరోసారి వంచించేందుకు సిద్ధమయ్యారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో చూపించారు. ఖర్చు చేసింది శూన్యం. ఈ పథకం విధివిధానాలపై క్లారిటీ లేదు. పథకాన్ని ఎమ్మెల్యేల చేతుల్లో పెట్టి పైరవీలకు తెర తీశారు. బీఆర్‌ఎస్‌ ‌నేతల కమీషన్ల పథకంగా ఇది మారిపోయింది. మొత్తంగా పథకం అమలు తీరు చూస్తే ఊరికో కోడి… ఇంటికో ఈక అన్నట్లు తయారైంది. ఈ బడ్జెట్‌ ‌లోనైనా నిధుల కేటాయింపే కాదు… క్షేత్రంలో పథకం అమలయ్యేలా నిధులు విడుదల చేయాలి.
3. పాలమూరు-రంగారెడ్డికి ద్రోహం
దక్షిణ తెలంగాణ రైతాంగం పాలిట వరప్రదాయినిగా ఉండాల్సిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మీరు ఉద్దేశపూర్వకంగానే నీరుగార్చినట్లు కనిపిస్తుంది. ఆ ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల అప్పులు తెచ్చారు. పనులు మాత్రం పడకేశాయి. 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌ ‌నగరానికి తాగునీటి ఉద్దేశంతో రూ.35,200 కోట్లతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం ప్రస్తుతం రూ.60 వేల కోట్లకు చేరింది. ఏడున్నరేళ్లలో ఈ ప్రాజెక్టుపై మీరు చేసిన ఖర్చు రూ.7,241 కోట్లు మాత్రమే. ప్రస్తుత బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు కేవలం రూ.1,225 కోట్లు మాత్రమే. ఇలా కేటాయింపులు చేస్తే ఈ ప్రాజెక్టు మరో 60 -70 ఏళ్లకు కూడా పూర్తి కాదు.
4. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు
డబ్బా ఇళ్లు వద్దు…డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్లు ముద్దు అని గడిచిన తొమ్మిదేళ్లుగా మీరు ప్రజలను ఊరిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఇళ్లులేని పేదలు తమకు డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌వొస్తుందేమోనని…సొంత ఇంటి కల తీరుతుందని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కాగా…తొమ్మిదేళ్లలో మీరు మంజూరు చేసిన ఇళ్లు కేవలం 2,97,057 మాత్రమే. ఇందులో 2,28,520 నిర్మాణం ప్రారంభం కాగా…లబ్ధిదారులకు అందజేసినవి కేవలం 21 వేలు మాత్రమే అని లెక్కలు చెబుతున్నాయి.
5. సొంత జాగా ఉంటే రూ.3 లక్షలు ఏమైంది…
డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇళ్ల విషయంలో ఆగ్రహంగా ఉన్న ప్రజలను శాంత పరిచేందుకు సొంత జాగా ఉన్న వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం చేస్తామని గత బడ్జెట్‌ ‌సమయంలో ప్రకటించారు. ఈ ఏడాదిలో నాలుగు లక్షల మందికి ఈ పథకానికి వర్తింపజేస్తామన్నారు. మరో బడ్జెట్‌ ‌రానే వచ్చింది కానీ ఈ పథకానికి ఇంత వరకు మార్గదర్శకాలు లేవు…పథకం ప్రారంభించింది లేదు.
6. రూ.3016 నిరుద్యోగ భృతి ఏది
బీఆర్‌ఎస్‌ ‌తొమ్మిదేళ్ల అధికారంలో తెలంగాణలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు పెరిగాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక, తల్లిదండ్రులకు భారం కాలేక యువత ఆత్మహత్యలు చేకుంటున్నారు. వారిని శాంత పరచడానికి నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు గత ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ వద్ద సుమారు 26 లక్షల మంది నిరుద్యోగుల నమోదు జాబితా ఉంది. ఎవరికీ ఒక్క రూపాయి భృతి ఇచ్చింది లేదు.
