Take a fresh look at your lifestyle.

అమెరికా జేబు సంస్థ గా ఐరాసా

ఐక్యరాజ్య సమితి 75వ వార్షిక సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోడీ వర్చువల్ ప్రసంగం చేస్తూ ప్రపంచ దేశాలన్నీ ఆలోచించాల్సిన అంశాలను లేవనెత్తారు. మానవాళి మనుగడకు ముప్పుగా తయారైన ఉగ్రవాదం , కొరోనా వైరస్ వంటి విపత్కర పరిస్థితులలో ప్రపంచ దేశాలు తమ ఆధిపత్యం కోసం పాకులాడకుండా, మానవాళి శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇది సార్వజనీనమైన సత్యం. మనిషి బతికుంటే కదా హెచ్చ తగ్గులు, ఆధిపత్యాలు, అణచివేతలనేవి ఉంటాయి. ప్రపంచం మొత్తం ఇప్పుడు కోవిడ్-19 కోరల్లో చిక్కి ఉంది. అగ్రరాజ్యమైన అమెరికా అన్ని దేశాల కన్నా ఎక్కువ ప్రమాదభరిత స్థితిలో ఉంది. ఈ సమయంలో అగ్రరాజ్యానికి సంయమనం, సహనం ఎంతో అవసరం. ఇలాంటి ఆందోళనకర పరిస్థితులలో అమెరికా చొరవ తీసుకుని ఐక్యరాజ్య సమితిలో చురుకైన పాత్ర వహించాలి. కొరోనా వైరస్ నియంత్రణకు ఐరాస ముందుండే రీతిలో కార్యక్రమాలను సూచించాలి. అమెరికాలోని న్యూయార్క్ నగరం కేంద్రంగా పని చేస్తున్న ఐక్యరాజ్య సమితిలో ఇప్పటికీ ఐక్యరాజ్య సమితిలో తన పట్టును నిలబెట్టుకుంటోంది. ఈ మధ్య కాలంలో చైనా స్థానాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ కొరోనా సంక్షోభ సమయంలో చైనా పక్షం వహించారన్న అర్థం వొచ్చే రీతిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాల్లో ప్రజలకు సరైన దిశానిర్దేశం చేయడంలో ఐక్యరాజ్య సమితి విఫలమవుతున్న సంగతి బహిరంగ రహస్యం. జార్జి బుష్ అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు సమితి అనుమతి లేకుండా ఇరాక్ పై దాడి జరిపించారు. అంతకుముందు ఆఫ్ఘనిస్థాన్ పై కూడా దాడి జరిపించారు. ఈ దాడుల్లో వేలాది మంది మరణించారు.

ప్రపంచ శాంతిని పరిరక్షించాలన్న ప్రధానాశయంతో ఏర్పడిన ఐరాస ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోవడానికి వివిధ దేశాల్లో పుట్టుకొస్తున్న ఆభిజాత్య ధోరణులే కారణం. ప్రధానమంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నది కూడా అదే ఐక్యరాజ్య సమితి గడిచిన 75 సంవత్సరాల్లో ఆశించిన లక్ష్యాలను సాధించలేకపోవడమే కాకుండా, అగ్రరాజ్యం జేబుసంస్థగా మారిందన్న అపవాదను మూటకట్టుకుంది. ఇందుకు భౌగోళిక పరిస్థితులు కారణం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం విషయంలో చైనా అనుసరిస్తున్న ద్వేష వైఖరిని ప్రస్తావించకుండా ఉండలేం. భారత్ కు భద్రతా మండలి లో శాశ్వత సభ్యత్వాన్ని పొందే అర్హత ఉందని దాదాపు అన్ని దేశాలూ సమర్ధిస్తుండగా, పాకిస్తాన్ ను బుజ్జగించడం కోసం చైనా భారత్ ని వ్యతిరేకిస్తోంది. భారత్, పాకిస్తాన్ కూ ఏ విషయంలోనూ పోలిక లేదన్న విషయం చైనాకు తెలుసు. కానీ, తాను నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులు పూర్తి కావడానికి పాక్ సాయం కావాలి కనుక, పాక్ ను వెనకేసుకొస్తోంది. ఐక్యరాజ్య సమితి ఆహార సంస్థ కూడా స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోంది. శాంతి మంత్రాన్ని జపించడం తప్ప శాంతి కోసం కృషి చేస్తున్న వ్యక్తులను గౌరవించలేకపోతోంది. ఐక్యరాజ్య సమితి సంస్థాపక సమయంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడు కొత్తగా అనేక ప్రజాస్వామ్య దేశాలు వెలిశాయి. వాటి వాణి వినిపించుకునే అవకాశం ఇవ్వాల్సి ఉంది. మోడీ చేసిన ప్రసంగంలో ప్రస్తావించిన మరో ముఖ్యమైన అంశం ఇదే. కొద్ది మంది ప్రయోజనాల కోసం, కొద్ది దేశాల వాణి వినిపించడం కోసం ఐక్యరాజ్యసమితి వేదిక కారాదని,బహుళత్వాన్ని సంతరించుకున్నప్పుడే దాని ప్రాధాన్యతను నిలబెట్టుకున్నట్టవుతుందని మోడీ అన్నారు. అంతేకాక, అంతర్జాతీయ ఆర్థిక సహాయ సంస్థలైన ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు వంటివి రుణాలను మంజూరు చేయడంలో అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉదారంగా వ్యవహరించాల్సింది పోయి, అనేక ఆంక్షలు విధించడం సరికాదు.

