భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 02 : ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం సోమవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛారణలు, దూప, దీపాల నడుమ జయ జయ గంటలు మోగుతుండగా స్వామివారి దర్శనాన్ని చూసి తరించడానికి ప్రతీ భక్తుడు జై శ్రీరామ్.. జై శ్రీరామ్ అంటూ తన్మయంతో వైకుంఠ రాముడి కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఆ గడియలు ఆసన్నం అయ్యాయి. ఉదయం 5 గంటలు ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకోగానే భక్తులు తమ ఆరాధ్య దైవమైన స్వామిని కనులారా దర్శించుకుని నిర్మలమైన మనస్సుతో పునీతులయ్యారు.
దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజామున ఉత్తరద్వారం గుండా గురుడ వాహనంపై శ్రీరామచంద్రుడు భక్తులకు శ్రీమహావిష్ణువు రూపంలో దర్శనం ఇచ్చారు. ముక్కోటి ఏకాదశి అంటేనే పరమ పవిత్రమైన రోజు కాడంతో పాటు దేవదేవునికి ఇష్టమైన రోజు. ఉత్తర ద్వారంలో కొలువైన భదాద్రి రాముడిని దర్శించుకోవడం కోసం తెల్లవారుజామునే గౌతమి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, వేకువజాము నుండే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉత్తర ద్వారంలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకుంటే ఏకకాలంలో ముక్కోటి దేవతలను దర్శించుకున్నట్లే అని పురాణాలు చెప్తున్నాయి. ఈ తరుణంలో ఉత్తర ద్వార దర్శనంకు విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. వైకుంఠాన్ని తలపించేలా ఉత్తర ద్వారదర్శనం జరిగింది. ద్వారదర్శనం కోసం తెల్లవారుజామున 5 గంటలకు మంగళహారతులు, మేళతాళాల మధ్య, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఉత్తర వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.
ఒక్కసారిగా భక్తుల రామ నామ కీర్తనలతో ఆ ప్రాంతం అంతా మారుమ్రోగింది. స్వామివారిపై పుష్పవర్షం పడుతుండగా గరుడ వాహనంపై స్వామివారి దర్శనం జరిగింది. దూప, దీప, నైవేధ్యాల మధ్య సీతారామచంద్రస్వామి వారిని ఉత్తర ద్వారంలో దర్శించుకుని పునీతులు అయ్యారు. సామాన్య భక్తులకు కూడా స్వామివారి దర్శనం కల్పించాలనే ఉద్దేశ్యంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య,ఎమ్మెల్సీ తాతా మధు,కలెక్టర్ అనుదీప్,ఎస్పీ డా.వినీత్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రూ,భద్రాచలం ఏఎస్పీ రోహిత్‌రాజ్,దేవస్ధానం ఇఓ శివాజీ,తాహాసీల్దార్ శ్రీనివాస్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.