Take a fresh look at your lifestyle.

ఇం‌తింతై ఇరవై ఏండ్లు పూర్తయి..

ఇరవై ఏండ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించాలని వచ్చే నెల వరంగల్‌లో పెద్ద ఎత్తున ప్రజా సదస్సును నిర్వహించాలని నిర్ణయించింది. గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసే విధంగా చర్యలు చేపడుతుంది. ఏప్రిల్‌ 27, 2001…. ‌తెలంగాణ చరిత్రలో మరిచిపోలేని, చెరిపి వేయలేని రోజు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన రోజు. అంతకు ముందు దశాబ్దాల తరబడి వివిధ రూపాలలో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమానికి దిక్సూచిలా తెరాస ఉద్భవించిన రోజు. ఈ 20 ఏళ్ల కాలంలో తెరాస ప్రస్థానం ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో రాజకీయ ప్రక్రియకు ఉన్న ప్రాధాన్యతను పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజా ఆకాంక్షలను సాధించుకోవడానికి పార్టీలు ఒక చోదక శక్తి లాగా ఎలా పనిచేస్తాయో నిరూపించింది.

దశాబ్దాలుగా నిరంతరం కొనసాగిన తెలంగాణ రాష్ట్ర సాధనా ఉద్యమం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఆవిర్భావంతో ఒక కీలక మలుపు తిరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, ఇచ్చిన పిలుపులు, నడిపించిన ఉద్యమాలు, వేసిన రాజకీయ ఎత్తుగడలు తెలంగాణ ఉద్యమాన్ని ప్రత్యేక పంథాలోకి తీసుకెళ్లి పత్రికల పతాక శీర్షికలు ఆక్రమించి, పార్లమెంటు వ్యవస్థను ఒప్పించి, మెప్పించి అనుకున్న లక్ష్యాన్ని సాధించి చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోతాయి.

నూతన మిలీనియంలో ప్రజా పోరాటాలకు,ఉద్యమాలకు అంతగా ఆస్కారం లేని సందర్భంలో టిఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో తెలంగాణ ఉద్యమంలో నూతన అధ్యాయం మొదలైంది.. తెలంగాణ కోసం ఏ తెలంగాణ నాయకుడు ముందుకు వచ్చినా నాయకునికి పదవి రాలేదనో లేక బ్లాక్‌మెయిల్‌ ‌చేసి పదవి తెచ్చుకోవడానికో తెలంగాణ జపం చేస్తున్నాడని ఆ నాయకున్ని, ఉద్యమాన్ని బద్నాం చేయడం సీమాంధ్రుల లాబీకి మొదటి నుంచి ఒక అలవాటు. కెసిఆర్‌ ‌పార్టీ ప్రకటించిన కొద్ది గంటలకే ఆ పార్టీని విమర్శించిన వారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిలో కొనసాగడం విచిత్రం.

కెసిఆర్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీని హడావిడిగా ఆగమేఘాల మీద ప్రకటించలేదు. టిఆర్‌ఎస్‌ ‌పార్టీ స్థాపించడమే కాదు. దాని ద్వారా తెలంగాణ ఉద్యమ నిర్మాణం, రాష్ట్రాన్ని ఎలా సాధించాలి? ఏ దారిలో ముందుకు సాగాలి? అంతకు ముందు సాగిన ఉద్యమ పంథా.. ప్రజా సంఘాలు, పార్టీలు ఎంత మేరకు విజయం సాధించాయి? ఎక్కడ విఫలమయ్యాయి? తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే సంకీర్ణ ప్రభుత్వాల యుగంలో ఎలాంటి రాజకీయ ఎత్తుగడల ద్వారా గమ్యాన్ని చేరుకోవాలి అనే ఆలోచనలను తెలంగాణవాదులతో ప్రతిరోజు సుమారు 14 నుండి 16 గంటలు కొన్ని నెలల పాటు చర్చించి విశ్లేషించి.. సమయం చూసి పార్టీని ప్రకటించారు.

జలదృశ్యంలో పార్టీ ఆవిర్భావం ప్రకటిస్తూనే డిప్యూటీ స్పీకర్‌ ‌పదవికి, శాసన సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ప్రకటించి ఒక లక్ష్యం కోసం ప్రజా ప్రయోజనం కోసం పదవులను త్యాగం చేసిన నేతను చూసి తెలంగాణ వాదులలో ఒక నమ్మకం ఏర్పడింది. పార్టీ పెట్టిన వందరోజుల లోపే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుకొని సిద్దిపేట ఉపఎన్నిక, మెదక్‌ ఉప ఎన్నిక ఇలా ఈ సందర్భం వచ్చినా తెలంగాణ నలు దిశలకు పార్టీ నిర్మాణాన్ని విస్తరించడానికి ప్రతి సందర్భాన్ని చక్కగా వినియోగించుకున్నారు.

కరీంనగర్‌ ‌సింహగర్జన, పాలమూరు జైత్రయాత్ర మొదలుకొని పార్టీ వార్షికోత్సవాలు, పోరాట కార్యక్రమాలు, బహిరంగ సభలతో తెలంగాణ మహాప్రస్థానం మొదలైంది. కెసిఆర్‌ ఆశించినట్లుగానే అనతికాలంలోనే తెలంగాణ మేల్కొన్నది. అన్ని వర్గాలు ముందుకు కదిలాయి. 1999 ఎన్నికల ఫలితాలలో తెలంగాణాలో ఏర్పడిన రాజకీయ శూన్యత సందిగ్ధంలో ఉన్న రెండవ శ్రేణి రాజకీయ నాయకులకు ఒక దారి, భవిష్యత్తులో నాయకునిగా ఎదగాలని ఆశిస్తున్న వారికి భద్రమైన స్థానం టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ద్వారా లభించింది.

