Take a fresh look at your lifestyle.

అధికారంలోకి వొస్తే.. అధికారికంగా విమోచన దినం

  • తెలంగాణ చరిత్ర విశ్వవ్యాప్తం
  • కెసిఆర్‌..ఎవరికి భయపడి విమోచన దిన్నాన్ని నిర్వహించడం లేదు
  • ఓవైసీకి భయపడే హామిలను మరచిపోయారు
  • కుటంబపాలనును అడ్డుకట్ట వేసేందుకు ముందుకు రావాలి
  • ఈటలను హుజూరాబాద్‌లో భారీ మెజార్టీతో గెలిపించాలి
  • బండి సంజయ్‌ ‌పాదయాత్రకు అభినందనలు
  • నిర్మల్‌ ‌విమోచన సభలో కేంద్ర మంత్రి అమిత్‌ ‌షా పిలుపు

అధికారం ఇస్తే తెలంగాణ చరిత్రను విశ్వవ్యాప్తం చేస్తామని, భారత దేశానికి స్వాతంత్య్రం వొచ్చిన 13 నెలల వరకూ తెలంగాణకు విముక్తి లభించలేదని, సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌ ‌పరాక్రమం వల్లే నిజాం కబంధ హస్తాల నుంచి తెలంగాణ బయటపడిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా అన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచనను అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు. 1948 సెప్టెంబర్‌ 17‌న నిజాం అరాచకపాలన సంకెళ్లు తెగి తెలంగాణకు విముక్తి లభించి, భారత్‌లో భాగమైందని చెప్పారు. తెలంగాణ ఉద్యమం సమయంలో సెప్టెంబర్‌ 17‌న విమోచన దినం నిర్వహిస్తామని కేసీఆర్‌ ‌ప్రకటించారని, కానీ ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా ఎందుకు చేయలేకపోతుందని అమిత్‌ ‌షా ప్రశ్నించారు.

అప్పుడిచ్చిన వాగ్దానం ఇప్పుడేమైందని, సీఎం కేసీఆర్‌ ఎవరికి భయపడుతున్నారో చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. శుక్రవారం విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..నిర్మల్‌ ఆదివాసులు మొదట బ్రిటిషర్లు, ఆ తర్వాత నిజాంలతో పోరాడారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా విమోచన దినోత్సవ శుభాకాంక్షాలు తెలియజేస్తున్నానన్నారు. 2024లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వొస్తుందని, వొచ్చిన తరువాత సెప్టెంబర్‌ 17‌న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. మజ్లిస్‌కు భయపడేది లేదని ఆయన ప్రకటించారు. ఇవాళ ప్రధాని మోడీ పుట్టిన రోజని, ఈ సందర్భంగా రెండు కోట్ల టీకా డోస్‌లను ఇస్తున్నామని ఆయన తెలిపారు.

సర్దార్‌ ‌పటేల్‌ ‌పరాక్రమంతోనే 13 నెలల తరువాత భారత్‌లో తెలంగాణ కలిసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్‌ను అమిత్‌ ‌షా ప్రశంసలతో ముంచెత్తారు. తెలంగాణలోని సమస్యలు తెలుసుకునేందుకే బండి పాదయాత్ర చేస్తున్నారని ఆయన కొనియాడారు. రాబోయే ఎన్నికలల్లో అన్ని ఎంపీ సీట్లను గెలుస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. విమోచనోత్సవాన్ని కేసీఆర్‌ ఇపుడు మరిచిపోయారన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్‌ ‌పార్టీకి బీజేపీ భయపడదని అమిత్‌ ‌షా స్పష్టం చేశారు. ఒక్కసారి బీజేపీకి అధికారమిస్తే..తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

Union Minister Amit Shah calls on Nirmal Vimochana Sabha

బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ గౌరవాన్ని శాశ్వతంగా కాపాడుతామని అమిత్‌ ‌షా చెప్పారు. తెలంగాణకు కుటుంబ పాలన నుంచి విముక్తి కల్పించే పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని కేంద్ర హోమ్‌ ‌మంత్రి అమిత్‌ ‌షా అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నారు. ‘మజ్లిస్‌కు భయపడుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా..తెలంగాణ దళితులు, ఆదివాసీలు, మహిళల కోసమే ఈ సంగ్రామ యాత్ర చేస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్‌ ‌ప్రత్యామ్నాయం కాలేదు. కాంగ్రెస్‌ ఓవైసీకి వ్యతిరేకంగా పోరాడలేదు. తెలంగాణ గౌరవాన్ని కేవలం బీజేపీ మాత్రమే కాపాడగలదు.

