- మండిపడుతున్న ఉద్యోగ సంఘాల నేతలు
ఉద్యోగస్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పదకొండవ పీఆర్సీ గడువును మరోమారు పొడిగించారు. ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జులై ఒకటి, 2018 నుండి అమలు చేయాల్సిన పీఆర్సీని… నివేదిక ఇంకా రాని నేపధ్యంలో… గడువును డిసెంబర్ 2020 వరకు పొడగించారు. దీనిపై ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్టీయూఎఫ్) తీవ్రంగా ఖండించింది.జూన్ 2, 2018 నుండి మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తామని, 2018 ఆగస్టు 15 న పిఆర్సీ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించి, ఇరవై నెలలు గడుస్తున్నా అమలుకు నోచుకోలేదని టీఎస్టీయూఎఫ్ ధ్వజమెత్తింది. ఇవ్వాళ, రేపు అంటూ ప్రకటనలకే నేతలు పరిమితమవుతున్నారని టీఎస్టీయూఎఫ్ నేతలు చావా రవి తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ అమలు జాప్యంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రమైన అసంతృప్తి తో ఉన్నారని వెల్లడించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఫిట్మెంట్ను 45 శాతంతో తక్షణమే ప్రకటించాలని కోరారు. ఇక ఉపాధ్యాయ సంఘాలన్నీ ఇప్పటికైనా ఐక్యంగా ఉద్యమించి, ప్రభుత్వం నుంచి న్యాయమైన పీఆర్సీతోపాటు సీఎం ఇచ్చిన ఇతర హాల అమలు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఇక పీఆర్సీ గడువు పెంపుపై టీ పీసీసీ తీవ్రంగా మండిపడింది. ’భజన సంఘాల నేతల్లారా ? నిద్రపోతున్నారా ? చేవ చచ్చిందా ? అంటూ టీ పీసీసీ అధికార ప్రతినిధి, టీ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు జి. హర్షవర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిత్యం సీఎం కేసీఆర్ భజనలు, పాలాభిషేకం చేస్తూ, కేలండర్లు, డైరీల్లో వారి ఫోటోలను పెట్టుకుంటున్న టీజీఓ, టీఎన్జీఓలు సహా కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని హర్షవర్ధన్ రెడ్డి నిలదీశారు. ఇప్పటికైనా ఉద్యమానికి సిద్ధం కావాలని హితవు పలికారు. పీఆర్సీలపై ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి అన్నారు. ఇప్పటికే రెండు పీఆర్సీలు కోల్పోయామని తెలిపారు. తెలంగాణ కోసం కష్టపడి పనిచేస్తున్నాం..కొత్త జిల్లాల్లో స్టాఫ్ లేకున్నా పని ఎక్కువైనా విధులు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇవ్వాల్సింది ఉద్యోగుల పీఆర్సీ మాత్రమే…సీఎం కేసీఆర్ పిలిచి పీఆర్సీ ఇస్తారని ఆశిస్తున్నామని చెప్పారు.