7. ఫీజు రీ ఇంబర్స్‌మెంట్‌ అటకెక్కించారు.
పేద, బడుగు బలహీనవర్గాల పిల్లల ఉన్నత చదవుల కోసం కాంగ్రెస్‌ ‌హాయంలో ఫీజు రీ ఇంబర్స్ ‌మెంట్‌ ‌పథకాన్ని తెచ్చింది. మీరు అధికారంలోకి వచ్చాక క్రమంగా ఆ పథకాన్ని నీరుగార్చారు. స్కాలర్‌ ‌షిప్‌, ‌ఫీజు రీ ఇంబర్స్ ‌మెంట్‌ ‌బకాయిలు ఏటికేడు పేరుకుపోతున్నాయి. ఇప్పటికే రెండేళ్ల  బకాయిలు రూ.2,900 కోట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. మూడేండ్ల బకాయిలు కలిపి రూ.5000 కోట్లకు చేరాయి. దీనివల్ల 18 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
8. 24 గంటల విద్యుత్‌ ఓ ‌బూటకం
రైతులకు 24 గంటల విద్యుత్‌ ‌పేరుతో మీరు మోసం చేశారు. విద్యుత్‌ ‌సంస్థలకు బకాయిలు చెల్లించకుండా వాటిని దివాళా తీసే పరిస్థితి తెచ్చారు. ఇప్పుడు పల్లెల్లో 10 గంటల కోత విధిస్తున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్‌ ‌కోతలతో రైతులు రోడ్డెక్కుతున్నారు. మళ్లీ సబ్‌ ‌స్టేషన్ల ముందు ధర్నాల దృశ్యాలు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఉచిత విద్యుత్‌ ‌కోసం 2022 -23 బడ్జెట్‌ ‌లో రూ.10,500 కోట్లు కేటాయించారు. కానీ, ఆ మొత్తాన్ని విడుదల చేయకపోవడంతో డిస్కంలు మరింత నష్టాల్లో కూరుకుపోయాయి. ఆ నష్టాల భర్తీ పేరుతో గృహ వినియోగదారులపై ఏసీడీ పేరుతో అదనపు చార్జీల భారం మోపుతున్నారు.
9. వైద్యం హామీలు…అమలేదీ
ప్రతి జిల్లాలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌, ‌ప్రతి మండలంలో 30 పడకల హాస్పిటల్‌, ‌నియోజకవర్గ కేంద్రంలో 100 పడకల హాస్పిటల్‌, ‌ప్రతి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మిస్తామన్నారు. కొత్త వాటి సంగతి దేవుడెరుగు…ఉన్న హాస్పిటళ్లు నిర్వహణకే నిధులు లేని పరిస్థితి. హైదరాబాద్‌లో సనత్‌ ‌నగర్‌, ఎల్బీ నగర్‌, ఆల్వాల్‌ ‌ప్రాంతాల్లో సూపర్‌ ‌స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి మీరు భూమి పూజ చేసి ఏడాది దాటింది. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రైవేటు హాస్పిటళ్లకు రూ.800 కోట్లు ప్రభుత్వం బకాయి ఉండటంతో అవి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నప్పటికీ వైద్యం అందడం లేదు. ఈ నేపథ్యంలో మీ ప్రభుత్వానికి చివరి బడ్జెట్‌ ‌సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ప్రజలకు మీరిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇది మీకు చివరి ఛాన్స్. ఇప్పటికైనా బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించి…వొచ్చే పది నెలల కాలంలో ఈ హామీలన్నింటిని నెరవేర్చాలని డిమాండ్‌ ‌చేస్తున్నాను. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో మీకు వోట్లు అడిగే హక్కులేదు..అని లోక్‌ ‌సభ సభ్యుడు ,ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ అధ్యక్షుడు  ఎ. రేవంత్‌ ‌రెడ్డి లేఖ లో పేర్కొన్నారు.

Leave a Reply