Take a fresh look at your lifestyle.

మనకు తెలియని మహా భారతం

“ఒక వ్యక్తి బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడని అనలేం అని మనువే చెప్పినాడు. అందుకే అతడికి వేదజ్ఞాన బోధన వంటి సంస్కారాలు కలిగిస్తున్నారు. వేదాలు చెప్పిన ఈ సంస్కారాలు అధ్యయనం అందిన తరువాత కూడా సత్యం, దానం, క్షమ, సహనం, శీలం వంటి లక్షణాలు లేకపోతే అతను బ్రాహ్మణుడుగా కొనసాగే అవకాశం లేదు. ఆ గుణములు ఉంటేనే సంపూర్ణ బ్రాహ్మణుడు అవుతాడు.”

చాలా మంది బ్రాహ్మణ కులంలో పుట్టినా శూద్రులే

బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడే బ్రాహ్మణుడు అనుకుంటాం. ఏ కులంలో పుట్టిన వాడిది ఆ కులం అనుకుంటూ ఉంటాం. కాని పురాణాలు ఎప్పుడూ ఈ మాట చెప్పలేదు. జన్మ కాకుండా కర్మను బట్టి కుల నిర్ణయం జరగాలని చాతుర్‌ ‌వర్ణం మయాసృష్టం అని శ్రీకృష్ణుడు చెప్పిన గీతలో సగం వాక్యం పదేపదే పలుకుతుంటారు కాని, దాని తర్వాత ఉన్న గుణకర్మ విభాగయః అనే మాట చెప్పరు. గుణముల చేత అంటే లక్షణాలు ప్రవర్తన నడవడిక చేత కుల నిర్ణయం జరగాలి. కర్మలు అంటే పనుల చేత అతని తరగతి గతి నిర్ణయించాలని శ్రీకృష్ణుడు చెప్పినట్టు వ్యాసుడు వివరించినా మనకు అర్థం కాదు. పెద్ద యోగులు, మఠాధిపతులు కూడా ఇదే చెబుతుంటారు. ఈ రోజుల్లో కిరస్తానీకి, హిందువుకి, ముస్లింకు కూడా తేడా కనబడదు. బ్రాహ్మణుడికి, వైశ్యుడికి, క్షత్రియుడికి శూద్రుడికి కూడా పెద్దతేడా ఏమీ కనిపించదు. అందరూ ఒకే విధంగా ఉంటారు. గుడికి, చర్చికి, మసీదుకు వెళ్లని వారికి మత గుర్తింపు అంటగట్టడం వల్ల ఏం ప్రయోజనం. కులవృత్తులు, కుల విధులు పాటించని వాడిని ఆ కులం వాడనే తరగతిలో హాజరీ వేయడం ఏ విధంగా సరిపోతుంది? వ్యాసుడు నహుషుని ప్రశ్నలు ధర్మరాజు సమాధానాల రూపంలో ఈ విషయం వివరిస్తాడు.

మహాభారతం పంచమవేదం అనీ, విజ్ఞాన భాండాగారం విజ్ఞాన సర్వస్వం అంటే ఎంత వాస్తవమో ఈ ఘట్టాలు చదివితే తెలుస్తుంది. నూరు యజ్ఞాలు చేసి ఇంద్రపదవిని సాధించిన మహారాజు నహుషుడు. పాండవులు అరణ్యవాసం చేస్తూ గంధమాదన పర్వతం దగ్గర విహరిస్తున్నపుడు నహుషుడు మహాసర్ప రూపంలో భీముడిని బంధిస్తాడు. ఎంత పెనుగులాడినా సరే వేయ్యేనుగుల బలం ఉన్న భీముడు ఆ సర్పం పట్టు విడిపించుకోలేకపోతాడు. పడగతో కూడా ఆ సర్పం అతన్ని కదలనీయకుండా చేసేసింది. ఆశ్చర్యపోయిన భీముడు నీవు సాధారణ సర్పానివి కాదని అర్థమైంది. ‘ఎవరివి నీవు..నన్నెందుకు పట్టుకున్నావు’ అని అడుగుతాడు. అప్పుడు నహుషుడు పరిచయం చేసుకుంటాడు. ‘నేను పురూరవుడి మనవడిని, నీ వంశంలో పూర్వజుడిని.

