చర్చల పేరుతో కాలయాపన
కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు
బీజేపీ గాలి బుడగ లాంటిది.. వొచ్చే ఎన్నికల్లో పగిలిపోతుంది
టీఆర్ఎస్, బీజేపీది గల్లీలో కుస్తీ… ఢిల్లీలో దోస్తీ
హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో పిసిసి చీఫ్ ఉత్తమ్
ఢిల్లీలో తీవ్రమైన చలిలో 44 రోజులుగా రైతులు నిరసన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రైతులు చలిలో వణుకుతున్నా ప్రధాని మోదీ కనికరించడం లేదన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప రైతుల డిమాండ్లపై నోరు మెదపడం లేదని ఆక్షేపించారు. రైతుల పట్ల కనీస మానవత్వం కూడా లేకుండా వ్యహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కేంద్రం ప్రభుత్వం తీసుకువొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ వారికి మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. గత 44 రోజులుగా ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు కాంగ్రెస్ నేతలు ఆర్థిక సాయం అందజేయాలని నిర్ణయించారు. శనివారం ఉదయం రైతుల ఉద్యమానికి మద్ధతుగా ఇందిరాపార్క్ వద్ద సీఎల్పీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. సీఎల్పీ నేత భట్టి, జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, వీహెచ్, రాజయ్య తదితరులు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతులకు ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు నేతలు ప్రకటించారు.
సీఎల్పీ నేత భట్టికి నేతలు ఆర్థిన సాయం అందజేశారు. కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రూ.40వేలు, వీ. హనుమంతరావు
రూ. 5వేలు, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం భట్టికి అందజేశారు. అలాగే విమలక్క సోదరుడు రూ. 2వేలు అందజేశారు. ఈ ఆర్థిక సాయాన్ని ఢిల్లీలో రైతులకు టీ.కాంగ్రెస్ బృందం అందజేయనుంది. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్‌రెడ్డి మరోసారి టీఆర్ఎస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల అభ్యర్థి జానారెడ్డి అని.. ఆయన మంచి మెజారిటీతో గెలుస్తారన్నారు. ప్రజలు ఈసారి కాంగ్రెస్‌ను ఆదరిస్తారని పేర్కొన్నారు. బీజేపీ గాలి బుడగ లాంటిదని.. వొచ్చే ఎన్నికల్లో బీజేపీ బుడగ.. పగిలిపోతుందని ఎద్దేవా చేశారు. ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైందో చెప్పి బీజేపీ వరంగల్ ఎన్నికల్లో ప్రచారాని రావాలని.. ఖమ్మంలో గిరిజన యూనివర్సిటీ ఏమైందో చెప్పాలని నిలదీశారు. మతపరమైన అంశాలు తప్పితే బీజేపీ అభివృద్ధి గురించి ఏం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్, బీజేపీది గల్లీలో కుస్తీ… ఢిల్లీలో దోస్తీ అన్నట్టు ఉందని…రైతు వ్యతిరేక చట్టాలను కూడా ఇప్పుడు కేసీఆర్ మద్దతు పలికారని మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాలు కొరోనా సమయం కాబట్టే ఏర్పాటు చేసినట్టు అబద్దం చెప్పారని.. రైతులకు మేలు చేసే అంశం..లాభ నష్టాల గురించి ఆలోచిస్తారా..? అని ప్రశ్నించారు. 7 వేల కోట్లు నష్టం వొచ్చిందని చెప్పడం..కేసీఆర్ చేతగానితనానికి నిదర్శనమన్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై సీనియర్లతో సమావేశమై.. అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తులపై జీవన్ రెడ్డి కమిటీ ఉందని..ఆ నివేదిక ఆధారంగా టాగూర్ ప్రకటన చేస్తారని తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి సాగర్‌లో డిపాజిట్ కూడా రాదన్నారు. రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. . రైతులకు లక్ష రుణమాఫీ, పంటబీమా చేసే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదన్నారు. 11న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు నిచ్చిందని తెలిపారు. అలాగే ఆదివారం ఇందిరాభవన్‌లో రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి మొగుడిని అవుతానంటూ ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ట్రాన్స్ జండర్ అయ్యారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. కేసీఆర్ శిఖండిగా మారారని విమర్శించారు. ఢిల్లీలో మోదీ కాళ్ళు పట్టుకున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు. తెలంగాణ కేసీఆర్ జగీర్ కాదని, రైతు బంధు పథకం పచ్చి మోసమన్నారు. రైతుకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తమ అధినేత్రి సోనియా గాంధీ.. ఎక్కడ పుడితే ఏంటని, పేదల బాధలు తెలిసిన మనిషి అంటూ ప్రశంసించారు. శ్మశానవాటికలు, డప్పింగ్ యార్డులను కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉపాధి హా పథకంతోనే అభివృద్ధి చేస్తున్నారన్నారు. మంత్రులను రోడ్లపై కూర్చో పెట్టిన కేసీఆర్ వ్యవసాయ చట్టంపై యూ టర్న్ తీసుకున్నారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బస్తాయన్నారు. కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు న్యాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతుకు మద్దతు ధర కల్పించిందని, ధాన్యం కొనుగోలుకు దుకాణం తెరవకుంటే.. టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు.
తెలంగాణ రాబంధుల సమితి
టిఆర్ఎస్పై మండిపడ్డ మధుయాష్కీ
కెసిఆర్ యూటర్న్ సిఎం అన్న శ్రీధర్ బాబు
తెలంగాణ రాష్ట్ర సమితి రాబంధుల సమితిగా మారిందని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కి ఆరోపించారు. వ్యవసాయ చట్టాలకు మద్దతు ఇవ్వటమంటే రైతులకు ద్రోహం చేయటమేనని అన్నారు. రైతు పోరాటంలో నిరుద్యోగులను సైతం కలుపుకుని వెళ్లాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికొదిలేసిందని మండిపడ్డారు. కేంద్ర వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం రద్దుచేయాలని మధుయాష్కి శనివారం ఇందిరాపార్క్ వద్ద జరిగిన ధర్నాలో డిమాండ్ చేశారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు టీ.కాంగ్రెస్ బృందం ఆర్థిక సాయం ప్రకటించారు. మధుయాష్కి లక్షరూపాయలు, ప్రేమ్‌సాగర్‌రావు రూ.50వేలు, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రూ. 40వేలు, వీ.హనుమంతరావు(వీహెచ్) రూ.5వేలు, జానారెడ్డి రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న రైతులకు అందజేస్తామని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కేసీఆర్ యూటర్న్ సీఎంగా మారారని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్‌బాబు ఆరోపించారు. రైతులపై టీడీపీ అధినేత చంద్రబాబు మాదిరే సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్‌కు సైతం చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని విమర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేస్తానని కేంద్రంతో కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. కేంద్రానికి భయపడే కేసీఆర్ వ్యవసాయ చట్టంపై వెనుకడుగు వేస్తున్నారని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.