- రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని మేమే కోరాం
- అపెక్స్ కౌన్సిల్ మిట్‌కు వెళ్లకుండా కెసిఆర్ ఎత్తులు
- ప్రాజెక్టుల వద్ద పోలీసులను ఎందుకు మోహరించారు
- మిడియా సమావేశంలో మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఎత్తిపోతల ఆపాలని తొలిసారి స్పందించింది తానేనని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో వి•డియా సమావేశంలో ఆయన మాట్లాడూతూ.. 2020 ఆగస్టు 5న కేంద్రం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం సమయంలోనే కావాలనే సీఎం కేసీఆర్ మంత్రివర్గ సమావేశం పెట్టుకున్నారని చెప్పారు. కేసీఆర్, జగన్‌ల మధ్య ఉన్న అవగాహన బయట పడుతుందనే కౌన్సిల్ భేటీకి వెళ్లట్లేదని ఆరోపించారు. ప్రాజెక్టుల వద్ద పోలీసులను పెట్టాల్సిన అవసరం ఏం వొచ్చిందని సంజయ్ ప్రశ్నించారు. సీమ ఎత్తిపోతల పనులు పూర్తవుతుంటే కేసీఆర్ ఫాంహౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారని సంజయ్ విమర్శించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే ఇద్దరు సీఎంలు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రజల్లో అయోమయం సృష్టించేందుకే కేసీఆర్ కొత్త డ్రామాకు తెర లేపారని ఆరోపించారు. కేంద్ర మంత్రికి సీఎం కేసీఆర్ ఫోన్ చేయడం ఒక జోక్ అని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ వల్లే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని విమర్శించారు. నీళ్లు, నిధులు, నియామకాలను కెసిఆర్ స్వయంగా జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ‘2015లో జూన్ 18, 19 తేదీలలో మొదటిసారి జరిగిన సమావేశంలో నీటి పంపకాలపై తెలంగాణ సలహాదారు విద్యాసాగర్, హరీష్ రావు అంగీకారం తెలిపిన మాట వాస్తవం కాదా? 2016 సెప్టెంబర్ 21న జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్, చంద్రబాబులు మాట్లాడుకున్నారు. 299 టిఎంసీల నీళ్లు తెలంగాణకు, 512 టీఎంసీల నీళ్లు ఆంధప్రదేశ్‌కు ఆనాడు కేటాయింపులు చేసుకున్న మాట వాస్తవం కాదా’ అని అన్నారు. 811 టీఎంసీలలో 575 టీఎంసీల నీళ్లు రావాలని 12.5.2020న రజత్ కుమార్ లేఖ రాశారు. అప్పటి కౌన్సిల్ సమావేశంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదట ఒప్పుకుందే కేసీఆర్ అన్నారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల నీటి కేటాయింపులకు ఒప్పుకుని.. తెలంగాణకు అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజా ఇంటికి వెళ్ళినప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందన్నారు.
203 జీవో మే5 న జారీ చేస్తే మొదట స్పందించింది తామేనని అన్నారు. గతేడాది మే 11న దీనిపై కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసింది తానేనని, ఆ తర్వాత ఆంధప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాలపై మే 12న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సీఎస్‌తో లేఖ రాయించారని, తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర జలశక్తి కేఆర్‌ఎంబీని ఏపీ ప్రాజెక్టుల నిర్మాణం ఆపేల చూడాలని కోరింది. ఈ ఏడేళ్ల వ్యవధిలో ముఖ్యమంత్రి చేసిన కార్యక్రమాలపై షెడ్యూల్ విడుదల చేయగలారా? అని ప్రశ్నించారు. మే నెల మొత్తం లేఖల ద్వారా హెచ్చరించినా..ఆగస్టులో పనులు జరుగుతున్నాయని తెలిసినా సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని సంజయ్ ప్రశించారు. ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తయ్యే సమయానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోలీసులు మోహరించేలా చేసి డ్రామాలు ఆడుతున్నారని, హుజూరాబాద్ ఎన్నికలు ముగిసే వరకు ఈ డ్రామా నడుస్తుందని, ప్రాజెక్టుల నిర్మాణం జరిగే చోట అవసరమైతే రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకుంటారని, కొత్త డ్రామాలకు తెరలేపి.. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
గతంలోనే ఒప్పందం జరిగిందని అంటూ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఇదిలావుంటే కృష్ణా జలాల్లో అన్యాయం జరుగుతున్నా సీఎం కేసీఆర్ మౌనంగా ఉండడానికి కమిషన్లే కారణమన్నారు మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా – పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గతంలో ఏపీ సీఎం జగన్ ను ఇంటికి పిలుపించుకొని చర్చించిన కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు వివేక్. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి పంపకాలు జరగాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో లాభపడింది కాంట్రాక్టర్లు మాత్రమేనని చెప్పారు.