మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదాకల్పించుటకు కృషి చేస్తానని, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తెలియచేస్తానని కేంద్ర గిరిజనశాఖ మంత్రి అర్జున్‌ముండా హామీ ఇచ్చారు. శనివారం కేంద్ర మంత్రి తెలంగాణ కుంభమేళాగా కీర్తిగడించిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం విలేకులతో మాట్లాడారు. రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతిరాథోడ్‌లు మేడారం జాతరకు జాతీయహోదా కల్పించాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రులిద్దరూ మేడారనం గిరిజన జాతర విశేషాలను కేంద్ర మంత్రికి వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను పరిశీలించి ఆశ్చర్యం ప్రకటించారు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండే, క్యూలైన్లు, నిరంతర మంచినీటిసరఫరా, విద్యుత్తుసరఫరా, జంపన్న వాగులో పుణ్యస్నానాలు చాలా గొప్పగా ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించారు.
2014 నుంచి ప్రయత్నాలు:
2014 నుంచి మేడారం జాతరకు జాతీయ హోదాకోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రతీసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ, ఇంతరకు ఈ జాతరకు జాతీయ హోదా లభించనేలేదు. 2014లో తెలంగాణ రాష్ట్రం జూన్‌లో ఏర్పడగా, అంతకుముందు ఫిబ్రవరిలోనే జాతర ముగిసింది. ఈ నేపథ్యంలోనే 2014నుంచి చేస్తున్న ప్రయత్నాలకు ఏకరవు పెడుతూ కేంద్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయనున్నట్లు సమాచారం 2016లో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.100 కోట్లు కేటాయించి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేసింది.రోడ్ల విస్తరణ , మంచినీటిసదుపాయం, నిరంతరం విద్యుత్తు వంటి అనేక సౌకర్యాలను 2016లోనే తెలంగాణ ప్రభుత్వం చేసింది. అనాటి కేంద్ర గిరిజన మంత్రికి కూడా జాతీయ హోదాను కోరుతూ విజ్ఞప్తి చేశారు. 2014 ఫిబ్రవరిలో అప్పటి తెలంగాణ ఉద్యమ నేత , నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే, మేడారం జాతరకు జాతీయ సాధించి తీరుతామని పేర్కొన్నారు. 2018లో కూడా ఇంతే సీరియస్‌గా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇంతవరకు ఈ జాతరకు ఈ హోదాను సాధించలేకపోవడం గమనార్హం. ప్రతీ రెండేళ్లకోసారి జరిగే ఈజాతరకు జనం ప్రతీసారి రెట్టింపవుతూ వస్తున్నారు. 2018లో కోటిమంది సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నట్లు నివేదికలు వచ్చాయి. ఈ సారి ఈ సంఖ్య ఇంకా అంచనాలకు మించి ఉన్నట్లు అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2018లో రూ.10కోట్లు వరకు వనదేవతలకు ఆదాయం సమకూరింది. ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి జాతీయహోదాను కోరుతూ లేఖ రాయనున్నట్లు సమాచారం.