రాష్ట్రంలో నిరుద్యోగ యువకులెవరూ ఇక ముందు ఉపాధి కోసం బెంగ పడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమయిన ఉపాధి అవకాశాలను సృష్టించింది. అయితే ఆ ఉపాధి మాత్రం సీజన్ల వారీగానే ఉంటది.. ఎంతలేదన్నా సంవత్సరానికి ఐదు నెలలపాటు ఉపాధి పక్కా..!. మనిషన్న వాడికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి. అసలు ఇంతకుమించిన ఉపాధి ఏదైనా, ఎక్కడైనా ఉంటుందా? అనవసరంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారేగాని ఇలాంటి ఉపాధి అవకాశాలను ఇంతవరకు ఏ రాష్ట్రమైనా కలిపించిందా చెప్పండి. మిగితా ఏడు నెలలపాటు మీరు మీ పిల్లాపాపలతో సొంత పనులు చూసుకుంటూ గడపవచ్చు. మీకు తగినంత విశ్రాంతి కూడా దీని ద్వారా లభిస్తుంది. ఉపాధికి సరైన నిర్వచనం ఏదైనా ఉందంటే హమాలీ పనే.
అసలు ఉద్యోగం అంటేనే ఉపాధి. అది కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అందుకే ఏడాదికి ఐదు నెలల ఉపాధి ప్రతీ గ్రామంలో కల్పించే బృహత్తర అవకాశాన్ని కల్పించడమైంది. ఇంతకన్నా సరైన ఎంప్లాయిమెంట్ అంటూ మరోటి ఉండదుకాక ఉండదు. అసలు ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చదువుకున్నోళ్ళందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాయా అంటే లేదనే సమాధానమే లభిస్తుంది. అందుకని చదువుకున్న వాళ్లంతా తమకు ఉద్యోగాలు కావాలన్నంత మాత్రాన సరిపోదు కదా. అందుకు ఉపాధిని వెతుక్కోవాల్సిందే. అలా వెతుక్కునే అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం పంచమాస ప్రణాళికను ప్రవేశపెట్టింది. ఒకవేళ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలేమైనా సృష్టిస్తే అది రాజకీయ నిరాశ్రయులకు పనికి వచ్చేవి గానే ఉంటాయి గాని, విద్యాధికులుకు మాత్రం పనికి వొచ్చేవి గా ఉండవు.
అసలు దేశంలోనే, ఆ మాటకొస్తే ప్రపంచంలో ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా చదువుకున్నవాళ్ళందరికీ ఉపాధి కల్పించిన దాఖలాలున్నాయా అంటే ఎక్కడాలేవన్న సమాధానమే వొస్తుంది. ఇంత పెద్ద ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వొచ్చిందంటే మన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఓ మంచి ఆలోచన వొచ్చింది. నిరుద్యోగ యువకులంతా ఉద్యోగాలు లేవంటూ అనవసరంగా ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంటున్నారేగాని, వారి కండ్ల ముందున్న ఉపాధి అవకాశాలను అందుకోలేకపోవడం పట్ల ఆయన నిజంగానే చాలా బాధపడ్డాడు. తాజాగా నాగర్‌కర్నూల్‌లో వరల్డ్ స్కిల్ యూత్ డే ను పురస్కరించుకుని యువతకు ఉపాధి పైన మంచి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగాల విషయమై డిమాండ్ చేస్తూ, యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారేగాని, సంవత్సరానికి ఐదు నెలలపాటు తాము ఉపాధి అందిస్తున్న దానిపైన ఎందుకు చర్చించడం లేదో అర్థం కావడం లేదని తెగ బాధపడ్డారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి సాగునీటి విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలైతేనేమీ, వరుణదేవుడి కటాక్షమైతేనేమీ రాష్ట్రంలో సమృద్ధిగా నీటి లభ్యత కారణంగా అంచనాలకు మించి పంటలు పండుతున్నాయి. పండించిన తమ ధాన్యాన్ని ఎక్కడికో మోసుకుపోకుండా తమ ప్రభుత్వం ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ప్రతీ కొనుగోలు కేంద్రంలో కనీసం వంద మందికి ఉపాధి లభిస్తున్నది. అయితే వర్షాకాలం రెండున్నర నెలలు, వేసవికాలం మరో రెండున్నర నెలలు కలిపి ఐదు నెలలపాటు ఈ కేంద్రాల్లో ఉపాధి లభిస్తుంది. ‘ఇది కదా ఉపాధి అంటే.. ? అంటూ ఉపాధిపైన తన అభిప్రాయాన్ని సుదీర్ఘంగా వివరించారు. అది కాస్తా వైరల్ అవడంతో తప్పంతా మీడియామీద నెట్టివేయడం వేరే విషయమనుకోండి.