అగస్త్యమహాముని శాపంతో సర్పాన్నై ఈ లోకంలో పడిఉన్నాను. కాని ఆ ముని నాకు పూర్వ జన్మస్మృతి కలిగించారు.’ భీముడిని విడిచిపెట్టాలంటే తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షరతు విధిస్తాడు నహుషుడు. ఆ సమయానికే ధర్మరాజు అక్కడికి భీముడిని వెతుక్కుంటూ వస్తాడు. ఇదంతా తెలుసుకుంటాడు. నీకు సమాధానం ఇచ్చే శక్తి నాకు ఉంటే సమాధానం ఇస్తానంటాడు. బలం ఉందని లేదా తెలివి ఉందని అహంకారం లేకపోవడాన్ని ఈ సమాధానం సూచిస్తుంది. కండబలం భీముడికున్నా ఒక్కోసారి బుద్ధి బలంలోనే శత్రువును జయించవలసి వస్తుంది. అక్కడ ధర్మరాజు ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. ధర్మరాజు ఇంకో షరతు పెడతాడు. బ్రాహ్మణుడు ఏం తెలుసుకోవాలో అది తెలుసుకుని ఉంటేనే నన్ను ప్రశ్న అడగమంటాడు. అంటే ధర్మరాజు ప్రశ్న పరిధిని తాను నిర్ణయిస్తున్నాడు. పాచికలు తన చేతిలోకి తీసుకున్నాడన్నమాట. సరే బ్రాహ్మణుడంటే ఎవరు అని తొలి ప్రశ్న.

సత్యం దానం క్షమా శీలం అనృశంస్యం తపో ఘృణా
దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః
సత్యం పలకడం, దానం చేయడం, సహనం ఓర్పు ఉండడం, హింసా ప్రవృత్తి లేకపోవడం, దయ కలిగి ఉండడం బ్రాహ్మణునికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్నవాడు పరబ్రహ్మను తెలుసుకుంటాడు. సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉండేదే పరబ్రహ్మతత్త్వం.

ధర్మజుడినోట వ్యాసుడు చెప్పించిన మాట ఇది :

శూద్రేతు యద్భవేల్లక్ష్మ ద్విజే తచ్ఛన విద్యతే
న వై శూద్రో భవేచ్చూద్రః బ్రాహ్మణో నచ బ్రాహ్మణః

ఈ గుణాలు లేకపోతే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడు కూడా బ్రాహ్మణుడు కాబోడు. ఒకవేళ శూద్రుడిలో ఈ లక్షణాలుంటే అతను బ్రాహ్మణుడే. బ్రాహ్మణుడిలో ఈ లక్షణాలు లేకపోతే శూద్రుడే అవుతాడు. శ్రీకృష్ణుడు, వ్యాసుడు, రామానుజుడు, వైష్ణవ ఆళ్వారులు ఇదే విషయం పదేపదే చెప్పారు. ఒక వ్యక్తి బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడని అనలేం అని మనువే చెప్పినాడు. అందుకే అతడికి వేదజ్ఞాన బోధన వంటి సంస్కారాలు కలిగిస్తున్నారు. వేదాలు చెప్పిన ఈ సంస్కారాలు అధ్యయనం అందిన తరువాత కూడా సత్యం, దానం, క్షమ, సహనం, శీలం వంటి లక్షణాలు లేకపోతే అతను బ్రాహ్మణుడుగా కొనసాగే అవకాశం లేదు. ఆ గుణములు ఉంటేనే సంపూర్ణ బ్రాహ్మణుడు అవుతాడు. ధర్మరాజు వివరణతో నహుషుడు భీముడిని వదిలేయడమే కాదు, శాపవిముక్తి కలిగి సర్పరూపం వదిలి తన రూపం పొందుతాడు. ఈ విధంగా నహుషుడికి ధర్మరాజుకు మధ్య జ్ఞాన చర్చ సుదీర్ఘంగా సాగుతందని సామవేదం షణ్ముఖ శర్మ తన మహాభారత ప్రవచనంలో వివరించారు. అదే ‘ఇదీ యథార్థ మహాభారతం’’లో ఉంది.

Leave a Reply