Take a fresh look at your lifestyle.

ఉద్యాన పంటలపై కొరోనా ప్రభావం

కొరోనా ప్రభావం ఉద్యాన పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నది. చేతికి వచ్చిన పంటను మార్కెట్‌ ‌చేసుకునే సమయంలో లాక్‌డౌన్‌ ఆయా పంటల రైతుల పట్ల శాపంగా మారింది. ప్రతీ సంవత్సరం ఏదో కారణంగా నష్టపోతున్న తమను ఈసారైన గట్టెక్కిస్తుందనుకుంటే కనీస పెట్టుబడి గూడా రాకుండా పోతోందని రైతులు విలపిస్తున్నారు. ఈ సీజన్‌ ‌రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మంచి ఆదాయాన్ని సమకూర్చే సమయం. మొక్కజొన్న, వరి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలతో ఆ రైతులకు కొంత ఊరట లభించినా బత్తాయి, ద్రాక్ష, మామిడి రైతుల కష్టాలు మాత్రం తీరేట్లుగా లేవు. కొన్నిచోట్ల మంచి దిగుబడి వచ్చినా, మరికొన్ని చోట్ల వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ముప్పై శాతం కూడా దిగుబడికి రైతులు నోచుకోలేకపోయిన పరిస్థితి. దానికితోడు సరిగ్గా మార్కెట్‌కు తరలించాల్సిన సమయంలోనే కొరోనా కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న లాక్‌డౌన్‌ ‌రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నది. పట్టణాలు, గ్రామాలన్నీ కర్ఫ్యూ వాతావరణంలో కొనసాగుతుంటే వాటిని కోసే కార్మికులు లేకుండా పోయారు.

 

బత్తాయి, మామిడి సీజన్‌లో వాటిని కోసి సరైన ప్యాకింగ్‌చేసే నేర్పు ఉన్న కార్మికులంతా ఎక్కడివారు అక్కడే ఆగిపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కోయడం ఒక ఎత్తు అయితే వాటిని మార్కెట్‌కు తరలించడం మరోఎత్తు. దిగుబడి వచ్చే సమయానికి వీటిని మార్కెటింగ్‌ ‌చేసుకునే వ్యాపారస్తులు కొరోనా కారణంగా రాలేకపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. అటు బత్తాయి, ఇటు మామిడి కాయలను చెట్లమీద ఎక్కువకాలం ఉంచలేని పరిస్థితి. ఇప్పటికే చాలావరకు నేలపాలవుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి తెలంగాణ మామిడిపండ్లకు మంచి డిమాండ్‌ ఉం‌ది. మన రాష్ట్రంలోని ఉమ్మడి జగిత్యాల, కరీంనగర్‌, ‌మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలు మామిడిసాగుకు ప్రసిద్ది. ఈ ప్రాంతాల్లో ఈసారి 75 నుండి ఎనబై వేల ఎకరాల్లో మామిడిసాగైనట్లు తెలుస్తున్నది. బంగన్‌పల్లి, దసేరి, తోతాపరి, చిన్నరసాలులాంటి రకాలను ఇక్కడ ఎక్కువగా పండిస్తారు. ఇక్కడి పండ్లను దేశంలోని ఇతర రాష్ట్రాలతోపాటు ప్రధానంగా ఢిల్లీ వాసులు ఎక్కువగా ఇష్టపడుతారు. ఎంతలేదన్నా  ప్రతీఏట 250 కోట్ల రూపాయల మేర మామిడిపండ్ల ఎగుమతి జరుగుతూ వస్తున్నది. అలాంటిది కొరోనా కారణంగా వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నది. గత సంవత్సరం ఈ రోజు వరకే  వెయ్యి టన్నుల మేర మామిడికాయలు ఎగుమతి అయ్యేవి. ఈసారి అందులో సగం మాత్రమే మార్కెట్‌ ‌జరిగినట్లు తెలుస్తున్నది. అలాగే ఈసారి పంటకు మంచి ధర వస్తుందనుకున్నారు. గత సంవత్సరం టన్ను 50వేలకు పైగా పలికితే ఇసారి 20 నుంచి 30 వేలుమాత్రమే పలుకుతుండడం రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నది. ఇరవై వేలకైనా తీసుకుపోయేవారు, కానీ వారికి కావాల్సిన కాయలు కోయడానికి కార్మికులు కూడా లభ్యం కావడం లేదంటున్నారు. వరి, మొక్కజొన్న ధాన్యానికి గిట్టుబాటుధర ప్రకటించినట్లే ప్రభుత్వం మామిడికి కూడా గిట్టుబాటుధర ప్రకటించడంతో పాటు, కోల్డ్ ‌స్టోరేజ్‌లో భద్రపర్చుకునే అవకాశం కల్పించాలంటున్నారు మామిడి రైతులు.
ఇదిలాఉంటే బత్తాయి రైతుల పరిస్థితి కూడా ఇందుకేమీ తీసిపోదు. చెట్టుమీదనే బత్తాయి పండు పండిపోయి, కింద రాలిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నామని రైతులు విలపిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 47నుండి 50 ఎకరాల్లో బత్తాయి సాగు జరుగుతున్నా, ఎక్కువగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఈపంటను పండించటం అలవాటు. ఒక్కో రైతు ఇరవై అయిదు నుండి ముప్పై ఎకరాల్లో ఇక్కడ బత్తాయిని సాగుచేస్తారు. ఒక్కో ఎకరానికి రెండు నుండి రెండున్నర లక్షల వరకు పెట్టుబడిపెట్టిన ఈ రైతులు కనీసం ఈసారి తమ పెట్టుబడి కూడా వచ్చేట్లులేదని వాపోతున్నారు. ప్రతీ ఏటా తెలంగాణ నుండి 30వేల మెట్రిక్‌ ‌టన్నుల బతాయి ఎగుమతి అవుతుండగా ఈసారి బతాయిని కోసేవారు లేరు, కొనేవారు లేరు. అన్నిటికి మించి మార్కెట్‌కు తరలించే రవాణా సదుపాయం లేదు.

నిన్నమొన్నటి వరకు మార్కెట్లు కూడా మూతపడడంతో దిక్కుతోచని పరిస్థితి. వివిధ ప్రాంతాల నుండి కొనుగోలుదారులు వచ్చి తమకు ముందస్తుగానే డబ్బు ఇచ్చి వెళ్ళేవారని, కొరోనా కారణంగా ఎవరూ రాలేకపోతున్నారని దీంతో రాలిపోతున్న కాయలు తమ ఆశలను కూడా నేలరాలుస్తున్నాయంటున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌ అయిన ఢిల్లీలోని అజాద్‌పూర్‌ ‌పండ్ల, కూరగాయల మార్కెట్‌ను తెరిపించడం వీరికి కాస్త ఊరటనిచ్చింది. ఈ మార్కెట్‌ ‌తెరవడంతో హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ ‌తెరిపించడంతో బత్తాయి రైతులకు సంతోషకరమైనప్పటికీ కూలీల కొరత ఇంకా వారిని ఇబ్బంది పెడుతున్నది. ద్రాక్ష సాగు రైతులు కూడా ఇదేతరహా అవస్థను ఎదుర్కుంటున్నారు. పంట చేతికి వచ్చినా దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొరోనా భయంతో దినసరి కూలీలంతా తమతమ గ్రామాల బాటపట్టడంతో ఈ పంటలన్నీ ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు మార్కెట్‌లోకి తరలకుండా పోతున్నాయి. లాక్‌డౌన్‌ ‌కొనసాగిస్తున్న నేపథ్యంలో ఉద్యాన పంటలన్నిటినీ తెలంగాణలోనే వినియోగించాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌చెప్పినట్లు కనీసం తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినా అటు రైతులకు నష్ట నివారణ, ఇటు వినియోగదారులకు చౌకగా పండ్లను అందించే అవకాశముంటుంది.

Leave a Reply