Take a fresh look at your lifestyle.

వ్యవసాయ చట్టాలతో.. కార్పొరేట్‌ ‌శక్తులకు ప్రయోజనం

రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు
కెసిఆర్‌ ఏకకాలంలో రుణమాఫీ చేయాలి
సన్నరకానికి క్వింటాకు రూ.2,500 చెల్లించాలి
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు కార్పొరేట్‌ ‌శక్తులకు ప్రయోజనం కల్పించేలా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కోదాడ పట్టణంలోని రాజీవ్‌ ‌చౌక్‌ ‌సెంటర్‌లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకోవచ్చనే
నిబంధనను ప్రవేశపెట్టి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలనే నిబంధన లేకుండా పార్లమెంట్‌లో చట్టాలను ఏకపక్షంగా సవరించిందని మండిపడ్డారు. ప్రతిపక్షాలు వ్యతిరేకించినా పరిగణనలోకి తీసుకోలేదన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో నవంబర్‌ 14‌న రాష్ట్రపతిని కలిసి రెండు కోట్ల సంతకాలతో కూడిన పత్రాలను సమర్పిస్తామన్నారు.

కాం‌నేతలు, కార్యకర్తలు ప్రతి మండలం నుంచి 2 వేల సంతకాలు సేకరించి టీపీసీసీకి అందజేయాలన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌రైతులకు సన్నరకాలు వేయాలని చెప్పారని..పంట చేతికి రాగానే కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉత్తమ్‌ ఆరోపించారు. సన్నరకానికి క్వింటాకు రూ.2,500, పత్తి క్వింటాకు తేమశాతంతో సంబంధం లేకుండా రూ.5,800 మద్దతు ధర చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే పంటల బీమా లేకుండా పోయిందని విమర్శించారు. వరదల కారణంగా 13 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా.. ఒక్క ఎకరాకూ నష్టపరిహారం చెల్లించలేదన్నారు. రైతులకు రూ.లక్ష రుణ మాఫీ ఏకకాలంలో చేయాలని ఉత్తమ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని..ఎల్‌ఆర్‌ఎస్‌ ఎవరూ కట్టవద్దన్నారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌ ‌లక్ష్మినారాయణ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు వెంకన్న, టీపీసీసీ ఆర్గనైజింగ్‌ ‌కార్యదర్శి ధనమూర్తి, డీసీసీ ఉపాధ్యక్షుడు సీతయ్య, పట్టణ అధ్యక్షులు రామారావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply