Take a fresh look at your lifestyle.

నేడు కేంద్ర మంత్రి మండలి విస్తరణ ..!

  • మిత్ర పక్షాలకు అవకాశంపై ఊహాగానాలు
  • జూలై 19 నుంచి పార్లమెంట్‌ ‌వర్షాకాల సమావేశాలు

జూలై 19 నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు వానాకాలం సమావేశాలకు ముందే కేంద్ర కేబినెట్‌ ‌పునర్నిర్మాణం జరుగుతున్నది. రెండోసారి ప్రధాని పదవి చేపట్టి రెండు సంవత్సరాల కాలం గడిచిన తరువాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రి మండలిని పునర్నిర్మాణం చేయటానికి సిద్ధమయ్యారు. మహమ్మారి సమయంలో పాలన సమస్యలు..కొన్ని రాష్రాల్ట ఎన్నికలలో బిజీగా ఉండటం వలన మోడీ తన మంత్రి మండలి విస్తరణ చేయలేకపోయారు. చాలా కాలంగా కేంద్ర మంత్రిమండలి విస్తరణను మోడీ దాటవేసుకుంటూ వొచ్చారు. ఇప్పుడు జూలై 19 నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు వానాకాలం సమావేశాలకు ముందే కేబినెట్‌ ‌విస్తరణ చేయాలనీ ప్రధాని మోడీ కసరత్తు మొదలు పెట్టారు. అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, జూలై 19 నుండి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశానికి నేడు విస్తరణ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

ప్రస్తుత కేంద్ర మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ కసరత్తు చాలా ఊహాగానాలకు ఊతమిస్తున్నది. ముఖ్యంగా గత నెలలో ప్రధాన మంత్రి కీలక మంత్రిత్వ శాఖల పనితీరు అంచనా వేసే పని ప్రారంభించిన తరువాత ఈ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. ఆయన గత నెలలో సీనియర్‌ ‌మంత్రులు, పార్టీ నాయకత్వంతో వరుస సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలలో చాలా వరకు బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొన్నారు. కొరోనా మహమ్మారి రెండవ వేవ్‌ ‌పరిస్థితిని ఎదుర్కోవటంలో విఫలమైందనే ఆరోపణలతో మోడీ ప్రభుత్వం తీవ్ర విమర్శలకు గురయింది. ఈ నేపథ్యంలో వైద్య శాఖ మంత్రి పదవి హర్షవర్ధన్‌ ‌తన పదవి నిలుపుకోగలరా లేదా అనే చర్చ జరుగుతున్నది. ఉత్తర ప్రదేశ్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా కీలకమైన ఎన్నికలు.

వీటి ప్రభావం కూడా మంత్రి మండలి విస్తరణపై ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ ‌ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ ‌పరిస్థితిని నిర్వహించడంలో విఫలమైందని…పార్టీ నాయకులలో ఒక విభాగం యోగి ఆదిత్యనాథ్‌ ‌ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందున…బిజెపి యుపి రాష్ట్ర యూనిట్‌ ‌గందరగోళంలో ఉన్నందున, బిజెపి నాయకత్వం ‘‘సమతుల్య చర్య’’ పట్ల ఆసక్తి కనబరుస్తున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రి మండలిని పునర్‌ ‌నిర్మించేటప్పుడు గుజరాత్‌, ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌మణిపూర్‌ ‌మరియు గోవాతో సహా ఇతర ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు కూడా కేంద్ర మంత్రుల తుది జాబితాను రూపొందించేటప్పుడు ప్రభావం చూపిస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గత రెండేళ్లుగా సంభవించిన రాజకీయ పరిణామాలు కూడా పునర్వ్యవస్థీకరణ పక్రియను ప్రభావితం చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు డజన్ల మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో కలిసి వొచ్చి బిజెపిలోకి ప్రవేశించిన జ్యోతిరాదిత్య సింధియా వలన మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. జ్యోతిరాదిత్య సింధియా ఆశలు నెరవేర్చాల్సి ఉంది. అలాగే అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ వెళ్లగా సర్బానంద సోనోవాల్‌ అస్సాం ముఖ్య మంత్రి పదవి కోల్పోయారు. ఇతను మోడీ ప్రభుత్వంలో చోటు దక్కించుకుంటారు. మోడీ తన మంత్రి మండలిని 81 మంది సభ్యుల వరకు(లోక్‌ ‌సభలో 15%) పెంచుకోవచ్చు. ప్రస్తుత కేంద్ర మంత్రి మండలి 53 మంది సభ్యులుగా ఉంది. ప్రధాని మోడీ డజను మంది మంత్రులను చేర్చుకునే అవకాశం ఉంది.

కనీసం రెండు మిత్ర పక్షాలకు స్థానం ఇవ్వాలని మోడీ యోచిస్తున్నారు. శివసేన మరియు ఎస్‌ఎడి-2019 నుండి ఎన్డీఏ విడిచిపెట్టిన తరువాత బిజెపి భాగస్వాములకు కేంద్ర మంత్రి మండలిలో అధిక స్థానాలు కల్పించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పెద్దలు భావిస్తున్నారు. మొదట్లో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న జెడి(యు) ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో భాగం కావాలని కోరికను వ్యక్తం చేయగా విస్తరణలో జెడి(యు)కి బెర్త్ ‌ఖాయం అంటున్నారు. ఎల్జెపి కూడా తనకు బెర్త్ ‌లభిస్తుందని భావిస్తున్నది. అయితే ఆసక్తికర అంశం ఏమంటే ఎల్‌జెపిలో ఆరుగురు ఎంపీలలో ఐదుగురు కేంద్ర మంత్రి రామ్‌ ‌విలాస్‌ ‌పాస్వాన్‌ ‌మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్‌ ‌పాస్వాన్‌ను లోక్‌సభలో నాయకత్వ పదవి నుంచి తొలగించారు.

ఈ నేపథ్యంలో ఎల్‌జెపి నుండి ఎవరు కేంద్ర మంత్రి మండలిలో స్థానం పొందుతారనేది ఆసక్తి కలిగించే ప్రశ్నగా ఉన్నది. బిజెపి ఉత్తర ప్రదేశ్‌ ‌మిత్రపక్షం అప్నా దళ్‌కు కూడా ప్రభుత్వంలో చోటు దక్కే అవకాశం ఉంది. జూన్‌ 30‌న, ప్రధాని తన మంత్రి మండలిని ఉద్దేశించి ప్రసంగిస్తూ మహమ్మారి మూడవ వేవ్‌ ‌తీవ్రత లేకుండా చేయటానికి తీవ్రంగా కృషి చేయాలని కేబినెట్‌ ‌మంత్రులను కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష ఆరోపణలను తీవ్రంగా ఎదుర్కోవాలని తన మంత్రులకి హిత బోధ చేసారు.

Leave a Reply