Take a fresh look at your lifestyle.

మేధావుల నెత్తిపై – సర్కారు కత్తి!!

మేధావులు తెలియక కాదు. కానీ ఏదో ఒక చోట మెత్తబడి రాజీపడి తమ అభ్యుదయ మార్గము నుండి తప్పుకున్న కారణంగా ప్రజలకు ఈ దుస్థితి దాపురించింది. ప్రజలను వెన్నంటి ఉండవలసిన మేధావులు ప్రజా వ్యతిరేకులుగా మారి ప్రభుత్వానికి మద్దతు పలకడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.స్వతంత్ర విధానంతో, నిష్పాక్షిక ఆలోచనతో, శాస్త్రీయ వైఖరులను కలిగి సమసమాజం ఏర్పాటు కోరుతూ మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశించే మేధావులు తమ బాధ్యతను విస్మరించడం కొత్తేమీ కాదు. కానీ వివక్షత ముసుగులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రుగ్మత కొనసాగడం ఆందోళనకరం.

సమాజంలో మేధావుల పాత్ర రోజురోజుకు తగ్గిపోతుంది. ప్రధానమైన కారణం మేధావుల పై, ప్రశ్నించే గొంతు పై ప్రభుత్వ కత్తి వెళ్లడం వల్ల మేధావులు సమాజానికి దూరంగా ఉండి జీవిస్తున్నారు. ఆధునిక శాస్త్రీయ భావాలు గల మేధావులను బయటికి రాకుండా చేసి నేటి రాజకీయ వేత్తలు తమ నిర్బంధ ఆలోచనా విధానాలను  మేధావుల రుద్దుతున్నారు మేధావులు మౌనం సమాజానికి హానికరం అనే మాటలు తరచుగా వింటూ ఉంటాం. జ్ఞానవంతులై ఉండి తమ కళ్ల ముందు నేరం జరుగుతుంటే స్పందించకపోవడం, దాన్ని నేరంగా గుర్తించకపోవడం కూడా నేరమే అనే మాటలు కూడా నినాదాల రూపములో అక్కడక్కడా గోడలపైన, చట్టం గురించి మాట్లాడే వాళ్లు ఈ మాటలు తరగతి అంటుంటారు. మేధావుల విధివిధానాలను రాజకీయ నాయకులు గమనించి సమాజంలో మేధావుల పాత్ర లేకుండా చేయాలని రాజకీయ నాయకులు భావించడం వల్లనే నిర్బంధాలకు భయపడి మేధావులు బయటికి రావడం లేదన్న నగ్నసత్యం మనకు దర్శనమిస్తుంది! మేధావి అంటే! కేవలం రాకెట్లు తయారు చేయడం! అను బాంబులు తయారు చేయడం! శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడం అనుకుంటున్న రాజకీయ నాయకులు, సమాజానికి కూడా ఒక మేధావి అవసరమని భావించడం లేదు. మేధావుల పట్ల సమాజం కూడా అంతగా పట్టించుకున్నట్టు కనపడటం లేదు. సమాజంలోని అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావాలని ఆలోచనల్లో, సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అకృత్యాలను ప్రభుత్వాలకు తెలియజేసే సప్త కేవలం మేధావులకు, పత్రిక వ్యవస్థలకు,మాత్రమే ఉంటుంది.