తెలంగాణవాదానికి పార్లమెంటరీ రాజకీయ వేదిక మీద ఒక వ్యక్తీకరణగా ఒక విశాలమైన ప్రాంతీయ ప్రజా ఆకాంక్షగా ఏర్పడిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ విధానాలు నచ్చని ప్రజా సమూహాలు, సంఘాలు, రాజకీయ పక్షాలు, మేధావులు అనివార్యంగా టిఆర్‌ఎస్‌తో కలిసి నడవక తప్పని పరిస్థితి కల్పించింది. 20 ఏళ్ల ప్రస్థానంలో ఉద్యమకారులను పార్టీ నాయకులను ఒకే బాటలో పయనించేటట్లు చేసి తెలంగాణ బావజాల వ్యాప్తికి ఒకవైపు ఉద్యమ రూపాన్ని, మరోవైపు ఫక్తు రాజకీయ రూపాన్ని ఏకకాలంలో ప్రదర్శించింది. ప్రజా ఉద్యమ క్రమంలో ప్రజల్లో కలిసిపోయి ఉద్యమాలు నిర్మించి ఆ తదుపరి అధికారానికి వచ్చిన రాజకీయ పార్టీలు దేశ చరిత్రలో చాలా అరుదు.

ఈ ఇరవై ఏళ్ల ప్రస్థానం తెరాసను తెలంగాణలో ఒక తిరుగులేని గొప్ప రాజకీయ శక్తిగా మలచింది. అనేక ఆటుపోట్లను రాజకీయ కుట్రలు సమర్థవంతంగా ఎదుర్కొని అజేయంగా అప్రతిహతంగా ముందుకు సాగిపోతున్నది. తెలంగాణ ఉద్యమం తెలంగాణ సమాజాన్ని ఏకతాటి పైకి చేరింది. అతికొద్ది మందితో ప్రారంభమైన టిఆర్‌ఎస్‌ ఒక గొప్ప రాజకీయ శక్తిగా మలచడంలో కెసిఆర్‌ అనుసరించిన వ్యూహాలు విమర్శకులను సైతం ప్రశంసించేలా ఉన్నాయి. ఉద్యమ సందర్భంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ కేవలం రెండున్నర జిల్లాల పార్టీగా, అతి చిన్న ఉప ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ పలుమార్లు విమర్శించింది. అటువంటి టిడిపిని తెలంగాణలో రెండున్నర నియోజకవర్గాలకి పరిమితం చేయడం), వైయస్సార్‌ ‌పార్టీని కనీసం పోటీలో లేకుండా చెయ్యడం, బలమైన క్యాడర్‌, ‌ప్రజా సంఘాల బలం కలిగిన కమ్యూనిస్టు పార్టీలను రాజకీయ క్షేత్రంలో ఉనికి లేకుండా చేయడంలో కేసిఆర్‌ అనుసరించిన పద్ధతులు అబ్బుర పరుస్తాయి.

2001 నుండి 2014 వరకు టిఆర్‌ఎస్‌ ఒక ఉద్యమ పార్టీగా ఉంటూ తన లక్ష్యం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. 2014 నుండి అధికారంలో ఉంది. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన కాంగ్రెస్‌ ‌పార్టీని కాదని, మద్దతు ఇచ్చిన నాటి ప్రతిపక్షం బీజేపీని కాదని ప్రజలు టిఆర్‌ఎస్‌కు పట్టం కట్టారు. ఎన్నికలు ఏవైనా టిఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా మద్దతు పలుకుతున్నారు. ఈరోజు టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సభ్యులు దాదాపు యాభై లక్షల వరకు ఉన్నారు. దేశ విదేశాల్లో స్థిరపడిన తెలంగాణా వాదులు టిఆర్‌ఎస్‌ ‌పట్ల అభిమానంతో ఆయా ప్రాంతాలలో శాఖలను ఏర్పాటు చేసుకున్నారు. రాజకీయ పార్టీలకున్న అన్ని హంగులు సమకూర్చుకోవడంలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ సఫలీకృతం అవుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో మంది కొత్తవారు వివిధ పార్టీల నుంచి వచ్చినవారు, తమ నాయకుల వెంట సామూహికంగా తరలిన వారు ఉన్నారు. కానీ పార్టీకి పునాదిగా పునాదిరాళ్లుగా మొదటి నుండి కష్టంలో నిష్ఠూరం లో నిలబడ్డ కార్యకర్తలను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది.

జెండాలు మోసే టిఆర్‌ఎస్‌ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేసిన వారు కొందరైతే, సమయానికి వచ్చి అంది వచ్చిన అవకాశాలతో అందలమెక్కిన వారు మరికొందరు. ఈ వ్యత్యాసం క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఉన్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని మొదటినుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారికి న్యాయం జరగాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల పోరాటాల త్యాగాలకు, ఒక రాజకీయ వ్యక్తీకరణకు ప్రతీక. తెలంగాణలో వచ్చిన ప్రజాస్వామిక శక్తులను, ఉద్యమకారులను, కార్యకర్తలను ఏకకాలంలో సమన్వయం చేసుకుంటూ పోతే మరో 20 ఏళ్ల వరకు కూడా డోకా ఉండదు.

– సురేష్‌ ‌కాలేరు

Leave a Reply