అయినా ఆయన ను అనేంలాభంలేండి..! దేశ ప్రధాని లాంటివాడే అలాంటి సలహా ఇవ్వడాన్ని మనం చూశాంకదా? నిరుద్యోగులు అనవసరంగా కాలం వృధా చేయకుండా బుద్ధిమంతుల్లా పకోడి బండ్లు పెట్టుకోమని సలహా ఇవ్వలేదా ! అందరికీ ఉద్యోగం ఆచరణలో సాధ్యం కాదు, చేయాలనుకుంటే చాలా పనులున్నాయి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ బెస్ట్. అది ఎప్పుడూ నష్టం చేయదు. బాగా రుచికరంగా చేస్తే దానికి మించిన వ్యాపకం మరోటి లేదని ప్రధాని లాంటివాడు ఉపాధిపై ఉచిత సలహా పడేసినప్పుడు, మన మంత్రిని అని ఏం ప్రయోజనం చెప్పండి..!
మొత్తానికి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. మన నీళ్ళు, మన నిధులు, మన ఉద్యోగాలంటూ నినదించి, స్వరాష్ట్రాన్ని సాధించడంలో దాదాపు పన్నెండు వందల మంది ప్రాణత్యాగం చేశారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత సుమారుగా 50 నుంచి 60 మంది నిరుద్యోగం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. గత సంవత్సరం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడున్నర సంత్సరాల్లో ఒక్క గ్రూపు నోటిఫికేషన్ వెలువడలేదు. నోటిఫికేషన్లకోసం ఎదిరిచూసి వేసారిపోయి తాజాగా వనపర్తి నియోజకవర్గ పరిధిలోని తాటిపత్రి గ్రామానికి చెందిన కొండల్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం చాలా మందిని కలిచి వేసింది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి నిరంజన్‌రెడ్డి లాంటివారు యువత అనవసరంగా ఆవేశపడవొద్దు.. ఉపాధి అవకాశాలను వెతుక్కోవాలేగాని ఆత్మహత్యలు చేసుకోవద్దని సానుభూతి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ, రాష్ట్రం ఏర్పడిన 2014లోనే 1.12 లక్షల ఉద్యోగ ఖాలీ లున్నట్లు ఆనాటి లెక్కలు చెబుతున్నాయి. బిస్వాల్ కమిటి 1.91 లక్షల ఖాలీ లున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 14లక్షల మంది నిరుద్యోగులున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. కాని, వాస్తవంగా ఇరవై లక్షల మంది నిరుద్యోగులున్నట్లు వివిధ వర్గాలు చెబుతున్నమాట. ఉద్యోగంలేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కొండల్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 50వేల ఉద్యోగాలను నింపుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగాల కోసం ఎంతలేదన్నా అయిదు లక్షలమంది దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఉందని మంత్రే స్వయంగా చెప్పడంలోనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలుపుతున్నది. దీనిపై ప్రతిపక్షాలు కొంతకాలంగా ఆందోళన వెలిబుచ్చుతూనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలు చేసినప్పటికీ అందుకు అనుగుణంగా కొత్త ఉద్యోగాలు కల్పించలేదు. అంతెందుకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయలకు వైస్ చాన్స్లర్లను నియమించడంలో ఎంత ఆలస్యం చేసిందన్నది తెలియందికాదు. ఉద్యోగాల కల్పనపై డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏకంగా దీక్షనే చేపట్టింది. ఇప్పుడు ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
భారతీయ జనతాపార్టీ, కాంగ్రెస్‌కూడా నిరుద్యోగుల పక్షాన పోరాటానికి సిద్దమయ్యారు. తాజాగా వరంగల్‌లోని కొత్త కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వొచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కాన్వాయ్‌కు నిరుద్యోగులు అడ్డుపడే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయినా కనీసం నిరుద్యోగ భృతినైనా ఇస్తుందనుకుంటే ఆ ఆశకూడా లేకుండా పోయింది. 2018 ఎన్నికల సందర్భంగా ప్రతీ నిరుద్యోగికి నెల ఒక్కంటికి 3016 రూపాయల నిరుద్యోగ భృతిని కల్పిస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు లక్షా 82 వేల 914 కోట్లను బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు చెప్పింది. అప్పటినుండి ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం భృతి కోసం నిరుద్యోగులు చకోర పక్షుల్లా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మంత్రి నిరంజన్‌రెడ్డి చెప్పినట్లు చేయడమే శ్రేయస్కరం ..!.