మధిర, జూన్ 4 (ప్రజాతంత్ర) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలను గురువారం ముమ్మరంగా నిర్వహించారు. రెండో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మధిర మున్సిపాల్టీ పరిధిలోని 13వ వార్డులో కౌన్సిలర్ బిక్కి అనిత ఆధ్వర్యంలో జెసిబి సహాయంతో కాల్వల పూడికతీత పనులు చేపట్టారు. జిలుగుమాడు 1వ వార్డులో కౌన్సిలర్ పగిడిపల్లి విజయమ్మ ఆధ్వర్యంలో కాల్వ శుభ్రపర్చే పనులను నిర్వహించారు. అలాగే 18వ వార్డులో కౌన్సిలర్ అరిగె రజిని ఆధ్వర్యంలో జెసిబితో వివిధ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించారు. అదేవిధంగా పల్లె ప్రగతిలో భాగంగా రాయపట్నంలో గ్రామ సర్పంచ్ నండ్రు సుశీల ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలు తొలగించటం వంటి కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా గొల్ల నాగేశ్వరరావు తన సొంత ఖర్చుతో తయారు చేయించిన మాస్కులను ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో మధిర సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్, టిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి అరిగె శ్రీను, గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, మండల అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.