గతంలో ఎంతోమంది మేధావులు సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి సమాజాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకు పోయే విధంగా వారి ఆలోచనా విధానాలు ఉండేవి గతంలో ప్రస్తుతం కంటే ఎక్కువ నిర్బంధ ఉన్నప్పటికీ ఎక్కడ కడుపు లేకుండా తన ఆలోచన విధానాలను నిర్భయంగా తెలియజేసేవారు. ప్రస్తుత ఆర్థిక రాజకీయ వ్యవస్థ మొత్తం సామాజిక కులవ్యవస్థ తో ముడిపడి పోవడంతో మేధావులు కూడా పెద్దగా సమాజం పట్ల ఆలోచన చేయకుండా ఉంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. సామాజిక మేధావులు, సోక్రటీస్‌, ‌కారల్‌ ‌మార్కస్, ఎం‌గిల్స్, ‌మావో, ఏరా లోటస్‌, ‌లింకన్‌, అం‌బేద్కర్‌, ‌గాంధీ, గౌతమ బుద్ధుడు, సామాజిక మేధావులు తన ఆలోచనా విధానాలను సమాజానికి దోహదపడే విధంగా వ్యవహరించేవారు. కానీ నేడు మేధావుల ఆలోచనా విధానాలు కేవలం కాగితాలకే పరిమితం కావడం ఆచరణలో చూపకపోవడం వల్ల ఇందుకు తగినట్టుగా ప్రభుత్వాలు నిర్బంధ కాండను కొనసాగించడం మేధావులు భయపడుతున్నారు.
ప్రభుత్వ పథకాల అమలు పైన స్పందించే విధానం కొంత ఆశాజనకంగా కనపడుతున్నది. ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. నెలనెలా పెన్షన్లు ఇస్తున్నది కదా! అని అన్నప్పుడు అది ఏమి వారిని జేబు నుండి ఇవ్వడం లేదు. ప్రజల నుండి వసూలు చేసిన పన్నులు ప్రజల సంపదనే ప్రభుత్వాలు వాళ్ల పేరు తోని పథకాలు గా ప్రచారం చేసుకుంటున్నాయి. అని గ్రామీణ ప్రాంత ప్రజలు జర్నలిస్టుల ప్రశ్నలకు, సామాజిక మాధ్యమాలలో తమ అభిప్రాయాలను జవాబుల రూపంలో కుండ బద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.
మేధావులు ఆలోచించాలి!!
పల్లెల్లో గ్రామాలలో, గ్రామీణ ప్రాంతంలో కాయకష్టం చేసుకుని బ్రతికే వాళ్ళు శ్రమను నమ్ముకొని జీవించేవాళ్ళు మాట్లాడే మాటల్లో స్పష్టత స్వచ్ఛత ఉంటుంది అనే విషయాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలతో మాట్లాడితే కానీ తెలియదు. నిరక్షరాస్యులైన శ్రామికులు ,రైతులు వాళ్ల శ్రమను నమ్ముకుని బతకడమే కాకుండా ప్రభుత్వ విధానాలను కూడా ప్రశ్నిస్తున్నారు. నిలదీస్తున్నారు. తమ హక్కులకు భంగం జరిగినప్పుడు ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయనప్పుడు ఇదేమి వాళ్ల జేబు నుంచి ఇస్తున్నారా! అని ఎగతాళి కూడా చేస్తున్నారు. ఈ చైతన్యమే చాలా అవసరం.
గమ్మత్తయిన విషయం ఏమిటంటే తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ అవసరాన్ని ఆంధ్ర తెలంగాణ ప్రాంతం లోపల ప్రజానీకంతో మెప్పించి ఒప్పించ చడానికి తెలంగాణ కు చెందిన అనేక మంది మేధావులు ప్రయత్నించారు. కృషి చేశారు. అందులో వేరే వాదనకు తావేలేదు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ప్రముఖ మైనటువంటి అలాంటి మేధావులు, కవులు, రచయితలకు ప్రభుత్వం నామినేటెడ్‌ ‌పోస్టుల ద్వారా ఉపాధి కల్పించి వారి గొంతు నొక్కేసింది.ఈ విధానం దేశవ్యాప్తంగా ను ఆంధ్రప్రదేశ్లోనూ ఉన్నట్లే తెలంగాణ రాష్ట్రం లో మరీ ముఖ్యంగా రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మేధావులు మౌనం వహించి చోద్యం చూస్తున్నారు. సామాన్య ప్రజానీకం ఆక్రందన, ఆవేదన, ఆరాటము పట్ల ఏనాడు కూడా ప్రతిస్పందించిన దాఖలా లేదు. తెలంగాణ వచ్చిన సంతోషం కంటే తెలంగాణ మేధావులు మౌనం వహించడమే నేడు మరింత ప్రమాదకరంగా మారిపోయింది.
ప్రజా వ్యతిరేక విధానాలు, కళ్ళ ముందు కొనసాగుతున్న ,నిర్బంధాలు నియంత్రణ, పౌర స్వేచ్ఛ ను కట్టడి చేస్తున్న, సామాన్య కార్యక్రమాలకు సభలు సమావేశాలు కూడా అనుమతించక  అడ్డుకుంటున్న, సామాజిక రుగ్మతలు గతంలో కంటే  సమాజాన్ని పట్టి పీడిస్తున్నా, అకృత్యాలు అత్యాచారాలు హత్యలు నిరంతరము కొనసాగుతున్నా వాటిపై ప్రతిస్పందించిన సందర్భమే లేదు.

