Take a fresh look at your lifestyle.

మోడీ పాలనలో రెండు పార్శ్వాలు

modi and trump in india

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌,ఆయన సతీమణి..అమెరికా ప్రథమ మహిళ మెలానియాలు జీవితంలో మరిచిపోలేని ఘనస్వాగతాన్ని భారతగడ్డపై పొందారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ వారికి ఈ విధమైన స్వాగతం లభించి ఉండదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఐదు నెలల క్రితం అమెరికాలోని టెక్సాస్‌లో లభించిన స్వాగతం కన్నా ఇప్పుడు ట్రంప్‌ ‌దంపతులకు లభించిన స్వాగతం ఎన్నో రెట్లు మిన్న. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకునే అవకాశం ట్రంప్‌ ‌దంపతులకు ఈ పర్యటన ద్వారా లభించింది. ట్రంప్‌ ‌తనకు లభించిన స్వాగతానికి పులకించి పోయారు. మొతెరా స్టేడియంలో లక్షన్నర పైగా ప్రజలను చూడగానే ఆయన ఆనందంతో పులకించారు. ఎన్నడూ లేని విధంగా ప్రజల స్వాగతానికి చప్పట్లు కొడుతూ ఆయన తన ఆనందాన్ని వ్యక్తం పర్చారు. భారత దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని మాటల్లోనే కాకుండా కళ్ళెదుట ఆయన సోమవారంనాడు అహ్మదాబాద్‌లో చూశారు. వివిధ సంప్రదాయ నృత్యాలను తిలకించినప్పుడు ఆయన ముఖంలోని హావభావాలు ఆయన ఆనందానికి అద్దం పట్టాయి.ఆ విషయాన్ని ఆయన ప్రసంగంలో ప్రస్తావించారు. భారతీయులు చాలా గొప్ప సంప్రదాయానికి వారసులనీ, తమ సంస్కృతి సంప్రదాయాల పట్ల మిక్కిలి గౌరవం కలిగినవారని ఆయన అన్నారు. ప్రవాస భారతీయులు అమెరికా ఆర్థికాభివృద్ది కృషిలో అందిస్తున్న సహాయ సహకారాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.అమెరికన్‌ ‌సమాజంలో భాగంగా ప్రవాస భారతీయులు వివిధ రంగాల్లో ముఖ్యంగా, సమాచార సాంకేతిక రంగంలో ఎంతో పురోభివృద్దిని సాధిస్తున్నారని అన్నారు. భారతీయుల శ్రమ, పట్టుదల, కార్యదీక్ష, అంకిత భావం చాలా గొప్పదని ప్రశంసించారు. కేవలం భారతీయులను పొగడటానికి మాత్రమే తాను రాలేదనీ, ఉన్న విషయం చెబుతున్నానని ఆయన అన్నారు. రక్షణ రంగంలో భారత్‌ ‌ను ప్రధాన భాగస్వామ్య దేశంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించి భారత్‌కు భూమండలంలో ఎవరికీ లేనంత శక్తిగల ఆయుధాలు, రక్షణ పరికరాలను భారత్‌కి అందిస్తామంటూ ట్రంప్‌ ‌ప్రకటించడం ఒక విధంగా మనకు గర్వకారణమే అయినా, అమెరికాతో రక్షణ రంగంలో అంత సాన్నిహిత్యం వల్ల భవిష్యత్‌ ‌లో అనేక సమస్యలు ఉత్పన్నం కావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

భారత్‌ ‌ప్రథమ ప్రధాని నెహ్రూ హయాం నుంచి అలీన విధానాన్ని అనుసరిస్తోంది. అప్పటికన్నా ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వచ్చిన మాట వాస్తవమే కానీ, ఏకధ్రువ ప్రపంచంలో అన్ని దేశాలూ స్వీయ రక్షణ విధానాలను అనుసరిస్తున్నాయి. ఈ కోణం నుంచి చూసినప్పుడు మన ఆయుధాలు, మన ప్రాదేశిక సమగ్రత, మన వాణిజ్యం మొదలైన వాటిని దృష్టిలో ఉంచుకుని ఒప్పందాలను తీసుకోవల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల్లో ఆచితూచి అడుగు వేస్తున్న మాట నిజమే అయినా, అమెరికాతో మరీ అంత సాన్నిహిత్యం ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన చాలా మందిలో వ్యక్తం అవుతోంది.ఏమైనా అగ్రరాజ్యాధినేత మన దేశానికి తొలిసారి వొచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం చెప్పి మన సంస్కృతి సంప్రదాయాలను మరోసారి అగ్రరాజ్యానికి తెలియజేసినందుకు మోడీని అభినందించాల్సిందే.ఢిల్లీలో సీఏఏకి వ్యతిరేకంగా ఆందోళనలు,హింస చోటు చేసుకున్న వేళ అహ్మదాబాద్‌లో ట్రంప్‌ ‌స్వాగతం ఘనంగానే ఉన్నప్పటికీ, దీనిపై విమర్శలు ఏ తీరులో ఉంటాయో వేచి చూడాల్సిందే. మోడీ తాను తలచింది చేసేస్తారనడానికి సీఏఏ అమలు విషయంలో తీసుకున్న దృఢ వైఖరి ఓ నిదర్శనం. ట్రంప్‌ ‌వద్ద మన గౌరవం నిలిచినందుకు ఆనందిద్దామా లేక అదే రోజున రాజధాని నగరంలో కాల్పుల మరక పడినందుకు బాధ పడదామా. మోడీ పాలనలోని రెండు పార్శ్వాలకు ఈ పరిణామాలు నిదర్శనం.

Leave a Reply