మానవునికి ప్రకృతికి అవినాభావ సంబంధం. ప్రకృతి ఆధారంగా చేసుకుని జరుపుకునే పండుగ ఉగాది. ఇది మానవాళికి కాల మహిమను తెలిపి, జీవన సారాన్ని ఉపదేశించి, ఉత్సాహపరిచి ముందుకు నడిపే విశిష్టమైన పండుగ. వేదాలను దొంగిలించిన సోమకుడు అనే రాక్షసుణ్ణి వధించి, మత్స్యావతారధారి అయినా విష్ణువు వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మ కు ఇచ్చిన శుభ సందర్భంగా, విష్ణువు సంతోషం కోసం జరుపుకునే ఉత్సవమే ఉగాదిగా ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి.
‘’ చైత్రమాసి జగద్ బ్రహ్మ ససర్జ ప్రథమే హని!
శుక్లపక్షే సమగ్రంతు తదా సూర్యోదయే సతి!!
చైత్ర శుద్ధ పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మ సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా యుగాది జరుపబడుతుంది అని శాస్త్ర వచనం. ఖగోళ గణిత శాస్త్రాన్ని అనుసరించి గణించినా చైత్రమాస ఆరంభమే యుగాది. ఈ యుగాది కాలక్రమంలో ఉగాదిగా మారిందని చెబుతారు. ఉగాదిని మనం నూతన సంవత్సరానికి నాందిగా జరుపుకుంటాం, కనుక దీనిని సంవత్సరాది అని అంటారు. ఉగ అంటే నక్షత్ర గమనం అని అర్థం. చంద్రుడు ఒక నక్షత్రం నుండి మరో నక్షత్రానికి వెళ్లే గమనాన్ని గణించి తెలుగు నెలలను ఏర్పాటు చేసినారు. ఈ నెలలే చాంద్ర మాసాలు. మనదేశంలో కాలాన్ని గణించే పద్ధతులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉన్నాయి. ద్రావిడ ప్రాంతంలో రోజులు, నెలలు సౌరమానాన్ని బట్టి, అంటే మేషాది రాసులలో సూర్య ప్రవేశ కాలాన్ని గణించడం జరుగుతుంది. వీటిని సౌర మాసాలు అంటారు. ఉత్తర భారతంలో బృహస్పతి పద్ధతి వాడుకలో ఉన్నది. కనుక సంవత్సరాది వివిధ ప్రాంతాలలో భిన్నంగా ఉంటుంది. హిందువులకు అన్ని కర్మలు చేయడానికి చాంద్రమాన, సౌరమానా లే ప్రధానమైనవి. వైదిక కర్మలను నిర్వహించే సందర్భమున తిధి,వార, నక్షత్ర, సంవత్సరాలను చెబుతారు. కర్మ పట్ల విశ్వాసం ఉన్నవారు, నూతన సంవత్సరం మొదటి రోజున కొత్త జీవితం ఆరంభం అవుతుందని, ఆ రోజును పవిత్రమైన పండుగగా జరుపుకుంటారు. ఉగాది వర్తమాన సంవత్సరంలో తమ జీవితాన్ని నిర్ణయిస్తుందని తెలుగు ప్రజలు భావిస్తారు. అందులకే ప్రజలందరూ ఈరోజు దైనందిన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉగాది పండుగను తెలంగాణ. ఆంధ్ర ప్రదేశ్ లలో విశేషంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలో ‘గుడిపాడ్వా’ అనే పేరుతో, మలయాళీలు విషు అని. సిక్కులు వైశాఖి అనే పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు.
‘’ఉగాది పచ్చడి ప్రత్యేకం’’
ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించడం ఈ పర్వదిన ప్రత్యేకం. తీపి కారం ఉప్పు వగరు చేదు పులుపులు జీవితంలోని వివిధ అనుభవాలకు ప్రతీకలుగా నిలిచే రుచులు. జీవితంలోని సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. వేప ఆరోగ్యాన్ని, బెల్లం రక్షణను, ఉప్పు వాత, మాంద్యంలను, చింతపండు పలు రోగ నివారణలను, మామిడి పైత్యం మొదలగు వాటి నివారణకు ఉపయోగపడేవిగా గ్రహించాలి. ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. ఈ పచ్చడి కొరకు చెరుకు అరటి పళ్ళు జామకాయలను కూడా ఉపయోగిస్తారు. జీవితంలోని అనుభవాల సారాన్ని తెలిపే ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా అందరూ స్వీకరిస్తారు.
‘’పంచాంగ శ్రవణం’’
ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయతిగా వస్తోంది. తిధి వార నక్షత్ర యోగ కరణము అను ఐదు అంగములు కలది పంచాంగం. మానవుల జీవితాలు కాలంతో ముడిపడి ఉన్నాయి. కాలం గ్రహాల సంచారం పైన ఆధారపడి ఉంది. గ్రహాల సంచారాన్ని తెలిపేదే జ్యోతిష శాస్త్రం. మానవుడు పుట్టినప్పటినుండి గిట్టే వరకు అతని భవిష్యత్తు గ్రహ సంచారం పైన ఆధారపడి ఉంటుందని భారతీయుల విశ్వాసం. అందులకే కొత్త సంవత్సరం మొదటి రోజున పంచాంగ శ్రవణం వింటారు. సంవత్సరంలోని మంచి చెడులను, ఆదాయఫలాలను, స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని దానికి అనుగుణమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ ప్లవ నామ సంవత్సరం అందరికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించాలని కాల స్వరూపుడైన భగవంతుని ప్రార్థిద్దాం.
– వేదాంతం హరి కుమార్
వరంగల్.9951191819