జర్నలిస్టుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ.. కుటుంబాలకు భరోసానిచ్చిన మంత్రి హరీష్‌రావు
సిద్ధిపేట, జూలై 23 (ప్రజాతంత్ర బ్యూరో): అనారోగ్యంతో దవాఖానలలో చికిత్స పొందుతూ సిద్ధిపేట జిల్లాలో ఇద్దరు జర్నలిస్టులు మృతి చెందారు. సిద్ధిపేట జిల్లా గౌరారంకు చెందిన మర్కూక్ మండల కేంద్రానికి ఆంధ్రజ్యోతి విలేఖరిగా పని చేస్తున్న యువరాజు, సిద్ధిపేట కేంద్రంగా భారత్టుడేకు రిపోర్టర్‌గా పని చేస్తున్న బండ్ల నగేష్ ఇద్దరూ అనారోగ్యంతో వేర్వేరు దవాఖానలలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. యువరాజు గత మూడు రోజులుగా ఈసిఎల్లోని క్సీనియా ఆసుపత్రిలో కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందడం పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువరాజ్ మృతి బాధాకరమని, పాత్రికేయ వృత్తిలో ఎంతో నిబద్దతతో పని చేసినట్లు ఆయన సేవలను కొనియాడారు.
తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జర్నలిస్టు కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటానని చెప్పారు. అలాగే, సిద్ధిపేటకు చెందిన భారత్‌టుడే రిపోర్టర్ బండ్ల నగేష్(గోల్డెన్)అనారోగ్యంతో మృతి చెందగా ఆయన మృతి పట్ల మంత్రి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు. యువ జర్నలిస్టుగా ఎంతో భవిష్యత్ ఉన్నప్పటికీ విధి రాత మన అందరి మధ్య లేకుండా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, కుటుంబానికి అన్నివిధాలుగా అండగా
ఉంటానని చెప్పారు.
జర్నలిస్టు సంఘాల నేతలు సంతాపం…
సిద్ధిపేట జిల్లాకు చెందిన జర్నలిస్టులిద్దరూ ఒకే రోజు మృతి చెందడం పట్ల జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులను తీవ్రంగా కలచివేసింది. కన్నీటిపర్యంతమయ్యారు. యువరాజు, నగేష్ మృతి పట్ల జర్నలిస్టు సంఘం నాయకులు ఖాజా విరాహత్ అలీ, కలకుంట్ల రంగాచారి, పి.అరుణ్‌కుమార్, అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి, నాయిని సంజీవరెడ్డి, దాసరి కృష్ణ, ఏల్పుల మహేష్, చిటుకుల మైసారెడ్డి, జగదీశ్వర్, సయ్యద్ మునీర్, సతీష్ త•దితరులు సంతాపం వ్యక్తం చేస్తూ మృతి చెందిన జర్నలిస్టులతో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. జర్నలిస్టు సంఘాల నేతలు, జర్నలిస్టులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు కూడా జర్నలిస్టుల మృతి పట్ల సంతాపం తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.