అణు నియంత్రణ కార్యక్రమాలను నిరోధించడం సమితి ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. కానీ, ఉత్తర కొరియా, దానిని సమర్ధించే దేశాలు ఈ నియమాలు, నిబంధనలను పాటించడం లేదు. అణు శక్తి అనేది శాంతియుత ప్రయోజనాల కోసమేనని పైకి చెబుతూ, అణ్వస్త్ర సామర్ద్యాన్ని పెంచుకోవడానికి దాదాపు ప్రతి దేశమూ ప్రయత్నిస్తోంది. అమెరికా తన మిత్ర దేశాల్లో అణు కార్యక్రమాలను చూసీ చూడనట్టు వ్యవహరిస్తూ, ఇతర దేశాల్లో కార్యక్రమాల పట్ల యాగీ చేస్తోంది. సమితిని అడ్డు పెట్టుకుని ఆంక్షలను విధింపజేస్తోంది. అమెరికా ప్రతిపాదనలను ఆమోదించడం తప్ప సమితికి వేరే మార్గం లేదన్నట్టుగా ప్రస్తుత పరిస్థితి నెలకొని ఉంది. ఐక్యరాజ్య సమితిలో అర్హమైన భారత్ వంటి దేశాలకు సభ్యత్వం లభిస్తే ఇలాంటి ధోరణులకు అడ్డుకట్ట పడవచ్చు. మన దేశం మొదటి నుంచి అన్ని దేశాలకూ అవకాశాలు కల్పించాలని , ప్రపంచ దేశాలకు అందరి వాణి వినిపించే అవకాశం కల్పించాలని కోరుతోంది. కొత్తగా ఏర్పడిన దేశాలకు భారత్ ఎంతో దన్నుగా నిలుస్తోంది. అందుకే, భారత్ కి భద్రతా మండలి సభ్యత్వం కోసం చైనా, పాక్ లు తప్ప అన్ని దేశాలూ మద్దతు పలుకుతున్నాయి. అలాగే, అణు ఇంధన సామర్ధ్యం పెంచుకునే అవకాశం అన్ని దేశాలకూ కల్పించాలి. అణు కార్యక్రమాలపై సమితి ఇన్ స్పెక్టర్ల తనిఖీలు అన్ని దేశాలకూ ఒకే రీతిలో ఉండేట్టు చూడాల్సిన అవసరం ఉంది. ఆహారం దగ్గర నుంచి అణు శక్తి వరకూ అన్ని దేశాలకూ సమానమైన అవకాశాలు లభించేట్టు సమితి చూడాలి. కానీ, అమెరికా ఒత్తిడి పురస్కరించుకుని ఇరాన్ వంటి దేశాలపై ఆంక్షలు పెంచడం, ఇజ్రాయెల్ వంటి దేశాల పట్ల మెతక వైఖరిని వహించడం అమెరికా ఒత్తిడి ఫలితమే. ఈ ధోరణులు మార్చుకుంటే తప్ప ఐక్యరాజ్య సమితి తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కష్టం. ప్రధానమంత్రి ప్రసంగం యావత్తూ ఇందుకు సంబంధించిన అంశాలపైనే కేంద్రీకృతమై ఉంది. సమితిలో సంస్కరణలకు అసలైన అర్ధం ఇదే.

Leave a Reply