Take a fresh look at your lifestyle.

కృష్ణా-గోదావరీ నదీ జలాల్లో తెలంగాణ వాటాపై.. రాజీలేని పోరాటం

  • అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశం ఆగస్టు 20 తరువాత నిర్వహించాలి
  • రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కేంద్రమే పరిష్కరించాలి
  • జలవనరుల శాఖపై సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష

కృష్ణా, గోదావరీ నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. కృష్ణా గోదావరీ జల్లాల్లో తెలంగాణ వాటా, ఆగస్టు 5న అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశంపై సీఎం కేసీఆర్‌ ‌గురువారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి నదీ జలాల వాటా విషయంలో కేంద్రం తీరుతో తెలంగాణ, ఎపి రెండు రాష్ట్రాలు నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని సమావేశంలో కేసీఆర్‌ ‌పేర్కొన్నారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డ సమయంలో రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం విషయంలో వివాదాలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర జల్‌శక్తి శాఖపైనే ఉందనీ, ఈ విషయంలో ఆ శాఖ పూర్తిగా విఫ)మైందని సమావేశంలో సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మరింత వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటిని కాపాడుకుంటామనీ, ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఇరు రాష్ట్రాల మధ్య నీటి వినియోగం విషయంలో వివాదాలు లేనప్పుడు సమస్యలు ఏమీ ఉండవనీ, సమస్యలు ఉన్నప్పుడే కేంద్రం సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుని ఉండాల్సిందనీ, ఈ విషయంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని సీఎం ఈ సమావేశంలో తీవ్రంగా ఖండించారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ ఆగస్టు 5న నిర్వహించ తలపెట్టిన సమావేశాన్ని 20 తరువాత నిర్వహించాలని కేంద్రానికి లేఖ రాయాలని సమావేశంలో నిర్ణయించారు. ఆరోజున ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నందున అపెక్స్ ‌కౌన్సిల్‌ ‌సమావేశానికి హాజరు కావడం ఇబ్బందికరంగా ఉంటుందనీ, ఇదే విషయాన్ని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు తెలియజేయాలని సీఎం కేసీఆర్‌ ‌సమావేశంలో చెప్పినట్లు సమాచారం. నీటి పంపిణీ విషయంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదనీ, తెలంగాణకు దక్కాల్సిన ప్రతీ నీటి చుక్కనూ సమర్థంగా వినియోగించుకోవాలని సమావేశంలో పాల్గొన్న అధికారులకు సూచించారు.  పునర్విభజన చట్టం ప్రకారం నీటి వివాదాల పరిష్కారాన్ని సెక్షన్‌ 13‌లో చేర్చాలని గతంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖను పెడచెవిన పెట్టడంపై సమావేశంలో కేసీఆర్‌ ‌తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply