Take a fresh look at your lifestyle.

పరీక్షల్లో విజయం మీదే..!

“ప్రణాళిక ప్రకారం చదవడంతోపాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధింవచ్చు. లక్ష్య సాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటికి ఎదురీదుతూ,పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలను కున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధన దిశగా మిత్రులతో చర్చించడం, మేధావులు, విజేతలు, సీనియర్స్ ‌సలహాలను తీసుకొని ముందుకు వెళ్తే లక్ష్యం మీకు దాసోహం అవుతుంది.మీ శక్తిసామర్థ్యాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధించారు. మీరూ సాధించగలరు.”

ఇలా సిద్ధం కండి..

విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయి నట్లయితే పరిస్థితి ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి. ప్రణాళిక ప్రకారం చదవడంతో పాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధింవచ్చు. ఇందుకు ఈ కింద సూచించిన పద్ధతులను అనుసరిస్తే మేలు జరుగుతుంది.

సమాధానాలు రాయడం ఒక కళ: ఎంత బాగా చదివినా, ఎంత గుర్తున్నా, వ్రాసే విధానం తెలియక పోతే మంచి మార్కులు సాధించడం కష్టం.అంతేకాదు చేతిరాత బాగుండాలి. నిర్వచనం ఉంటే యధాతథంగా రాయాలి. చిన్న ప్రశ్నలకు సమాధానాలలో ముఖ్యమైన విషయాలు వదలకుండా రాయాలి. జవాబులో నిర్వచనం ఉంటే ముందుగా రాయాలి. ముఖ్యమైన ఉపశీర్షికలుంటే వాటిని అండర్‌ ‌లైన్‌ ‌చేయాలి. అవసరమైన చోట చిత్రపటాలను గీసి, భాగాలు గుర్తించాలి. పరీక్షల సమయంలో ప్రశాంతంగా ఉండడం ఎంతో మంచిది.

పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి: సబ్జెక్టులన్నింటికి సమయం కేటాయించి ప్రణాళిక ప్రకారం చదువుకోవాలి. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య చదివితే మంచి ఫలితం ఉంటుంది. కష్టమైన, ఇష్టం లేని సబ్జెక్ట్‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి. ప్రతిరోజు అవసరమైనంతసేపు నిద్రపోవాలి.ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహించాలి. చల్లని పదార్థాలు తినడం, తాగడం చేయకండి.

పరీక్షలకు రెండు రోజుల ముందు: మొదటి పరీక్ష కోసమే చదవాలి. గతంలో చదివినంతవరకు మాత్రమే రివిజన్‌ ‌చేయాలి. కొత్తవి నేర్చుకోవాలని ప్రయత్నించకండి. కష్టపడి చదవడం వరకు మాత్రమే మనం చేయగల కానీ ఫలితం మన చేతుల్లో ఉండదని గుర్తించాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండే ప్రయత్నం చేయాలి.

పరీక్ష రాసే రోజున ఇలా చేయాలి: పరీక్ష సమయానికి కనీసం గంట ముందు వరకు చదవడం మానాలి. పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరాలి. పరీక్ష రాయడానికి కావలిసిన పెన్నూ పెన్సిళ్లు వంటివి సిద్ధం చేసుకోవాలి. స్నేహితులతో సరదా మాటలు తప్పించి పరీక్ష గురించి చర్చించకూడదు.

పరీక్ష కేంద్రంలో ఇలా ఉండాలి: పరీక్ష హాలులో 2 నుండి 5 నిముషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూచోవాలి. ఇన్విజిలేటర్‌ ఇచ్చే సూచనలు శ్రద్ధగా విని పాటించాలి. పరీక్షకు సంబంధించిన సబ్జెక్ట్ ‌మెటీరియల్‌ ‌తదితర పుస్తకాలు వంటివి చిన్నముక్క కూడా దగ్గర ఉంచుకోకూడదు. ప్రశ్నాపత్రం, బెంచ్‌లపై ఏమీ రాయకూడదు. అలాంటి పనులు చేస్తే తనిఖీ అధికారులు డిబార్‌ ‌చేస్తారు. ప్రశ్నాపత్రం ఇవ్వగానే శ్రద్ధ్దగా చదవాలి. మొదట తేలికగా ఉన్న ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొదటి పేజీ అందంగా రాసే ప్రయత్నం చేయాలి. ప్రశ్నలు కష్టంగా అనిపిస్తే కంగారు పడొద్దు, మీకే కాదు, అందరికీ అలాగే అనిపిస్తాయి. సమాధానాలు రాయడం పూర్తైన తర్వాత ప్రశ్నల నంబర్లు సరి చూసుకోండి.. సమయం మిగిలితే రాసిన సమాధానాలు పున:పరిశీలించుకోవాలి.

పరీక్ష హాలు నుండి బయటకు వచ్చాక: స్నేహితులతో తప్పొప్పుల గురించి చర్చించకూడదు. ఆహారం తీసుకున్నాక కొంత సమయం విశ్రాంతి తీసుకుని తరువాతి పరీక్షకు ప్రిపరేషన్‌ ‌కావాలి.

అన్ని పరీక్షలు అయిన తరువాత: నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఫలితం నా చేతుల్లో లేదనుకోవాలి.

ఫలితాలు విడుదల అయిన తర్వాత: వచ్చిన మార్కులను బట్టి లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ఫెయిలయిన విద్యార్థులు బాధపడి కుంగిపోకూడదు. చదువు జీవితంలో ఒక భాగమని, ఇదే ప్రధానం కాదని, మంచిగా బతకడానికి చాలా మార్గాలున్నాయని అర్థం చేసుకోవాలి. చావడం అనేది మూర్ఖులు మాత్రమే చేస్తారు, తెలివి గలవారు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు.లక్ష్య సాధనలో ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. వాటికి ఎదురీదుతూ, పరిష్కరిం చుకుంటూ ముందుకు వెళ్లినవారే ప్రపంచ విజేతలు అవుతారు. ఒక అంశం నేర్చుకోవాలనుకున్నప్పుడు అది ఎంత కఠినమైనా కానీ ఆ అంశం సాధన దిశగా మిత్రులతో చర్చించడం, మేధావులు, విజేతలు, సీనియర్స్ ‌సలహాలను తీసుకొని ముందుకు వెళ్తే లక్ష్యం మీకు దాసోహం అవుతుంది. మీ వెనుకేముంది ముందేముంది అనేది మీ కనవసరం. మీలో ఏముంది అనేది ముఖ్యం. మీ శక్తిసామర్థ్యాలతో లక్ష్యాన్ని సాధించాలి. ఇలా ఎందరో సాధించారు. మీరూ సాధింగలరు. తద్వారా ఇతరులకూ స్ఫూర్తినివ్వగలరు.

atla srinivas reddy

అట్ల శ్రీనివాస్‌ ‌రెడ్డి
సైకాలజిస్ట్ ‌మరియు కౌన్సెలర్‌
9703935321

Leave a Reply