Take a fresh look at your lifestyle.

అయ్యో రామప్ప…అనాల్సిందేనా..!

  • యునెస్కో గుర్తింపు నిలిచేనా…!?
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం
  • ఏడాది గడిచినా అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం
  • 8 అంశాలపై నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలి
  • కామేశ్వరాలయాన్ని పునర్నిర్మించాలి
  • చలనం లేని అధికార గణం…పట్టింపులేని ప్రభుత్వాలు

వెంకటాపూర్‌(‌ములుగు జిల్లా), ప్రజాతంత్ర, ఆగస్టు 6 : కాకతీయుల కాలం నాటి ఎనిమిది వందల ఏళ్ల చరిత్ర కలిగిన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు దక్కడంతో పర్యాటకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. క్రీ.శ.1213లో కాకతీయుల సేనాని రేచర్ల రుద్రయ్యచే నిర్మించబడిన రామప్ప దేవాలయంలో ప్రతి అంగుళం ప్రత్యేకమే. నక్షత్రాకారపు వేదికపై పునాదుల్లో పూర్తిగా ఇసుకతో నింపబడి ఉంటుంది. నీటిలో తేలే ఇటుకలు, సప్త స్వరాలు వినిపించే రాళ్లు, గర్భగుడిలో వెలుతురు, పురాణ, ఇతిహాసాలు కలిగిన శిల్పసంపద, మదనికలు అబ్బుర పరుస్థాయి. వీటన్నింటిని 2019 సెప్టెంబర్‌ 25‌న ఐకోమాస్‌ ‌ప్రతినిధి వాసు పోశ్యానందన సందర్శించి పరిశీలించారు. 2021 జూలై 25న రామప్పకు షరతులతో కూడిన గుర్తింపు లభించింది. యునెస్కో నిబంధనలకు అనుగుణంగా ఆలయాన్ని తీర్చిదిద్దాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం అంది వొచ్చిన అరుదైన అవకాశాన్ని రెండు చేతులతో అందుకోవాల్సింది పోయి నిర్లక్ష్యం జబ్బుతో గుర్తింపుకు గండం కలిగించేలా ప్రవర్తిస్తూ అయ్యో రామప్ప అనాల్సిన పరిస్థితిలను కల్పిస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం
యునెస్కో గుర్తింపు వొచ్చిన తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపంతో రామప్ప అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. గుర్తింపు వొచ్చి ఏడాది గడిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సందీప్‌ ‌కుమార్‌ ‌సుల్తానియా రామప్పను సందర్శించడం ప్రభుత్వం రామప్పపై చూపుతున్న నిర్లక్ష్యానికి అద్దం  పడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గర్వకారణంగా నిలిచిన రామప్పకు వొచ్చిన గుర్తింపును నిలబెట్టుకునేందుకు ఏం చేయాలనే దానిపై సీఎం కేసీఆర్‌ ‌దృష్టి పెట్టకపోవడం, ఇక్కడికి వొచ్చిన ఎమ్మెల్యేలు, మంత్రులు డప్పు కొట్టుకోవడానికి తప్ప అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. పనులు మీరు చేయాలంటే.. మీరే  చేయాలంటూ ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ, పురావస్తు శాఖ, స్థానిక గ్రామ ప్రజలు, అన్ని శాఖల అధికారులను కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నాలను గుర్తింపు వొచ్చిన ఏడాది తర్వాత మొదలు పెట్టడమే హాస్యాస్పదంగా కనిపిస్తుంది.
image.png
ఏడాదిలో చేసినవి…నాలుగు నెలల్లో చేయాల్సినవి…
యునెస్కో గుర్తింపు తర్వాత ఏడాది కాలంలో కూలిన తూర్పు ప్రహరీ నిర్మాణం, ఆలయం చుట్టూ రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, కెఫటేరియా, తాగునీటి సౌకర్యం, కామేశ్వరాలయం సమీపంలోని మూడు ఉపాలయాలు, గొల్లగుడి, శివాలయం మరమ్మతులు చేపట్టారు. భూగర్భ విద్యుత్‌ ‌వ్యవస్థ, చెరువు కట్టపై లేక్‌ ‌లెటర్స్‌ను కనిపించేలా చేశారు. గుర్తింపు దక్కాలంటే ప్రధానంగా చేయాల్సిన కామేశ్వరాలయ పునర్నిర్మాణం ప్రధానమైనది. దీని విగ్రహాలను ఆలయం చుట్టూ ఉన్న గార్డెన్‌ ‌ప్రాంతంలో ఎక్కడివక్కడ చిందరవందరగా పడేశారు. నంబర్లు వేసినా చాలావరకు చెరిగిపోయాయి. 2024 వరకు కామేశ్వరాలయ పునరుద్ధరణ చేయాల్సి ఉండగా పనుల్లో ఇసుమంతైనా పురోగతి కనిపించడం లేదు. మరో నాలుగు నెలల్లో రామప్ప పరిసరాల్లోని చిన్న ఆలయాలు, చెరువు కట్టపై ఉన్న కల్యాణ మండపం భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలి. పార్కింగ్‌ ‌స్థలం ఏర్పాటు, అంతర్జాతీయ స్థాయిలో కాటేజీలు, హోటల్లు సిద్ధం కావాలి. జంగాలపల్లి నుంచి రామప్ప వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణంతో పాటు వాహనాల సంఖ్యను పెంచాలి. ఏటీఎం, సీసీ కెమెరాలు ఏర్పాటు వంటి సౌకర్యాలను కల్పించాల్సి ఉంది.

image.png

నివేదికను తయారు చేసి డిసెంబర్‌ ‌లోగా ఐకోమాస్‌ ‌ప్రతినిధులకు పంపించాలి. వీటికోసం గత అక్టోబర్‌ 21‌న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వొచ్చిన సందర్భంగా ప్రసాద్‌ ‌పథకంలో చేర్చి 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేపట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఏడాది గడిచాక ప్రణాళికల పేరుతో హడావిడి చేయడం తప్ప క్షేత్రస్థాయిలో పనులు చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరుపై పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామప్ప చుట్టూ 100 మీటర్ల పరిధిలో బఫర్‌ ‌జోన్‌గా గుర్తించి తక్షణం చేయాల్సిన పనులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉండగా మిగతా పనులన్నీ మన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వొస్తాయి. పనులు పూర్తయ్యే వరకు ఐఏఎస్‌ ‌స్థాయి అధికారి పర్యవేక్షణ అవసరం ఉంది. జిల్లా కలెక్టర్‌ ‌సైతం రామప్పలోనే ఉంటూ పనులను చేయాల్సి ఉన్నా మంత్రులు వొచ్చినప్పుడు తప్ప ఇటువైపు కనిపించకపోవడం రామప్పపై అధికారులకు ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పని చేస్తూ యునెస్కో గుర్తింపును చేజారనీయకుండా రామప్పకు దక్కిన విశ్వఖ్యాతిని రక్షించుకునేందుకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Leave a Reply