- భారీ జన సమీకరణ దిశగా సమావేశాలు
- కేసీఆర్ చలువ వల్లే ఉమ్మడి ఖమ్మం ప్రగతి
- వివరాలు వెల్లడించిన మంత్రులు హరీష్రావు,
- పువ్వాడ అజయ్, పార్టీ నాయకులు
ఖమ్మం/కొత్తగూడెం, జనవరి 16 : దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఖమ్మం జిల్లా వేదికగా ఈ నెల 18న భారీ బహిరంగ సభ ద్వారా శంఖారావం పూరించనున్నారు. ఈ నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ నేతలు శక్తులన్నీ ఒడ్డి సభను విజయవంతం చేయాలని పట్టుదలతో వున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణలో మంత్రి హరీష్ రావు నేతృతంలో నాయకులు పనుల్లో తలమునకలయ్యారు. ఈ సందర్భంగా సోమవారం సభ విజయవంతానికి ఖమ్మం బీఆర్ ఎస్ జిల్లా కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, పువ్వడా అజయ్ కుమార్, ఎంపీలు నామ నాగేశ్వరరావు, విద్దిరాజు రవిచంద్రలు మాట్లాడుతూ…దేశ రాజకీయాలను మలుపుతిప్పే సభకు ఖమ్మం జిల్లా వేదికగా నిలవబోతుందని అన్నారు.
100 ఎకరాలలో బహిరంగ సభ నిర్వహిస్తుండగా 448 ఎకరాలలో వాహనాలు నిలిపేందుకు 20 పార్కింగ్ స్టాండ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13 జిల్లాల నుడి ప్రజలను భారీగా సమీకరిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 18న జరిగే సభకు ఊరూ వాడల్లోని జనాలు ఒక్కటిగా పెద్ద ఎత్తున ఉవ్వెత్తున కదలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఖమ్మం నియోజకవర్గం నుంచి భారీ జన సమీకరణ చేపట్టాలని నేతలను కోరారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో చేశారని, అందుకు ప్రతిఫలంగా ఆయనకు జిల్లా ప్రజాబలం అండగా నిలవాల్సిన సమయం వొచ్చిందని నామా తెలిపారు. అందుకు ప్రతీ నాయకుడు, కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉమ్మడి జిల్లా నాయకులపై పెట్టిన ఈ బాధ్యతను సమిష్టి కృషితో విజయవంతం చేయాలన్నారు. జనాన్ని భారీగా తరలించి కేసీఆర్ కిచ్చిన మాటను నిలుపుకోవడమే మన లక్ష్యంగా పని చేయాలన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమం కేవలం 8 ఏళ్ళలో సీఎం చేసి చూపించారని తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అద్భుత ప్రగతి జరిగిందన్నారు. సీఎం చలువతో ఖమ్మం అనూహ్యమైన అభివృద్ధిని సాదించిందన్నారు. తాగు, సాగు, కరెంట్ సమస్యే లేదన్నారు. ఒకప్పుడు ఖమ్మంలో ప్రతి దుకాణం ముందు జనరేటర్ ఉండేదని, వందలాది జనరేటర్ల హోరు ఉండేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఎక్కడా కరెంట్ సమస్య కనిపించడం లేదన్నారు. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ…ఖమ్మం అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా ఉందన్నారు. సీఎం సభకు భారీగా తరలి రావాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయకుమార్ ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాలెపు కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే రాములు నాయక్, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వ రరావు, డీసీసీబీచైర్మన్ కూరాకుల నాగభూషణం పాల్గొన్నారు.