Take a fresh look at your lifestyle.

పర్యావరణ వినాశనం కారణంగానే హిమనదాల్లో ప్రమాదాలు

ఉత్తరాఖండ్‌ ‌లోని చమోలీ జిల్లాలో ఆదివారం సంభవించిన ఘోర ప్రళయంలో 170 మంది పైగా గల్లంతు కావడం, 19 మృతదేహాలు బయటపడటం దురదృష్టకరం. వాతావరణ సమతూక స్థితి దెబ్బతింటే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ సంఘటన రుజువు చేస్తోంది.ఇలాంటివి శీతాకాలంలో సంభవించడం చాలా అరుదైన విషయమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ దుర్ఘటనలో చమోలీ జిల్లాలో రెండు జల విద్యుత్‌ ‌కేంద్రాలు, ఐదు వంతెనలు కొట్టుకుని పోయాయి.

జల విద్యుత్‌ ‌కేంద్రాలు అవసరమే కానీ, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా లేని ప్రాంతాలలో వీటిని చేపట్టడం ఎంత ప్రమాదకరమో ఈ దుర్ఘటనలు గుర్తు చేస్తున్నాయి. మంచు చరియలు విరిగి పడటంతో ఈ దుర్ఘటన సంభవించిందని చెబుతున్నారు. చమౌలీ జిల్లాలో ధూలీ గంగా పై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. ఉత్తరాఖండ్‌ ‌లో బీజేపీ ప్రభుత్వం ఈ అనుమతులు ఇచ్చిందని చెబుతున్నారు.అయితే, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారని కమలనాథులు ఆరోపిస్తున్నారు.ఏమైనా పర్యావరణం పట్ల మనుషుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

ఈ దుర్ఘటనలో చిక్కుకున్న వారిని ఎన్‌ ‌డిఆర్‌ ఎఫ్‌,ఇం‌డో టిబెటన్‌ ‌బృందాలు రక్షిస్తున్నారు.ఒక్క ఫోన్‌ ‌కాల్‌ ‌తో 16 మందిని రక్షించారట. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు అతీతంగా సాయం అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి గల్లంతయిన వారిని రక్షించేందుకు చివరి వరకూ ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాఖండ్‌ ‌ప్రాంతాన్ని వేదభూమిగా పరిగణిస్తారు.

తీర్థయాత్రలకు వెళ్ళేవారంతా ఈ ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటారు. వీరంతా తమ వెంట తీసుకుని వెళ్లే పాలథిన్‌ ‌సీసాలు, సంచులు., ఇంకా పర్యావరణ భంగకరమైన వస్తువులను అక్కడ విడిచివేస్తుంటారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడానికి అది కూడా ఒక కారణం. సాధారణంగా ఇలాంటి ప్రాంతాల్లో జన సంచారం ఉండదని భావిస్తుంటారు. కానీ, తీర్ధయాత్రల పేరిట వెళ్ళేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ట్రావెల్‌ ఏజెన్సీలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి యాత్రికులను ఆకర్షిస్తున్నాయి. జీవితంలో ఒక్కసారైనా హిమానీ నదీ ప్రాంతాలను సందర్శించి రావాలన్న కోరికతో యాత్రలకు బయలు దేరుతుంటారు.ఈ ప్రాంతాల్లో నిషిద్ధ వస్తువుల వాడకం పెరిగినట్టు ఈ మధ్య వార్తలు వొస్తున్నాయి.

- Advertisement -

వాతావరణ పరిరక్షణ గురించి హెచ్చరించేవారిని చాదస్తులుగా పరిగణించేవారు మనలో చాలా మంది ఉన్నారు. ఎప్పుడో ప్రమాదం జరిగితే తప్ప పర్యావరణానికి కలుగుతున్న హానిని జనం గుర్తించరు. చమేలీ జిల్లాలో అండర్‌ ‌గ్రౌండ్‌ ‌ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికుల్లో అత్యధికులు గల్లంతయినట్టు చెబుతున్నారు.ఈ జిల్లాలో జలవిద్యుత్‌ ‌కేంద్రాల కాంట్రాక్టులు నిర్వహిస్తున్న వారిలో తెలుగువారు కూడా ఉన్నారు. జలవిద్యుత్‌ ‌కేంద్రాలు రిస్క్ ‌తో కూడినది. వరదలు సంభవించే ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టుల నిర్మాణం రిస్క్ ‌తో కూడినదే. అయితే, ఈ ప్రాంతంలో నిర్మించే ప్రాజెక్టులకు ప్రభుత్వాలు సబ్సిడీలు, ఇతర సదుపాయాలు కల్పించడం వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాబాలు ఆర్జించవచ్చని ఇన్వెస్టర్లు ముందుకు వొస్తుంటారు.. ఉత్తరాఖండ్‌ ఉత్తరప్రదేశ్‌ ‌నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావడానికి ముందే ధౌలీ గంగా నదిలో ఇలాంటి ప్రమాదాలు సంభవించాయని ఆ ప్రాంతానికి చెందిన పెద్దలు చెబుతున్నారు.

1991లో సంభవించిన భూకంపంలో 768 మంది మరణించారు. వేలాది మంది నిర్వాసితులయ్యారు. ఎత్తైన ప్రదేశాల్లో నివసించేవారు రిస్క్ ‌తో కూడిన జీవనాన్ని సాగిస్తున్నామని తెలుసున్నా వేరే గత్యంతరం లేక ఆ ప్రాంతాల్లోనే గుడిసెలు, తాత్కాలిక షెల్టర్లు వేసుకుని జీవనం సాగిస్తుంటారు. యాత్రలకు వొచ్చే వారికి సాయపడుతూ వారందించే డబ్బులతో జీవనం సాగిస్తుంటారు. ధౌలిగంగా నది కూడ పవిత్రమైనదిగా హిందువులు పరిగణిస్తుంటారు. అక్కడ పరిసర ప్రాంతాలను సందర్శించేందుకు మధ్యలో మజిలీ చేస్తుంటారు. పిథోర్‌ ‌గఢ్‌ ‌జిల్లాలో 1998లో 55 మంది కైలాస్‌ ‌మానస సరోవర్‌ ‌యాత్రికులతో సహా 255 మంది మరణించారు. తాజాగా 2013లో రోజుల తరబడి కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు వేలాది మంది మరణించారు. ఇలాంటి విపత్తులన్నీ పర్యావరణ సమతూక స్థితి దెబ్బతినడం వల్ల సంభవించినవేనని పర్యావరణ వేత్తలు తేల్చారు.

ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి అనేక రాయితీలు ఇస్తోంది. వీటికి ఆశపడి పర్వతారోహణ రంగంలో అనుభవం లేనివారు ట్రావెల్‌ ఏజెన్సీలు నిర్వహిస్తూ అమాయకుల ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు ఉన్నప్పటికీ కాసుల కోసం ఆశపడి అనుభవం లేని వారికి అనుమతులు ఇస్తున్నాయి. ఈ ఘటనలో మరణించిన వారంతా కార్మికులు కావడం వల్ల టన్నల్‌ ‌ని తవ్వించే కాంట్రాక్టు కంపెనీయే వారి కి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తగిన సాయాన్ని అందించాలి.ఇలాంటి ప్రాంతాల్లో పనులకు అనుమతిచ్చేటప్పుడు అన్ని కోణాల్లో పరిశీలన జరిపిన తర్వాతనే అనుమతులు ఇవ్వాలి.ఇలాంటి ప్రమాదాలను అనుభవంలోకి తీసుకోవాలి. మానవ తప్పిదాలకు అమాయకుల ప్రాణాలు బలిగొనే ప్రమాదాలను నివారించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది సమాన బాధ్యత.

Leave a Reply