జేఎన్‌యూ పూర్వ విద్యార్థి, యునైటెడ్ అగెనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖాలిద్‌ను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్టు చేయడాన్ని మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) తీవ్రంగా ఖండించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసాకాండలో పాల్గొన్నాడనే అసత్య ఆరోపణ)తో అతనిపై అత్యంత కిరాతకమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని పేర్కొంది. ఈమేరకు సోమవారం హెచ్ఆర్ఎఫ్ ఏపీ, టీఎస్ సమన్వయ కమిటీ సభ్యులు విఎస్ కృష్ణ, ఎస్.జీవన్‌కుమార్ ఇక్కడ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న కార్యకర్తలపై ప్రధానంగా యువ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు గత కొన్ని నెలలుగా పథకం ప్రకారం అబద్దపు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లకు వ్యూహం రచించిన కుట్రదారులు, వాటిని ప్రేరేపించిన వారు, రెచ్చగొట్టిన వారు, అల్లర్లకు పాల్పడ్డ కిరాతక మూకలు ఈనాటికీ ఢిల్లీ వీధులలో న్బిర్భయంగా తిరుగుతున్నారనీ, వారిని పోలీసులు అదుపులోకి తీసుకోకుండా మత సామరస్యం కోసం కృషి చేసిన వారిపై దుష్ప్రచారం చేసిన వారిపై అబద్ధపు కేసులు •నాయించడం ఏమిటని ప్రశ్నించారు.
ఢిల్లీ విధ్వేషాలకు బాధ్యులైన వారిపై రాజ్యం, బీజేపీ దాని అనుబంధ సంస్థల అండదండలున్నాయని ఆరోపించారు. గోల్వాల్కర్, హెగ్డేవార్ల భావజాల వారసులమని చెప్పుకు తిరుగుతూ రాజ్యమేలుతున్న వారు దేశంలోని వైవిధ్యాన్ని మట్టుబెట్టి, ఒక దేశం ఒక మతం అనే దుర్మార్గమైన విలువను ప్రవేశపెట్టి ఈ దేశాన్ని ఒక దురహంకార, అప్రజాస్వామిక,దుందుడుకు సమాజంగా మార్చాలని కలలు కంటున్నారని విమర్శించారు. వీరి కలలు ఎన్నటికీ నెరవేరవనీ, ఉమర్ ఖాలీద్ మాటల్లోనే చెప్పాలంటే భారత దేశ పాలకులు యువ మనసులపై యుద్ధం ఓడిపోయారనీ, మమ్మల్ని మట్టుపెట్టడానికి వచ్చారనీ, కానీ, మేము విత్తనాలమవుతామనే సంగతిని పూర్తిగా మరచిపోయారని గుర్తు చేశారు. మన దేశ గణతంత్రం జనించిన ముద్దుబిడ్డ ఉమర్ ఖాలీద్ అనీ, అతను తన రచనలు, ప్రసంగాలు అహింసాయుత కార్యకలాపాల ద్వారా నిర్భయంగా బతకాలనే సందేశాన్ని శాంతియుతంగా చాటుతూ పోతున్నాడని పేర్కొన్నారు. ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన ఉమర్ ఖాలీద్, సీఏఏ వ్యతిరేక కార్యకర్తలందరినీ వెంటనే విడుదల చేయాలని ఈసందర్భంగా వారు డిమాండ్ చేశారు.