మజ్లిస్‌, ‌టీఆర్‌ఎస్‌ అధికారంలో లేనప్పుడే తెలంగాణకు నిజమైన స్వాతంత్య్ర వొచ్చినట్లు చెప్పాలి. 119 నియోజకవర్గాల ప్రజల్లో చైత్యన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. ప్రతి ఎన్నికలు డబ్బుతో గెలవొచ్చని టీఆర్‌ఎస్‌ ‌భావిస్తుంది. సేవ చేసేవాడో కావోలో.. డబ్బుల రాజకీయం చేసే వారు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి’ అని అమిత్‌ ‌షా పేర్కొన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలను అమిత్‌ ‌షా కోరారు. అమిత్‌ ‌షా నిర్మల్‌ ‌సభ మొత్తం ఈటల రాజేందర్‌ ‌సెంట్రిక్‌గానే జరిగింది. సభ మొదలైనప్పటి నుంచి చివరి వరకు ఈటల పేరు ప్రస్తావిస్తూనే ఉన్నారు అమిత్‌ ‌షా. రెండో వరుసలో కూర్చుకున్న ఆయనను వేదికపై ముందుకు పిలిచి మరీ మాట్లాడారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించి.. రాష్ట్రంలో ఉన్న డబ్బుల రాజకీయానికి, కుటుంబ రాజకీయానికి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చారు. ప్రతీ ఎన్నికను డబ్బులతో గెలవొచ్చని టీఆర్‌ఎస్‌ అనుకుంటుందని విమర్శించారు అమిత్‌ ‌షా. తెలంగాణ ప్రజలు రాజేందర్‌ను గెలిపిస్తారా? పైసల సర్కారును గెలిపిస్తారా? కుటుంబ పాలనను గెలిపిస్తారా? అని వేదిక ముందున్న వారిని ప్రశ్నించారు. అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌మాట్లాడుతూ.. తెలంగాణలో విమోచన ఉత్సవాలు జరపనందుకు సీఎం కేసీఆర్‌ ‌క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ ‌చేశారు. కేసీఆర్‌ ‌తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభకు భారీగా తరలివచ్చిన బీజేపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ విమోచన వీరులు పైనుంచి చూస్తున్నారని.. ప్రగతి భవన్‌కు బీజేపీ జయధ్వానాలు వినిపించాలన్నారు. విమోచన వీరుల చరిత్రను భవిష్యత్‌ ‌తరాలకు తెలియ జేసేందుకే నిర్మల్‌లో సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో విమోచన ఉత్సవాలు జరపాలని సీఎం కేసీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ప్రజలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కుటుంబ, గడీల పాలనను బద్ధలు కొడదామన్నారు. సర్దార్‌ ‌పటేల్‌ ‌లేకుంటే తెలంగాణ పాకిస్థాన్‌లో కలిసి ఉండేదన్నారు. కార్యకర్తల్లో తెలంగాణ రక్తం ప్రవహిస్తే కేసీఆర్‌ ‌ప్రభ్యత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ ‌లాంటి మూర్ఖుడు ప్రధాని అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా జరపడని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే అవినీతి కుటుంబాన్ని కూకటి వేళ్ళతో పెకిలివేస్తామని స్పష్టం చేశారు. అమరుల త్యాగలతో పాటు కేసీఆర్‌ ‌క్రూరత్వాన్ని కూడా పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామన్నారు.

మూర్ఖుడి చేతిలో బందీ అయిన తెలంగాణ తల్లి ఆర్తనాదం పెడుతుందన్నారు. మోడీ, అమిత్‌ ‌షా లేని దేశాన్ని ఉహించుకోలేమని..అవకాశం ఉంటే నా ఆయుష్‌ ‌కూడా వారికే ఇస్తానని అన్నారు. 370 ఆర్టికల్‌ను రద్దు చేసిన మహానుభావుడు అమిత్‌ ‌షా అని బండి సంజయ్‌ అన్నారు. నిర్మల్‌లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రులు అమిత్‌ ‌షా, కిషన్‌ ‌రెడ్డితోపాటు రాష్ట్ర బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సభలో ఎంపీ అర్వింద్‌ ‌మాట్లాడుతూ.. తెలంగాణ నేల అంటేనే పౌరుషాల గడ్డ అన్నారు. ఇలాంటి పోరాటాల గడ్డపై కేసీఆర్‌ ‌నిర్బంధపు పాలన చేద్దామనుకుంటున్నారని చెప్పారు. అయితే నిర్బంధాలకు భయపడే నేల ఇది కాదన్నారు. రామదాసును గోలకొండలోని జైలులో ఖైదీ చేస్తే భక్త రామదాసుగా చరిత్రలో నిలబడిపోయారని చెప్పారు. కానీ భయపడలేదన్నారు. అలాగే కవి దాశరథిని నిజామాబాద్‌ ‌ఖిల్లా జైలులో బందీ చేస్తే మహాకవి దాశరథిగా.. తెలంగాణను కోటి రతనాల వీణగా మారుమోగించారని పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌చరిత్ర ఆయన ముందే చెరిగిపోతోందన్నారు. తెలంగాణ విమోచన దినంలో పాల్గొనడానికి అమిత్‌ ‌షా ఇక్కడకు రావడం చాలా మంచి విషయమన్నారు.

Leave a Reply