Take a fresh look at your lifestyle.

చేయి చేయి కలిపితేనే సుస్థిరాభివృద్ధి చైతన్యం

‘‘‌కొరోనా విపత్తు నుంచి ప్రపంచ మానవాళి బయటపడటానికి ధనిక దేశాలు ఉదార స్వభావంతో పేద-మధ్య ఆదాయ దేశాలకు చేయూతను ఇవ్వడానికి చొరవ చూపాలి. అన్ని ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడితేనే కొరోనా మహమ్మారులు, వాతావరణ ప్రతికూలతలు పారిపోతాయని గమనించాలి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధిగమించడానికి విదేశీ సంబంధాలు, భాగస్వామ్య భావనలు బలపడాలి. 2019తో పోల్చితే 2020లో అంతర్జాతీయ నిధులు 7 శాతం, అనగా 161 బిలియన్‌ ‌డాలర్లకు పెరగడం గమనించబడింది. చాలా ధనిక దేశాలు కరోనా కట్టడికి పేద దేశాలకు ఆర్థికంగా సహకరించడం చూశాం. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు జరుగుతున్న 79 శాతం ఎగుమతులకు డ్యూటీ-ఫ్రీ విధానం అమలు అవుతుండటం సోచనీయం.’’

(ఐరాస సస్టేనబుల్‌ ‌డెవలప్‌మెంట్‌ ‌గోల్స్-2030‌లోని ‘లక్ష్యాల సాధనకు ప్రపంచ దేశాల భాగస్వామ్యాలు’ అనబడే లక్ష్యపు నివేదిక-2021 ఆధారంగా)

2015లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం ప్రకారం ‘2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సానుకూల సుస్థిరాభివృద్ధి మార్పులు’ చేపట్టాలనే సదుద్దేశంతో 17 ‘ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు-2030’ని నిర్ణయించారు. ఈ 17 లక్ష్యాలను ‘2030 ఎజెండా’ అని కూడా పిలుస్తాం. పేదరికం, ఆకలి చావులు, ఆరోగ్యం, విద్య, పర్యావరణ మార్పులు, లింగ సమానత్వం – మహిళా సాధికారత, సురక్షిత నీరు, పారిశుధ్యం, శక్తి వనరులు, పట్టణీకరణ, భూతాపం, పారిశ్రామికీకరణ, ఆవిష్కరణలు, మౌళిక సదుపాయాలు, సామాజిక న్యాయం లాంటి ప్రధాన అంశాలను తీసుకొని 2030 నాటికి ప్రగతి సాధించాలని లక్ష్యంగా తీసుకున్నారు. సామాజిక న్యాయం, అసమానతలు, పేదరికం, లింగ భేదం, ఆకలి చావులు, నిరుద్యోగం లాంటివ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. గత దశాబ్దకాలంగా విద్యారంగంలో ప్రపంచమానవాళి ఎంతో ముందడుగు వేసింది. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో చివరిది అయిన 17వ అంశంగా ‘పార్ట్నర్‌షిప్స్ ‌ఫర్‌ ‌ది గోల్స్’ (‌భాగస్వామ్యాలతో లక్ష్యాల సాధన)’ను ముఖ్యమైనదిగా తీసుకోబడింది. ఐరాస నిర్దేశించిన 16 లక్ష్యాలను సుసాధ్యం చేయటానికి పథకాల పటిష్ట అమలుతో పాటు అంతర్జాతీయ స్థాయిలో దేశాలన్నీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధిగమించడానికి సానుకూల భాగస్వామ్యాలను మనస్పూర్తిగా అందించాలని ఐరాస భావిస్తున్నది.

సాధారణ పరిస్థితుల్లోనే బలహీన సంబంధాలు కలిగి ఉన్న ప్రపంచ దేశాల సమన్వయ భాగస్వామ్య భావనలు కోవిడ్‌-19 అనంతరం మరింత బలహీనపడడం చూస్తున్నాం. కొరోనా విపత్తుతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు చితికి పోవడం, విదేశీ పెట్టుబడులు 40 శాతం వరకు పడిపోవడంతో పలు దేశాలు ఆర్థిక ఒత్తిడికి గురికావడంతో కొ•రోనా టీకాల సేకరణతో పాటు కొరోనా నుంచి ఉపశమనం పొందడానికి నరకయాతన పడుతున్నాయి. దీనితో ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు నెరవేరడానికి తీసుకోవలసిన చర్యలు, వాతావరణ మార్పులు, ఆర్థిక వనరుల కల్పనలకు మరింత సమయం పట్టవచ్చని విశ్లేషణ చేస్తున్నారు. కొరోనా విపత్తు నుంచి ప్రపంచ మానవాళి బయటపడటానికి ధనిక దేశాలు ఉదార స్వభావంతో పేద-మధ్య ఆదాయ దేశాలకు చేయూతను ఇవ్వడానికి చొరవ చూపాలి. అన్ని ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడితేనే కొరోనా మహమ్మారులు, వాతావరణ ప్రతికూలతలు పారిపోతాయని గమనించాలి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అధిగమించడానికి విదేశీ సంబంధాలు, భాగస్వామ్య భావనలు బలపడాలి. 2019తో పోల్చితే 2020లో అంతర్జాతీయ నిధులు 7 శాతం, అనగా 161 బిలియన్‌ ‌డాలర్లకు పెరగడం గమనించబడింది. చాలా ధనిక దేశాలు కరోనా కట్టడికి పేద దేశాలకు ఆర్థికంగా సహకరించడం చూశాం. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు జరుగుతున్న 79 శాతం ఎగుమతులకు డ్యూటీ-ఫ్రీ విధానం అమలు అవుతుండటం సోచనీయం.

