
- 30 పడకల ఆస్పత్రి సందర్శన – సుల్తానాబాద్‌లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యటన
సమస్యల పరిష్కార దిశగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్, పబ్లిక్ టాయిలెట్స్, 30పడకల ఆసుపత్రిలను గురువారం కలెక్టర్ పరిశీలించారు. చెత్త సేకరణ, పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ద్య నిర్వహణ, పచ్చదనం పెంపొందించడానికి వార్డుల వారిగా అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీలో ఖాళీగా అపరిశుభ్రంగా ఉన్న స్థలాలను గుర్తించి సదరు భూ యాజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. ప్రభుత్వ స్థలాలను శుభ్రం చేయాలని, అక్కడ చెత్త వేస్తే భారీ జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణ వ్యర్థ పదార్థాలను, చెత్త, పిచ్చి మొక్కలను, పొదలు, తుప్పలను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. మొక్కలు నాటడానికి అనువైన స్థలాలను, ఇంటింటి సర్వే చేసి అవసరమైన మొక్కల వివరాలు సేకరించాలన్నారు.
పచ్చదనం పెంపొందించే దిశగా హరితప్రణాళిక సిద్దం చేయాలన్నారు. సర్వేలో భాగంగా నిరక్షరాస్యుల వివరాలు సేకరించాలన్నారు. విద్యుత్ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రణాళిక రూపొందించాలన్నారు. మార్కెట్లో రోడ్లు పక్కన విక్రయిస్తున్న వ్యాపారుల కోసం అదనపు గదుల నిర్మాణం కొరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ పనులు 3నెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక 30పడకల ఆసుపత్రిని సందర్శించి హాజరు రిజిష్టర్‌ను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. గర్భీణీ స్త్రీల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవల గురించి రోగులతో మాట్లాడి కలెక్టర్ తెలుసుకున్నారు. గర్భణీ స్త్రీలకు కేసిఆర్ కిట్‌ను కలెక్టర్ పంపిణి చేశారు. ఈ పర్యటనలో సుల్తానాబాద్ మున్సిపల్ కమీషనర్ శ్యాంసుందర్ రావు, సంబంధిత అధికారులు, వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.