ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు లైట్లను ఒకేసారి ఆర్పివేయడం వల్ల తెలంగాణ పవర్ గిడ్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు స్పష్టం చేశారు. కొరోనా మహమ్మారిని తరిమేసి నిరంతరం ప్రకాశం వైపు సాగాలని ఆకాంక్షిస్తూ ఆదివారం రాత్రి 9 గంటలకు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఒకేసారి ఇళ్లలో లైట్లను ఆర్పివేయడం వల్ల తెలంగాణ గ్రిడ్లు కుప్పకూలిపోతాయని సామాజిక మాధ్యమాలలో విస్త•తంగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ప్రచారంపై ప్రభాకరరావు శనివారం వివరణ ఇచ్చారు.
ఒకేసారి లైట్లు ఆర్పితే గ్రిడ్‌పై ఎలాంటి ప్రభావం ఉండబోదని స్పష్టం చేశారు. తగిన జాగ్రత్తలతో గ్రిడ్‌కు సమస్య తలెత్తకుండా అప్రమత్తతతో ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణ పవర్ గ్రిడ్ సురక్షితంగా ఉందనీ, ఇప్పటికే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. కొరోనా కట్టడికి ప్రధాని మోదీ పిలుపును విజయవంతం చేయాలనీ, ప్రజలు లాక్డౌన్లో పాల్గొని కొరోనా వ్యాప్తిని అరికట్టాలన్నారు. లాక్డౌన్ అమలులో ఉన్నందువల్ల విద్యుత్ బిల్లులను ఆన్లైన్లో చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభాకరరావు విజ్ఞప్తి చేశారు.