- పురుషుల హైజంప్‌లో ప్రవీణ్ కుమార్‌కు రజతం
- అవని లెఖరా ఖాతాలో మరో పతకం..50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్
- 12 కు చేరిన పతకాల సంఖ్య..అభినందించిన ప్రధాని మోడీ
పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలో మరో పతకం వొచ్చి చేరింది. పురుషుల హైజంప్‌లో ప్రవీణ్‌కుమార్ రజత పతకం సాధించాడు. దీంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 12కు చేరింది. మరోవైపు రజతం సాధించిన ప్రవీణ్‌కుమార్‌కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ప్రవీణ్ కృషి, పట్టుదలకు నిదర్శనమే ఈ పతకమని చెప్పారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు. శుక్రవారం జరిగిన టి64 హైజంప్‌లో ప్రవీణ్ కుమార్ అద్భుతం చేశాడు. పారాలింపిక్స్ అరంగేట్రంలోనే పతకం సాధించాడు. 2.07 మీటర్లు గెంతి సరికొత్త ఆసియా రికార్డు సృష్టించాడు. స్వర్ణం అందుకున్న జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డస్ 2.10 మీటర్లు గెంతడం గమనార్హం. కాగా భారత బృందంలో అత్యంత పిన్న వయసులోనే పతకం అందుకున్నది 18 ఏళ్ల కుమారే కావడం ప్రత్యేకం.
ప్రవీణ్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. నోయిడాకు చెందిన అతడు 2019లో ఈ క్రీడలో అడుగుపెట్టాడు. అద్భుత ప్రదర్శన చేసిన ప్రవీణ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అతడి అంకితభావం, పట్టుదలకు ఈ పతకం నిదర్శనమని పొగిడారు. ‘పారాలింపిక్స్‌లో రజతం గెలిచిన ప్రవీణ్‌ను చూసి గర్విస్తున్నాను. అతడి అకుంఠిత దీక్ష, అంకితభావం, శ్రమకు ఈ పతకమే నిదర్శనం. అతడికి అభినందనలు. మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. ‘భవిష్యత్‌లో అతను చేసే ప్రయత్నాలకు శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా అభినందించారు.
అవని లెఖరా ఖాతాలో మరో పతకం.. 50 మీటర్ల రైఫిల్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్
పారాలింపిక్స్‌లో షూటర్ అవని లెఖారా మరోసారి చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ గెలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ గెలుచుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్‌గా అవని నిలవడం విశేషం. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 12కు చేరింది.