Take a fresh look at your lifestyle.

రాష్ట్రపతి అభ్యర్థిని నిలపడంలో ఏకమైన విపక్షాలు

భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయ రాజకీయ వ్యవస్థనొకదాన్ని ఏర్పాటు చేసేందుకు తలమునకలవుతున్న విపక్షాలు తుదకు ఒక అడుగు మాత్రం ముందు కేశాయి. మరో రెండు సంవత్సరాల్లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఒక తాటిపైకి రావాలని దాదాపు సంవత్సరకాలానికి పైగానే మంతనాలు జరుపుతూ వొస్తున్నాయి. కాని, పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలె అన్న విషయం దగ్గరే ఆగుతున్నదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ వ్యతిరేక కూటమికి ఎవరు సారథ్యం వహించాలన్న విషయంలో ఆయా పార్టీలు ఎవరికివారు గుంబనంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా రాష్ట్రపతి ఎన్నికలు రావడం ఆ పార్టీలకు ఒక విధంగా కలిసి వొచ్చినట్లు అయింది. ఏకతాటిపై రావడానికి తర్జనభర్జన పడుతున్న ఈ పార్టీలకు రాష్ట్రపతి అభ్యర్థిని నిలిపే విషయంలోనైనా ఏకాభిప్రాయం ఏర్పడుతుందా అన్న అనుమానాలకు తావు లేకుండా మొత్తానికి రాష్ట్రపతి అభ్యర్థి ఎన్నికల్లో అధికార పార్టీకి పోటీగా నిలబెట్టడంలో విపక్షాలు సఫలమైనాయి. సోమవారం తమ ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ ‌సిన్హాతో నామినేషన్‌ ‌వేయించగలిగాయి. నామినేషన్‌ను ఎన్నికల అధికారికి అందించే క్రమంలో ముఖ్యంగా బిజెపిని వ్యతిరేకిస్తున్న వాటిల్లో ప్రధాన పక్షమైన కాంగ్రెస్‌ ‌నాయకులు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, జైరామ్‌ ‌రమేశ్‌, ‌నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌చీఫ్‌ ‌ఫరూక్‌ అబ్దుల్లా, ఎన్సీపి అధ్యక్షుడు శరద్‌ ‌పవార్‌, ‌సమాజ్‌వాది పార్టీ నాయకులు అఖిలేశ్‌ ‌యాదవ్‌, ‌డియంకె నాయకుల ఏ. రాజా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అధికార టిఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వకుంట్ల తారకరామారావు తదితరులు పాల్గొన్నారు.

యశ్వంత్‌ ‌సిన్హాను ఎంపిక చేయడానికి ముందు ఈ విపక్షాల పార్టీల మధ్య పెద్ద చర్చనే జరిగింది. ఈ అభ్యర్థిత్వానికి ముందుగా అనేక పేర్లు వారి మధ్య చర్చకు వొచ్చాయి. మహారాష్ట్ర సీనియర్‌ ‌నాయకుడు ఎన్సీపి నేత శరద్‌ ‌పవార్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలుపాలనుకున్నారు. కాని, ఆయన విముఖత చూపించడంతో అత్యంత సీనియర్‌ ‌నాయకుడు నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్‌ అబ్ధుల్లా పేరు వెలుగు చూసింది. ఆ తర్వాత మహత్మాగాందీ మనుమడు, పశ్చిమ బెంగాల్‌ ‌మాజీ గవర్నర్‌ ‌గోపాలకృష్ణ గాంధీ పేరు కూడా ప్రస్తావనకు వొచ్చింది. పై ముగ్గురు కూడా వివిధ కారణాలతో రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీపడేందుకు విముఖత వ్యక్తంచేశారు. దేశం యావత్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాష్ట్రపతి ఎన్నికకు ఎట్టకేలకు విపక్షాలు యశ్వంత్‌ ‌సిన్హాను ఒప్పించగలిగాయి. ఈ విషయంలో విపక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వొచ్చి, సిన్హాను ఏకగ్రీవంగా ఆమోదించడం విశేషమే.

84 ఏళ్ళ యశ్వంత్‌ ‌సిన్హా ఐఏఎస్‌ అధికారిగా దాదాపు రెండున్నర దశాబ్ధాలపాటు బీహార్‌ ‌మొదలు, వివిధ రాష్ట్రాల్లో, కేంద్రంలో అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి. జర్మనీలోని భారత రాయబార కార్యాలయంలో మొదటిసారిగా కార్యదర్శిగా నియమించబడిన వ్యక్తికూడా. జనతాపార్టీ ద్వారా రాజకీయ అరంగెట్రం చేసిన సిన్హా రాజ్యసభ సభ్యుడిగా, చంద్రశేఖర్‌, అటల్‌ ‌బిహారి వాజ్‌పాయ్‌ ‌ప్రభుత్వాల్లో ఆర్థిక మంత్రిగా , విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కూడా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి బిజెపిని వీడి 2021లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసీలో చేరి, ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ, విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆ పార్టీకి, పదవికీ రాజీనామాచేసి సోమవారం తన నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈయన అభ్యర్థిత్వాన్ని సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించడం రానున్న కాలంలో బిజెపికి వ్యతిరేకంగా కూటమి కట్టాలనుకుంటున్న ఈ పార్టీల కల నెరవేరుతుందనడానికి ఇది శుభ సూచకమంటున్నారు రాజకీయ పరిశీలకులు.

ఇదిలాఉంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ తమ రాష్ట్రపతి అభ్యర్థినిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. ఇప్పటికే ఆమె ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్నది. కాగా, సోమవారం తన నామినేషన్‌ను దాఖలు చేయడానికి ముందే యశ్వంత్‌ ‌సిన్హా తన ప్రత్యర్థి పార్టీ నాయకులను తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా లేఖలు రాయడం ఇందులో ఆసక్తిని కలిగిస్తున్న విషయం. ప్రధాని నరేంద్రమోదీ మొదలు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌సీనియర్‌ ‌బిజెపినాయకుడు ఎల్‌.‌కే. అద్వాని, జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సోరెన్‌కు స్వయంగా ఫోన్‌ ‌చేసి మద్దతివ్వాల్సిందిగా కోరారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన ద్రౌపది ముర్ముకన్నా గిరిజనుల అభ్యున్నతికి తానే ఎంతో సేవ చేశానంటున్నారు యశ్వంత్‌ ‌సిన్హా. కాగా అధికార పార్టీ పక్షాన పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము కూడా ప్రతిపక్షాలకు స్వయంగా ఫోన్‌చేసి మాట్లాడారు. కాంగ్రెస్‌ ‌చీఫ్‌ ‌సోనియాగాందీ, ఎన్సీపి నేత శదర్‌ ‌పవార్‌, ‌బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ తదితరులకు ఫోన్‌చేసి మద్దతివ్వాల్సిందిగా కోరింది. దీంతో రాష్ట్రపతి ఎన్నిక దేశరాజకీయాల్లో సంచలనాత్మకంగా మారే అవకాశాలున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఏ వర్గానికి సంపూర్ణ మెజార్టీ లేదు. క్రాస్‌ ఓటింగ్‌ ‌లేదా మరో విచిత్రం జరిగితే తప్ప ఎవరో ఒకరు గెలిచే అవకాశం లేదన్నది ఆయా పార్టీల బలాబలాలు చెబుతున్నాయి. మొత్తానికి 2024లో రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇది ముందస్తు తీర్పుగా ఉండబోతుందనుకుంటున్నారు.

Leave a Reply