- 24గంటల్లో.. 6,42,588 కోవిడ్ పరీక్షలు
- కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు బయటపడుతున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 65.54శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వెల్లడించారు. ఇప్పటివరకు 16లక్షల 38వేల మంది వైరస్ బారినపడ్డారని, వీరిలో ఇప్పటికే 10లక్షల 57వేల మంది కోలుకున్నట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి 21రోజుల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈరోజు దిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన కేంద్రమంత్రుల సమావేశంలో డాక్టర్ హర్షవర్ధన్ ఈ వివరాలు వెల్లడించారు. ‘దేశంలో కరోనా సోకిన వారిలో మూడింట రెండొంతుల మంది కోలుకొని ఇంటికి చేరారు. మరణాల రేటు కూడా తగ్గుతోంది. ప్రస్తుతం భారత్‌లో కరోనా మరణాల రేటు 2.18గా ఉంది.
అంతేకాకుండా రికవరీ రేటు 64.54శాతానికి పెరిగింది’ అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఈ సమయంలో కరోనా డబ్లింగ్ రేటు 21రోజులుగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 24గంటల్లో 6,42,588 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేశామని, గడిచిన నెల కాలంలో దాదాపు కోటి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టామని ఆయన స్పష్టం చేశారు.మొత్తం బాధితుల్లో 0.27శాతం మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో 1.58శాతం మంది అత్యవసర చికిత్సావిభాగంలో ఉన్నట్లు మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. వీరితోపాటు మరో 2.28శాతం మందికి ఆక్సిజన్ అవసరమవుతున్నట్లు ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు జయశంకర్, హరిదీప్ సింగ్ పూరి పాల్గొని దేశంలో కరోనా వైరస్ తాజా పరిస్థితులపై చర్చించారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లోనే కొత్తగా 55వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారిలో 35,747 మంది మృత్యువాతపడ్డారు.