
ఇంతకీ ఆయన ఎందుకు వస్తున్నారంటే వచ్చే నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో ఆయన తిరిగి పోటీ చేయడమే కారణం.అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల ఓట్లను చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన జరుపుతున్నారు. మోడీపట్ల అతి గౌరవాన్నీ,ప్రేమను ప్రదర్శిస్తూ భారత్‌కు తాను అనుకూలంగా ఉన్నానని ప్రవాస భారతీయులకు చెప్పడం కోసమే ఆయన ఈ పర్యటన తలపెట్టారు. ప్రధానిమోడీకి ఇవన్నీ తెలుసు.అయినప్పటికీ అగ్రరాజ్యాధినేత వస్తున్నప్పుడు తలుపులు మూసేయడం,ఇప్పుడు కుదురదని చెప్పడం దౌత్య మర్యాద అనిపించుకోదు.అంతేకాక,హెచ్-1 బి వీసాల తగ్గింపు వల్ల భారత్‌లో ఐటి నిపుణులకు ఇబ్బంది కలుగుతోంది. పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోకపోయినా,కనీసం ఇలాంటి విషయాల్లో అయినా ట్రంప్‌ని మొహమాట పెట్టవచ్చని ప్రధానిమోడీ భావిస్తున్నారు.అంతేకాక, వాణిజ్యం విషయంలో ప్రాధాన్యాన్ని ఇచ్చే జిపిఎస్ విధానం విషయంలో అమెరికా వైఖరి మారేట్టు చూడటం మోడీ లక్ష్యం,అమెరికాతో రక్షణ,వాణిజ్యరంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు పనిలో పనిగా కుదిరితే చేసుకోవచ్చని మోడీ భావిస్తున్నారు.అయితే,ట్రంప్ నిలకడ లేని మనిషి అని గతంలో ఎన్నో సార్లు రుజువైంది. ఈసారి పర్యటనలో పెద్ద ఒప్పందాలేవీ ఉండబోవని ఒకసారి,బ్రహ్మాండమైన ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని మరోసారి లీకులు ఇప్పించారు.
ఏమైనా ట్రంప్ పర్యటనపై మన దేశం పెద్ద ఆశలు పెట్టుకోవడం లేదు.పైగా ట్రంప్ విధిస్తున్న ఆంక్షలను మన దేశం అసలు అంగీకరించడం లేదు.ట్రంప్ విమానం గురించి ఆయన మెనూ గురించి మీడియాకు మేత దొరుకుతోంది కానీ, దేశంలో పేదలకు ఉపయోగ పడే పథకాలు,ప్రాజెక్టుల గురించి అగ్రరాజ్యాధినేత నుంచి గట్టి హామీ వస్తుందన్న నమ్మకం లేదు.ట్రంప్ కుమార్తె ఇవాంకా గతంలో హైదరాబాద్‌లో మహిళా పారిశ్రామిక సదస్సుకు హాజరైనప్పుడు ఇంకముందు,అమెరికన్ పరిశ్రమలన్నీ మన దేశానికి తరలి రానున్నాయని మన మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.కానీ ఫలితం శూన్యం.ఈసారి కూడా అటువంటి ప్రచారమే జరుగుతోంది.కానీ,ఈసారి కూడా అమెరికా నుంచి రిక్త హస్తమే ఉండవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి ట్రంప్ పర్యటనపై పెద్దగా ఆశలు పెట్టుకోవడానికి లేదు.మన దేశం మాత్రం మొహమాటం కోసం అమెరికా నుంచి హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు ముందే హామీ ఇచ్చేసింది.టంప్ మనదేశానికి ఇచ్చే వరాలు ఏమీ ఉండవు.ఇరాన్ నుంచి చమురు దిగుమతి చేసుకోవద్దంటూ గతంలో హుకుం జారీ చేసినట్టు మరిన్ని హుకుంలు జారీ చేయకుండా ఉంటే చాలు.