- రాహుల్, ప్రియాంకలను అడ్డుకున్న పోలీసులు
- హత్రాస్ హత్యాచార ఘటనపై అట్టుడికిన యూపి
- కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో సర్వత్రా ఉద్రిక్తత
- పోలీసులతో ఘర్షణలో కిందపడ్డ రాహుల్
- యోగీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న మాయావతి, అఖిలేశ్
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్రాస్‌లో చోటుచేసుకున్న హత్యాచార ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. మానవ మృగాల చేతిలో హత్యాచారానికి గురై చికిత్స పొందుతూ బాలిక మృతిచెందడం పట్ల విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మహిళల రక్షణ పట్ల తీవ్రంగా విఫలమైందని విమర్శిస్తున్నాయి. తాజాగా ఘటనపై యూపీ కాంగ్రెస్ విభాగం ప్రధాన నగరాల్లో నిరసన చేపట్టింది. మరోవైపు బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, యూపీ బాధ్యురాలు ప్రియాంక గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ హథ్రాస్‌కు బయలుదేరగా వారిని మధ్యలోనే నిర్బంధించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానిక పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు. బాధితురాలి గ్రామం చుట్టు భారీ ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేసి ఎవరినీ లోపలకి అనుమతించ లేదు. రాహుల్, ప్రియాంక రాక సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున హథ్రాస్‌కు చేరుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను కలిసేందుకు వారికి పోలీసు అనుమతి ఇవ్వకపోవడంతో పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పర్యటనకు వీల్లేదని రాహుల్, ప్రియాంకను రోడ్డుపైనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంత హైటెన్షన్ నెలకొంది. . ఈ దశలో హత్రాస్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంకలు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో అత్యాచార ఘటనలకు బాధ్యత వహిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. యూపీలో మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయన్నారు. బీజేపీ దళిత వ్యతిరేక ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. 2012 నిర్భయ ఘటనపై దేశంలోని మధ్య తరగతి ప్రజలందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. కానీ హత్రాస్ దళిత యువతి మృతి పట్ల ఎవరూ సానుభూతి చూపడం లేదు. ఆమె దళితురాలు కాబట్టి లేదా గ్రామీణ యువతి కాబట్టి అని దిగ్విజయ్ పేర్కొన్నారు. విపక్షాలు కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని దిగ్విజయ్ సింగ్ అన్నారు.