ప్లాన్‌కు వ్యతిరేకంగా పలు గ్రామాలు తీర్మానం – ఆందోళనకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 17 : జగిత్యాల టౌన్ మాస్టర్ ప్లాన్‌పై ఆందోళన కొనసాగుతున్నాయి. జగిత్యాల మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా మరో గ్రామపంచాయతీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. జగిత్యాల అర్బన్ మండలం థరూర్ గ్రామ పాలకవర్గం మంగళవారం సమావేశమై మాస్టర్ ప్లాన్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. తమ గ్రామాన్ని కమర్షియల్ జోన్ కింద చేర్చడం పట్ల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు తీర్మానం చేసిన పాలకవర్గ సభ్యులు.. ర్యాలీగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మున్సిపల్ అధికారులకు తీర్మాన పత్రాన్ని అందించారు. మరోవైపు మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ.. అంబారిపేట్ గ్రామస్తులు గ్రామసభ నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై సభలో చర్చించారు.
ఈ గ్రామ సభకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై గ్రామస్తులకు సంఘీభావం తెలిపారు. అనంతరం మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా వెంటనే రద్దు చేయాలని మహిళా రైతులు గ్రామ పంచాయతీ బిల్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. ఎమ్మెల్యే, కలెక్టర్ వొచ్చి తమకు రద్దు తీర్మానం ఇచ్చే వరకూ పోరాటం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కాగా, నూతన మాస్టర్ ప్లాన్‌లో జగిత్యాల చుట్టు పక్కల గ్రామాలతో పాటు వ్యవసాయ భూములను కలుపుతూ అధికారులు పబ్లిక్ జోన్, సెవి• పబ్లిక్ జోన్లుగా ముసాయిదా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మాస్టర్ ప్లాన్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలంటూ నర్సింగా పూర్ మహిళా రైతులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి ముందు నిరసనకు దిగారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ భూములను తీసుకోవద్దని ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అండగా ఉంటానని.. ఒక్క గుంట భూమి కూడా పోనివ్వబోనని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రైతులకు హావి• ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ నుంచి రైతుల భూములను తొలగిస్తామని చెప్పారు. ఇక మాస్టర్ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ సోమవారమే జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ పాలకవర్గం రాజీనామా చేసింది. తిమ్మాపూర్ సర్పంచ్ మెరుగు రమ్య (కాంగ్రెస్), ఉప సర్పంచ్ ఏలేటి మోహన్ రెడ్డి(బీఆర్ఎస్) తో సహా ఎనిమిది మంది వార్డు మెంబర్ల రాజీనామాలు చేశారు. మరోవైపు వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుమాల రాజేష్ కూడా రాజీనామా చేశారు.