- సుజాతక్కకు ధైర్యం చెబితే అసమర్థురాలంటావా?
- దుబ్బాక మహిళలకు ఉత్తమ్ క్షమాపణ చెప్పాలి
- కాంగ్రెస్‌లో కష్టపడ్డవారికి గుర్తింపు ఉండదు
- టిఆర్ఎస్ పార్టీలో గుండెల్లో పెట్టుకుంటాం
మేము చేసిన పనులే చెబుతాం. కాంగ్రెస్ నేతల మాదిరిగా చేయని పనులు కూడా మేమే చేశామనీ చెప్పడం మాకు చేతకాదనీ, ఒక మాటలో చెప్పాలంటే టిఆర్ఎస్ నేతలకు చెట్ల మీద ఇస్తారాకులు కుట్టడం కూడా రాదనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్ నర్సింహారెడ్డి(కెవిఎన్ఆర్), భూంపల్లి మనోహర్‌రావు కాంగ్రెస్ పార్టీని వీడి తమ అనుచరులతో కలిసి మంత్రి హరీష్‌రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్లో చేరిన కోమటిరెడ్డి వెంకట్ నర్సింహారెడ్డి, మనోహర్‌రావు వారి అనుచరులకు మంత్రి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో రైతులకు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత కరంటు, రైతుబంధు, రైతు బీమా, పేదింటి ఆడబిడ్డ పెండ్లికి ఒక లక్షా 116రూపాయలు, కేసీఆర్ కిట్, బీడీ కార్మిలకు భృతి ఇలా చెప్పుకుంటూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక సర్కార్ కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పంజాబ్, పాండిచ్చేరి, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తుందా?అని హరీష్‌రావు ప్రశ్నించారు.
కులాలకు, మతాలకతీతంగా అన్ని వర్గాలభ్యున్నతీ కోసం కేసీఆర్ సర్కార్ పని చేస్తుంటే…దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారనీ మండిపడ్డారు. మాకు చేసిన పనులే చెబుతామనీ, కాంగ్రెస్ నేతల మాదిరిగా చేయని పనులను కూడా చేసినట్టు చెప్పడం రాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసే వారికి ఎప్పుడు కూడా గుర్తింపు ఉండదన్నారు. అదే టిఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. ఇందుకు నిదర్శనమే…దుబ్బాక సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి చనిపోతే ఆయన సతీమణి సుజాతక్కకు టికెట్ ఇవ్వడమన్నారు. ఆపదలో ఉన్నామంటే ఆదుకోవడమే కాకుండా, కడుపులో పెట్టుకుని కాపాడుకుంటామన్నారు. భర్తను కోల్పోయి పుట్టెదు దు:ఖంలో ఉన్న సోలిపేట సుజాతక్కకు తాను, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి ధైర్యం చెబితే… సుజాతక్కను అసమర్థురాలు అని పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎలా మాట్లాడుతారన్నారు.
భర్త కోల్పోయిన మహిళను అసమర్థురాలు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా అంటారని ప్రశ్నించారు. యావత్ దుబ్బాక మహిళా లోకాన్ని ఉత్తమ్ కించపరిచారని హరీష్‌రావు ధ్వజమెత్తారు. తొలిసారి దుబ్బాకకు మహిళా ఎమ్మెల్యే కాబోతుందని మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పిసిసి చీఫ్ మాటలు ఒక సుజాతక్కను ఉద్దేశించి కావనీ, యావత్ దుబ్బాక మహిళా లోకాన్ని అవమానపర్చే విధంగా, కించపర్చే విధంగా ఉన్నాయనీ, యావత్ మహిళా లోకాన్ని కించపర్చిన ఉత్తమ్ తక్షణమే దుబ్బాక మహిళాలోకానికి క్షమాపణ చెప్పాలని హరీష్ డిమాండు చేశారు. దొమ్మాట నుంచి దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత తొలిసారి మహిళా ఎమ్మెల్యే కాబోతున్నందుకు మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ నేతలు వెంకట్‌నర్సింహారెడ్డి, మనోహర్‌రావు చేరికతో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు భారీ మద్దతు వస్తుందని తెలిపారు. ఈ మద్దతు చూస్తుంటే సుజాత భారీ మెజార్టీతో గెలుస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. ఎన్నికల వరకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉంటాడు. కానీ, తాము 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. కేవలం వోట్ల కోసమే వచ్చే వాళ్లకు వోట్లు వేద్దామా? ఇక్కడి ప్రజలతో కష్టసుఖాలు పాలు పంచుకునే వారికి వోటేద్దామా? అని అడిగారు. గత ఎన్నికల్లో వచ్చిన వోట్లు కూడా వస్తాయో.. రావో అని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైందనీ, కాంగ్రెస్ ప్రచారానికి పరాయి లీడర్లు…కిరాయి మనుషులను తెచ్చుకున్నారన్నారు. దుబ్బాకలో జరిగిన ఈ మీటింగ్ చూస్తుంటే యావత్ దుబ్బాక ప్రజానీకమంతా టిఆర్ఎస్ వైపే ఉందన్నారు. గడిచిన ఆరేండ్లలో టిఆర్ఎస్ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసిందన్నారు. దుబ్బాకలో ఇంటింటికి తాగునీటి నల్లా కనెక్షన్ ఇచ్చిన ఘనత సిఎం కేసీఆర్, ఎమ్మెల్యే రామలింగారెడ్డిదేనన్నారు. రామలింగారెడ్డి ఏం చేశాడో అని ప్రతి అక్కను, చెల్లెను అడిగితే ప్రతి నీటి బొట్టులోనూ సిఎం కేసీఆర్, రామలింగారెడ్డి ముఖం కనిపిస్తుందన్నారు. దుబ్బాలో రామలింగారెడ్డి వెయ్యి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించాడన్నారు. దుబ్బాక రాయసముద్రం చెరువు, మార్కెట్ కమిటీల వద్దకు వెళ్లితే దుబ్బాకలో నేనేమీ చేశానో తెలుస్తుందన్నారు.
హరీష్‌రావు ఎలా పని చేస్తాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో వచ్చిన వోట్లు రావేమో అని కాంగ్రెస్ ఫస్ట్రేషన్లో ఉందని హరీష్‌రావు విమర్శించారు. దుబ్బాకకు పదులసార్లు వచ్చాననీ, కాంగ్రెస్ నేతలు ప్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. వానా కాలం ఉసిళ్లు వచ్చినట్లుగా వోట్లు అనగానే కాంగ్రెస్, బిజెపి లీడర్లు వచ్చిపోతుంటారన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ ప్రభుత్వం ఏమీ చేయకపోగా బాయికాడ, బోరుబావుల కాడ మీటర్లు పెట్టి రైతులను ఇబ్బంది పెట్టాలని చూస్తుందన్నారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసే పార్టీలకు వోట్లు వేస్తారా? అని అడిగారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే రానున్న ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుజాతక్కను భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్, బిజెపి పార్టీలకు డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తారన్న నమ్మకం తనకు ఉందనీ హరీష్‌రావు అన్నారు. దుబ్బాకలో కాంగ్రెస్, బిజెపి పార్టీలకు ఎమ్మెల్యే అభ్యర్థులు మాత్రమే ఉన్నారనీ,కార్యకర్తలు మాత్రం లేరన్నారు. ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ..మల్లన్నసాగర్ రిజర్వాయర్ కట్టకుండా కోర్టుల్లో కేసులు వేసి, అడ్డంకులు సృష్టించిన నేతలు మళ్లీ వోట్లు అడిగేందుకు వస్తున్నారన్నారు. కాంగ్రెస్, బిజెపికి కార్యకర్తలు లేరన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలువడం తథ్యమన్నారు. కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్లో చేరిన కోమటిరెడ్డి వెంకట్‌నర్సింహారెడ్డి, మనోహర్‌రావు మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నేతలు చింతా ప్రభాకర్, బక్కి వెంకటయ్య, రొట్టె రాజమౌళి, వనిత-రాజిరెడ్డి, పుష్పలత కిషన్‌రెడ్డి, శ్రీలేఖ రాజు, రవీందర్‌రెడ్డి, బీమ సేన, ఎల్లం, సలీం తదితరులు పాల్గొన్నారు.