తెలంగాణలో తమ పార్టీకి పునర్ వైభవాన్ని తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సిద్దపడుతున్నది. రెండు రోజుల క్రితం ఆ పార్టీ ఏర్పాటుచేసిన డిజిటల్ మహానాడులో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటినుండి తెలంగాణలో తెలుగుదేశంపార్టీ కొడగడుతూనే ఉంది. వాస్తవంగా నాలుగు దశాబ్దాల కింద తెలంగాణలో ఆ పార్టీ ఆవిర్భావం జరిగినా, ఇప్పుడాపార్టీకి ఈ ప్రాంతంలో రాజకీయ గుర్తింపు కరువైంది. ఆ పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ మూడుసార్లు, ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు మరో రెండు సార్లు ముఖ్యమంత్రులుగా ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో కొనసాగినప్పటికీ ఇవ్వాళ తెలంగాణలో కేవలం ఒక్కటంటే ఒక్క ఎంఎల్‌ఏ స్థానానికే పరిమితమైంది. రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఏపీలో విజయబావుటా ఎగుర వేసినప్పటికీ, ఆ తర్వాత అధికారాన్ని కోల్పోయిన టిడిపి ఇప్పుడు ఆ రాష్ట్రంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నది. ఆ రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా అక్కడి అధికార పార్టీదే అందవేసిన చెయ్యి అవడంతో రాజకీయంగా తట్టుకోలేని పరిస్థితిలో ఇప్పుడా పార్టీ ఉంది. దానికి తగినట్లుగా అధికార పార్టీతో అనేక కేసులు మోపబడి రోజుకో కొత్త సమస్యతో కొట్టుమిట్టాడుతున్నది.
తెలంగాణలో కూడా 2014 ఎన్నికల తర్వాత ఆపార్టీకి తిరోగమనమే ఎదురవుతున్నది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణనుండే ఏపిలో పాలన సాగించాలనుకున్నాడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. కాని, చంద్రబాబు రాజకీయాలు, ఎత్తులను చూసిన తెలంగాణ సిఎం కేసిఆర్ టిడిపిని పరాయి పార్టీగా, ఇంకా ఆంధ్రనేతల పాలనేనా అంటూ ఆ పార్టీని ప్రజల నుండి దూరం చేయడంలో ఒక విధంగా విజయవంతమైనాడనే చెప్పవొచ్చు. తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడిన ఆంధ్రులను కూడా తన వైపు తిప్పుకోవడంలో కెసిఆర్ సఫలీకృతుడైనాడు. దీంతో రాష్ట్ర విభజనానంతరం జరిగిన మొదటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 15 స్థానాలు మాత్రమే గెలిచింది.
గెలిచినవారిలో 12 మంది ఏకంగా టిఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో టిడిపి డీలా పడిపోయింది. ఆ తర్వాత 2018లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నైతే తెలుగుదేశంపార్టీ కనిష్ట స్థాయికి చేరుకుందంటేనే పార్టీ ఎలా దిగజారుతూ వొస్తున్నదన్నది అర్థమవుతున్నది. ఇంకా తొమ్మిది నెలల సమయం ఉందనగానే కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు దిగారు. ఒకవైపు బిజెపి తెలంగాణ రాష్ట్రంపై తమ జండాను ఎగురవేస్తామని దూసుకు వొస్తుండడం, మరోపక్క చేర్పులు మార్పులతో రాజకీయ వాతావరణం అస్తవ్యస్తంగా ఉండడంతో కాస్తా బలం ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్ళాలన్నది కెసిఆర్ ఆలోచన. ఆ ఆలోచనతోనే ఆ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ 88 స్థానాలను గెలుచుకుని తిరుగులేని మెజార్టీని సాధించుకోగలిగింది.
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ఇద్దరు ఎంఎల్‌ఏల్లో ఓ ఎంఎల్‌ఏ అప్పుడే గోడ దూకేసిన విషయం తెలిసిందే. అలాగే ఆ పార్టీలోని ప్రధాన నాయకుల్లో దాదాపు తొంబై శాతం మంది అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల్లోకి మారిపోయారు. వారివెంట వారి క్యాడర్‌కూడా మారిపోయింది. గడచిన అయిదేళ్ళుగా రాష్ట్రంలో జరిగిన వివిధ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ కనీస గుర్తింపును తెచ్చుకోలేకపోవడమే తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నది. తమది జాతీయ పార్టీగా చెప్పకుంటున్నప్పటికీ ప్రధానంగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ క్యాడర్‌ను పెద్దగా పట్టించుకోకపోవడం ఆ పార్టీకి తీరని లోటుగా మారింది. ఇక్కడి సెటిలర్స్ మీద ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయినా కెసిఆర్ అక్కడి నాయకత్వంతోనేగాని, మిగితా సెటిలర్లందరినీ తెలంగాణ ప్రజలుగానే భావిస్తామని చెప్పిన మాటలు వారిని ఆకర్షించాయనడానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అయితే ఇటీవల కెసిఆర్ పాలనపైన తీవ్ర విమర్శలు వొస్తున్నాయి.
ముఖ్యంగా ఒకవైపు బిజెపి, మరోవైపు కాంగ్రెస్ నిత్యం టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై దండెత్తుతూనే ఉన్నాయి. దానికి తగినట్లుగా టిఆర్‌ఎస్ వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి బయలుదేరింది. ఇటీవల ఈటెల రాజేందర్ ఎపిసోడ్ ఇక్కడ రాజకీయ వాతావరణం లోనే మార్పు తీసుకువొచ్చింది. ఇదే అవకాశంగా టిఆర్‌ఎస్‌లోని అసంతృప్తులను చేర్చుకుని తమ పార్టీలను బలోపేతం చేసుకునే ఆలోచనలో ప్రతిపక్షాలున్నాయి. కాగా సందట్లో సడేమియాగా ఈ రాజకీయ అనిశ్చిత వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవాలని డా.వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురు షర్మిల ఇక్కడ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నది. ఇప్పటికే ఒకసారి తెలంగాణను చుట్టబెట్టింది. తన కొత్త పార్టీ పేరు ప్రకటనకు కోవిద్ అడ్డువొచ్చింది. లేకపోతే రెండవ విడత తెలంగాణ యాత్ర సాగించేదే. తెలంగాణలో రాజకీయ వ్యాక్యూమ్ ఉందని, ప్రశ్నించే పార్టీల కరువేర్పడిందంటోంది షర్మిల. కెసిఆర్ పాలన, రాజకీయ అనిశ్చిత వాతావరణం తమకు కూడా అనుకూలమేనంటోంది ఇప్పుడు టిడిపి క్యాడర్. అదే విషయాన్ని మహానాడు సందర్భంగా టిడిపి అధినేత చంద్రబాబు దృష్టికి ఆ పార్టీ తెలంగాణ నాయకత్వం తీసుకుపోయింది. తెలుగువారి ఆత్మగౌరవంగా తెలంగాణలో ఏర్పడిన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానంటూ అధినేత చంద్రబాబు హామీతో ఇంకా మిగిలిఉన్న క్యాడర్ తెగ ఉత్సాహ పడుతున్నది. రానున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికా రచనకు నాయకత్వం సిద్దమవుతున్నది.