2019లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 1.5 ట్రిలియన్‌ ‌డాలర్లు ఉండగా, 2020లో 40 శాతం తగ్గి 1 ట్రిలియన్‌ ‌డాలర్ల కన్న తక్కువ నమోదు కావడం గమనించారు. కరోనా విధించిన లాక్‌డౌన్లు, ప్రజారోగ్య సంక్షోభంతో ఆర్థిక మందగమనం నమోదైంది. పునరుత్పాదక శక్తి ఉత్పత్తి మినహా ఇతర రంగాలకు పెట్టుబడులు తగ్గడంతో ఐరాస నిర్ధేశించిన 16 సుస్థిరాభివృది లక్ష్యాల సాధన 2030 నాటికి అసాధ్యంగానే తోస్తున్నది. కరోనా 3వ వేవ్‌ ‌భయం, టీకా కార్యక్రమం మందకొడిగా సాగడం లాంటి కారణాలతో 2021లో విదేశీ పెట్టుబడులు ఆశించినంత వేగంగా పెరగడం లేదు. 2019లో 86 శాతం యూరోప్‌, ‌నార్థ్ అమెరికన్‌ ‌ప్రజలు ఇంటర్నెట్‌ ‌వాడుతూ, కరోనా లాక్‌డౌన్లో కూడా అన్ని వ్యవస్థలు నడిచేలా చూడగలిగారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన దాదాపు 25 శాతం జనాభా మాత్రమే ఇంటర్నెట్‌ ‌సౌకర్యాన్ని కలిగి ఉండడంతో అధిక శాతం ఆన్‌లైన్‌ ‌సదుపాయాలు పొందలేక వెనకబడి పోయారు. అభివృద్ధి చెందిన దేశాల్లో 34 శాతం మందికి బ్రాడ్‌బ్యాండ్‌ ‌సౌకర్యం ఉండగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 11 శాతం ప్రజలు మాత్రమే సౌకర్యాన్ని పొందుతున్నారు. ఇంటర్నెట్‌ ‌కనెక్టివిటీ ఖర్చులు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాల సేకరణ, ఇంటర్నెట్‌ ‌నైపుణ్యాలు కొరవడడం లాంటి కారణాలతో అధిక జనాభాకు అంతర్జాల సౌకర్యం అందని ద్రాక్షే అయ్యింది. దాదాపు 49 శాతం పేద జనాభాను అభివృద్ధి పథంలో నడిపించడానికి అన్ని దేశాలు కలిసికట్టుగా, సమన్యయంతో ముందుకు నడవాల్సి ఉంది. ప్రభుత్వాలు, పాలసీమేకర్స్, ‌నెట్‌వర్క్ ఆపరేటర్లు కలిసి పని చేస్తేనే ఇంటర్నెట్‌ ‌సౌలభ్యత అందరికీ దొరుకుతుంది.

కోవిడ్‌-19 ‌నేపథ్యంలో ఐరాస సుస్థిరాభివృది లక్ష్యాల సాధనకు ప్రపంచ దేశాల మధ్య మరింత బలమైన సమన్వయ, సహకార ధోరిణి అవసరం అవుతుంది. ప్రపంచ సమస్యలపై పోరుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమై, తగు భాగస్వామ్య బాధ్యతలను తీసుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఏకతాటిపైకి చేరి తమకు వీలైనంత సహకారం అందించాల్సిన కనీస బాధ్యతలను గుర్తించాలి. ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు నియమించబడిన ‘హై-లెవెల్‌ ‌పొలిటికల్‌ ‌ఫోరమ్‌’ ‌పర్యవేక్షణ, సూచనలతో అంతర్జాతీయ భాగస్వామ్యం ముందుకు సాగాలి. అల్ప-మధ్య ఆదాయ దేశాలకు 2019లో 554 బిలియన్‌ ‌డాలర్ల విదేశీ సహాయం అందితే, 2020లో 445 బిలియన్ల డాలర్లకు పడిపోవడం గమనించారు. దేశాలు ఆర్థిక సామాజిక రాజకీయ సరిహద్దు వివాదాలను మరిచి చేయి చేయి కలిపి ముందుకు సాగినపుడు మాత్రమే ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి చేరగలమని నమ్ముదాం. అంతర్జాతీయ భాగస్వామ్యంతో అభివృద్ధి వెలుగుల వైపు పయనిద్దాం, భూతలాన్ని స్వర్గధామంగా మార్చుకుందాం.

dr burra madhusudhan reddy
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి, విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల, కరీంనగర్‌ – 9949700037

Leave a Reply