Take a fresh look at your lifestyle.

ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు ఇద్దరు మృతి, ఒకరు గల్లంతు

వరంగల్‌ ‌రూరల్‌ ‌జిల్లా పర్వతగిరి మండలం తీగరాజుపల్లిలో ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు పడి ఇద్దరి మృతి, ఒకరి గల్లంతు అయిన ఘటన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సంఘటన స్థలాన్ని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు పరిశీలించి, ఘటనకు దారి తీసిన పరిస్థితులను పోలీసులు అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న మృతదేహాలలను చూసి విచారం వ్యక్తం చేశారు.

ఈ ఘటనలో అదృష్టవశాత్తు బయటపడిన విజయభాస్కర్‌తో మాట్లాడి జరిగిన ఘటనను మంత్రి తెలుసుకున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో వరంగల్‌ ‌వినాయక ట్రేడర్స్‌కు చెందిన వీర్ల శ్రీధర్‌ (38) ‌తన బ్రిజా కారులో డ్రైవర్‌ ‌బైకానీ రాజేష్‌(28) (ఎనుగల్‌), ‌మరో ప్రైవేట్‌ ఉద్యోగి హంస విజయ భాస్కర్‌ (‌పాఖాల కొత్తగూడ)లు కలిసి పర్వతగిరి వైపు వెళ్తున్నారు. వీరి కారును తీగరాజుపల్లి వద్ద గుంటూరుపల్లి జడ్‌పిఎస్‌ఎస్‌ ‌పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న పసుల సరస్వతి (42) లిఫ్ట్ అడిగి ఆకారు ఎక్కారు. కొద్దిదూరం ప్రయాణం తర్వాత ఎస్‌ఆర్‌ఎస్పి కాలువ వద్ద కారు అదుపుతప్పి ఆ కాలవలో పడింది. దీంతో అందరూ చూస్తుండగానే పసుల సరస్వతి, వీర్ల శ్రీధర్‌లు ఈత రాకపోవడంతో నీటిలో మునుగుతూ చనిపోయారు.

- Advertisement -

ఈత వచ్చిన విజయభాస్కర్‌ ‌కారు డోరు తీసుకుని బయటకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. అతడికి తాడు అందించి అందుబాటులో ఉన్న కొందరు రక్షించారు. అయితే కారు డ్రైవర్‌ ‌రాజేష్‌ ‌మాత్రం కార్‌ ‌లోనే ఉన్నట్లుగా భావిస్తున్నారు. కార్‌ ‌డ్రైవ్‌ ‌చేస్తున్న సమయంలో సీట్‌ ‌బెల్ట్ ‌పెట్టుకున్న రాజేష్‌ ‌బయటికి రాలేక పోయి అందులోనే చిక్కుకుని మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ విషాదం అలుముకుంది. కాగా, ఘటనా స్థలానికి మామునూరు ఏసిపి నరేష్‌ ‌కుమార్‌, ‌పర్వతగిరి సిఐ బోనాల కిషన్‌, ఎస్‌ఐ ‌తదితర పోలీసు అధికారులు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న అధికారులను మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎస్సారెస్పీ కాలువ వద్ద తగిన మరమ్మతులు చేసి, అడ్డు గోడ నిర్మించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే ఇలాంటి ప్రదేశాలలో ప్రమాద హెచ్చరిక బోర్డులను పెట్టాలని చెప్పారు. ప్రయాణికులు రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ, ట్రాఫిక్‌ ‌రూల్స్‌కు అనుగుణంగా జాగ్రత్తగా ప్రయాణం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply