Take a fresh look at your lifestyle.

రెండేండ్లకే రెడీ అంటిరి.. మూడేండ్లైనా ముగింపుకు రాకపాయె..!

“రోడ్డు రద్దీ కారణంగా ట్రాఫిక్‌ ‌చిక్కులతో అనునిత్యం అవస్థలు పడుతున్న వాహనచోదకులకు సాంత్వన చేకూర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రారంభించిన ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులు నత్త నడకన సాగుతున్నాయి..ఉప్పల్‌ ‌నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్‌(‌స్కైవే) కారిడార్‌ ‌నిర్మించాలని ప్రభుత్వాలు నిర్ణయించి అందుకు అవసరమైన నిధులు మంజూరీ చేసి మూడేళ్ళ క్రితం పనులు ప్రారంభించినా నేటికీ పనులు అరకొరగానే కొనసాగుతుండడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.”

  • నత్తకు పోటీగా ఉప్పల్‌-‌నారపల్లి ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులు..
  • కొన్ని చోట్ల ఇంక షురూ కాని పిల్లర్ల నిర్మాణం..
  • పనుల్లో వేగం పెంచాలంటున్న ప్రజలు..

ట్రాఫిక్‌ ‌చిక్కులు లేకుండా అటు హైదరాబాద్‌, ఇటు వరంగల్‌ ‌మహా నగరాలకు సులువుగా చేరుకునేందుకు ఉద్దేశించిన ఉప్పల్‌-‌నారపల్లి ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌పనులు మందకొడిగా సాగుతుండడంతో అసంతృప్తి వ్యక్తమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీహెచ్‌ఎం‌సీల సంయుక్తాధ్వర్యంలో భారీ వ్యయంతో 6.4 కిలోమీటర్ల మేర పొడవైన ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ఏర్పాటు పనులు 2018 జూన్‌ ‌నెలలో ప్రారంభించారు. ఇందుకు అవసరమైన భూసేకరణ మూడు నెలల్లో పూర్తి చేసి రెండేళ్ళలో 2020 వరకు పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్ధేశించిన గడువు రెండేళ్ళ కాలపరిమితి దాటి మూడు సంవత్సరాలు పూర్తయినా పనుల్లో పురోగతి లేక ఇంకా కొన్ని చోట్ల పిల్లర్ల పనులు కూడా ప్రారంభం కాని పరిస్థితి నెలకొందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎం‌సీలో భాగమైన ఉప్పల్‌ ‌నుంచి పీర్జాదిగూడ కార్పొరేషన్‌ ‌పరిధిలోని మేడిపల్లి శివారు వరకు ట్రాఫిక్‌ ‌రద్దీ అధికంగా ఉంటుండడంతో ఈ ప్రాంతాలు దాటాలంటే గంటల సమయం పడుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణానికి అంకురార్పణ చేశాయి.

అయితే నిర్ధేశించిన గడువు మించిపోయినా ఈనాటికీ ఉప్పల్‌లో పలు చోట్ల పిల్లర్ల ఏర్పాటు కోసం పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. అయితే ఉప్పల్‌లో రోడ్డు విస్తరణ(భూసేకరణ)కు అడ్డంకిగా ఉన్న భవనాల తొలగింపు పక్రియ కొద్ది రోజుల్లో తుది అంకానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ పిల్లర్ల నిర్మాణ పక్రియకు మరికొంత కాలం పట్టే అవకాశం ఉండొచ్చని పలువురు పేర్కొంటున్నారు. మేడిపల్లి, పీర్జాదిగూడలలో కొన్ని చోట్ల రోడ్డు విస్తరణ(భవనాల తొలగింపు) చేపట్టాల్సి ఉన్నా నేటికీ ఆ తతంగం కార్యాచరణకు నోచుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పనులు ప్రారంభించిన మూడు, నాలుగు నెలల్లోనే భూసేకరణ పక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పుకొచ్చినా ఇంకా ఆ తంతు పూర్తికాకపోవడం ఏమిటని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Uppal-Narapalli Elevated Corridor is in a state of disrepair

నిరాశకు గురవుతున్న ప్రజలు..
ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణానికి అంకురార్పణ జరగడంతో తమ ట్రాఫిక్‌ ‌కష్టాలకు చెక్‌ ‌పడుతుందని ఎగిరి గంతేసిన పలువురు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణం ఎప్పుడెప్పుడు పూర్తవుతుందా అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ప్రజలకు పనుల ఆలస్యం నిరాశను మిగులుతుంది. ట్రాఫిక్‌ ‌కష్టాలతో నిత్యం నలిగిపోతున్న తమకు ఈ పనులు పూర్తై కారిడార్‌ అం‌దుబాటులోకి వొస్తే ఎంతో ఉపశమనం లభిస్తుందని ఆశతో ఎదురు చూసిన వారంతా పనుల పురోగతిపై పెదవి విరుస్తున్నారు. పనులు ప్రారంభమై మూడేళ్ళు గడిచిపోయినా నేటికీ 50 శాతం మించి కూడా సాగకపోవడం ఏందని ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్‌ ‌శివారులోని పీర్జాదిగూడ, బోడుప్పల్‌, ‌మేడిపల్లి, చెంగిచర్ల, పర్వతాపూర్‌ ‌ప్రాంతాలు నానాటికీ విస్తరిస్తూ జనాభా అంతకంతకు రెట్టింపవుతున్న కారణంగా ట్రాఫిక్‌ ‌చిక్కులతో బేజారవుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వాలు పనులను యుద్ధప్రాతిపదికన వేగవంతంగా పూర్తి చేయించి అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.

పీర్జాదిగూడ బల్దియాకు నో యూజ్‌..!
‌పీర్జాదిగూడ బల్దియా పరిధిలోని పీర్జాదిగూడ, మేడిపల్లి ప్రాంతాల మీదుగానే ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ఏర్పాటవుతున్నా ఉప్పల్‌ ‌నుంచి నారపల్లి వరకు మధ్యలో ఎలాంటి కనెక్టివిటీలు, ర్యాంపులు ఇవ్వకపోవడంతో తమకు దీని వల్ల ఒరిగేది ఏముందని ఇక్కడి నివాసితులు ప్రశ్నిస్తున్నారు. అయితే కొద్ది మేర ట్రాఫిక్‌ ‌తిప్పలు తప్పుతాయేమో కానీ, స్కైవే ఎక్కిన వాహనాలన్నీ నేరుగా వెళ్లిపోతాయని దీంతో తమ వ్యాపారాలకు నష్టం చేకూరుతుందని ఇక్కడి వ్యాపారులు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. తమ వ్యాపారాలు దెబ్బతినకుండా ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌ప్లాన్‌లో వీలయితే కొద్ది పాటి మార్పులతో పీర్జాదిగూడ, మేడిపల్లి ముఖ్య కూడళ్ళలో ర్యాంపులు ఏర్పాటు చేయించి ఈ ప్రాంతాల్లోనూ వాహనాలు ఎక్కి, దిగే సౌకర్యం కల్పించాలని వ్యాపారులు, స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply