Take a fresh look at your lifestyle.

వనదేవతల చెంత జన జాతర…

  • తనివితీరా తల్లులకు మొక్కులు…
  • మూడవరోజు మొక్కులతో భక్తుల తన్మయత్వం
  • తల్లుల స్పర్శతో పులకరించిన భక్తులు..
  • దేవతలను దర్శించుకున్న కేంద్ర, రాష్ట్ర మంత్రులు
  • కోటికి పైగా జనం హాజరైనట్లు అంచనా
  • ఎక్కడా అవంతరాలు చోటుచేసుకోకుండా పోలీసుల చర్యలు
  • నేడు సమ్మక్క-సారలమ్మలు వనప్రవేశంతో జాతర ముగింపు

మేడారం (చిట్యాల/ములుగు), ఫిబ్రవరి 18, (ప్రజాతంత్ర విలేకరి) : తెలంగాణ కుంభమేళా…ఆసియాలోనే అతి పెద్ద గిరిజన జాతర…మేడారం జాతర.. అంతిమ ఘట్టానికి చేరుకుంది. మూడవ రోజైన శుక్రవారం భక్తులు తన్మయత్వంతో తనివితీరా మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క, సారలమ్మలు గద్దెలపై కొలువు తీరడంతో భక్తులు తన్మయత్వం పొందారు. గురువారం రాత్రి 9 గంటల తర్వాత సమ్మక్క గద్దెనెక్కడంతో ఒక్కసారిగా భక్తుల్లో పూనకాలు మొదలయ్యాయి. శివసత్తుల కేకలు, భక్తుల కోలాటాలు, డప్పు చప్పుళ్ళు, డోలు వాయిద్యాలతో జాతర అంతిమ ఘట్టం హోరెత్తింది. శుక్రవారం భక్తులు తనివితీరా ప్రార్థించి మొక్కులు సమర్పించుకున్నారు. గత జాతరలో కోరికలు తీరడంతో ఉత్సాహంగా కొందరు, మిగిలిన కోర్కెలు తీరేందుకు వొచ్చే జాతర నాటికైనా పూర్తవ్వాలని కొందరు తల్లులను మొక్కుకున్నారు. మూడు రోజులుగా కొనసాగుతున్న జాతరలో అశేష జనవాహిని పాల్గొన్నారు. పది రోజుల క్రితం వేల మందితో మొదలైన జాతర లక్షలను దాటి కోటికి పైగా చేరిందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా నాలుగు రోజుల పండుగగా చెప్పుకునే ఈ జాతర ఈ నెల 16న ప్రారంభమైంది. 16న పగిడిద్దరాజు, గోవిందరాజులు, సారలమ్మలు గద్దెకు చేరుకున్నారు. 17న రాత్రి సమ్మక్క చేరడంతో ఉత్సవం అంబరాన్ని తాకింది. కాగా సమ్మక్క-సారలమ్మల రాకతో భక్తుల్లో అంతులేని విశ్వాసం ఏర్పడింది. గద్దెల పైకి దేవతల చేరికతో కోర్కెలు నెరవేర్చుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాత్రి 10 నుంచి మొదలైన భక్తుల మొక్కులు శుక్రవారం రాత్రి వరకు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో జాతర కిటకిటలాడింది. దీనికి తోడు విఐపిల తాకిడి కూడా అధికంగానే కొనసాగింది.

బిజెపి కేంద్ర మంత్రులు నాయకులు, కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ నాయకులు, రాష్ట్ర మంత్రులు, టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు హాజరై మొక్కులు సమర్పించుకున్నారు. ఈసారి జాతరకు తెలంగాణ, ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న చత్తీస్‌ఘడ్‌, ‌మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ ‌నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలి వొచ్చినట్లు అధికారులు తెలిపారు. కొరోనా పరిస్థితులను లెక్కచేయకుండా తల్లుల దర్శనమే లక్ష్యంగా లక్షలాదిమంది హాజరు కావడం ప్రత్యేకతను సంతరించుకున్నది. జాతరకు హాజరైనభక్తులు జంపన్నవాగులో స్నానమాచరించి నేరుగా క్యూలైన్లలో నించుని దేవతలను దర్శించుకుంటున్నారు. భక్తులు వెంట తెచ్చిన చీరే, సారెతో పాటు కుంకుమ, పసుపు బంగారాన్ని(బెల్లం) గద్దెల వద్ద చెల్లించి మొక్కులు తీర్చుకుంటున్నారు. బంగారం,కొబ్బరికాయలను గద్దెల వద్ద సమర్పించుకుంటున్నారు. అనంతరం కోళ్లు, మేకలను బలి ఇచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. మళ్లీ రెండేళ్లకు కోరిన కోరికలు తీర్చాలని, తనివితీరా భక్తి పారవశ్యంతో ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా జిల్లా అధికారులు, పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. ఎప్పటికప్పుడు క్యూలైన్లలో భక్తులు నిలువకుండా పంపిస్తున్నారు. దీంతో ఎలాంటి అంతరాయం కలగడం లేదు.

Union and state ministers

శుక్రవారం కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి, మరో మంత్రి రేణుకసింగ్‌, ‌విజయశాంతి, రాజ్యసభ సభ్యులు గరికపాటి మోహన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, హుజురాబాద్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ ‌తోపాటు రాష్ట్ర నాయకులు జాతరకు హాజరై మేడారం సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌, ఎ‌ర్రబెల్లి దయాకర్‌ ‌రావు, నల్ల మల్లారెడ్డి, మాజీ సభాపతి, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్‌, ‌నన్నపనేని నరేందర్‌, ‌డిఎస్‌.‌రెడ్యానాయక్‌, ‌పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, ఆరూరి రమేష్‌, ‌శంకర్‌ ‌నాయక్‌, ఎం‌పీలు మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌ ‌రెడ్డి, బండా ప్రకాష్‌, ‌బస్వరాజు సారయ్య, వరంగల్‌ ‌నగర మేయర్‌ ‌గుండు సుధారాణి, వరంగల్‌ ‌జిల్లా జెడ్‌ ‌పి చైర్పర్సన్‌ ‌గండ్ర జ్యోతి, ములుగు జెడ్పీ చైర్‌పర్సన్‌ ‌కుసుమ జగదీష్‌, ‌టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర, బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, ‌పర్యాటక శాఖ ఎండి గుప్తా ఇతర రాష్ట్ర నాయకులు సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఇదిలా ఉండగా ఈ సారి జాతర అ విజయవంతం కావడానికి అధికారులు పోలీసులు పాత్ర అ విశిష్టమైనదని ప్రజలు కొనియాడారు. ముఖ్యంగా పోలీస్‌ అధికారుల సేవలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌లు, అవాంతరాలు, చెదురు, ముదురు సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా విధులు నిర్వర్తించి నందుకు అభినందిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి, పోలీసులు విధుల్లో విజయవంతం అవుతున్నారు. శుక్రవారం మేడారంలో పోటెత్తిన జనాన్ని చూస్తే రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు.

నేడు దేవతలు జనం నుండి వన ప్రవేశం
మేడారంలోని సమ్మక్క-సాలరమ్మలు శనివారం రాత్రి జనం మధ్య నుండి వన ప్రవేశం చేయనున్నారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న జాతర శనివారం 4వ రోజుతో ముగియనుంది. ముగింపు సందర్భంగా జాతర పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి దేవతలను వనప్రవేశం చేస్తారు. కన్నేపల్లి నుంచి సారక్క, చిలుకలగట్టు నుంచి సమ్మక్క జనంలోకి రాగా తిరిగి పూజారులు వారి వారి స్థావరాలకు భక్తిప్రపక్తులతో చేరవేస్తారు. దేవతల నిష్క్రమణతో జాతర ముగుస్తుంది. మళ్లీ రెండేళ్లకు మేడారం జాతర పున:ప్రారంభం జరగుతుంది.

Leave a Reply