ఆంధ్ర పాలకుల యొక్క విధానాలపైనా వేలాది ప్రదర్శనలు ఇచ్చిన కళాకారులు కూడా నేడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పైన స్పందించకపోతే ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం మాత్రమే పరిమితం కావడం అత్యంత బాధాకరం. అనేక మంది జర్నలిస్టులు, సంపాదకులు, కవులు గతంలో విప్లవోద్యమంలో పని చేసినటువంటి బుద్ధిజీవులు, విశ్వవిద్యాలయ ఆచార్యులు కూడా ప్రస్తుతం ఏదో ఒక పదవిలో ఉన్న కారణంగా నోరు మెదపడం లేదు. తప్పును తప్పు అని అనడం లేదు. సామాన్యుల బాధలకు స్పందించింది  లేదు. సగటు వ్యక్తికి భరోసా అందించినది లేదు.

ఎందుకిలా జరుగుతుంది!
ధూమ్‌ ‌ధామ్‌ ‌లాంటి కార్యక్రమాల్లో గ్రామీణ సంస్కృతి సంప్రదాయాలు, ధ్వంసమైన విధానాన్ని ,సినిమా టీవీల మాయాజాలాన్ని, నీళ్లు నిధులు నియామకాలు ఆత్మ గౌరవం విషయంలో తెలంగాణ తాకట్టు పెట్టబడిన విధానం అని ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ పాటలు మాటల ద్వారా ప్రచారం చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే అంశాలలో ఏమాత్రం కూడా మార్పు రాకపోవడం విడ్డూరమే కాదు. ఈ మేధావులకు కనపడటం లేదా?
స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో నిరసన తెలిపే హక్కు లేదు. అశ్లీల సినీ సాహిత్యం ఏ దిశగా కొనసాగుతున్నది? ప్రకృతి గుట్టల విధ్వంసం రెట్టింపు అయినది. ఉద్యమ కాలంలో తెలంగాణ ముద్దుబిడ్డలుగా  సేవలందించినటువంటి వేలాది మంది నాయకులు కార్యకర్తలు ప్రభుత్వం వెలుపల అనాధలుగా మిగిలిపోయారు. ఉద్యమకాలంలో బలిదానాలకు పాల్పడిన 1200 మందికి పైగా అమరవీరుల ను గుర్తించి ఆదుకున్నది లేదు.ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ ఎన్వి రమణ గారు ప్రభుత్వ నేతలకు గుడ్డిగా మద్దతు పలికిన టువంటి పౌర, పోలీసు అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని చేసిన హెచ్చరిక ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో బుద్ధిజీవులు మేధావులకు కూడా వర్తిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ విధానాలను గుడ్డిగా సమర్థించి కష్టజీవికి ఇరువైపులా ఉండవలసిన టువంటి కవులు రచయితలు మేధావులు ప్రభుత్వానికి దాసోహం అయితే ప్రజలు నష్టపోతున్నారు. కావచ్చు కానీ గుడ్డిగా సమర్థించిన వారికి భవిష్యత్తులో ప్రశ్నలు, సవాళ్లు తప్పవు.
నిరక్షరాస్యులు, సామాన్య మధ్యతరగతి వ్యక్తులు, కూలీలు కార్మికులు తమ హక్కుల రక్షణ కోసం ప్రభుత్వ విధానాలపైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్న నేటి కాలంలో మేధావులు, కవులు, కళాకారులు అని గొప్పగా పేరు చెప్పుకునే బుద్ధిజీవులు తమ సామాజిక బాధ్యతను ప్రజల పక్షాన నిర్వహించకపోవడం నేరమే అవుతుంది.
కారణం ఏమిటంటే పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కంటే పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోగా ఉమ్మడి రాష్ట్రంలో కంటే కూడా అనేక విషయాలలో ఇబ్బందులు ఎదురవుతూ లక్ష్యాలను చేరుకోలేక పోతే ఆ అపజయానికి ప్రభుత్వం ఎంత బాధ్యత వహించాలో అంతకంటే ఎక్కువ బాధ్యత మేధావులు కవులు కళాకారులపై ఉంటుంది.
మేధావులు తెలియక కాదు. కానీ ఏదో ఒక చోట మెత్తబడి రాజీపడి తమ అభ్యుదయ మార్గము నుండి తప్పుకున్న కారణంగా ప్రజలకు ఈ దుస్థితి దాపురించింది. ప్రజలను వెన్నంటి ఉండవలసిన మేధావులు ప్రజా వ్యతిరేకులుగా మారి ప్రభుత్వానికి మద్దతు పలకడం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.స్వతంత్ర విధానంతో, నిష్పాక్షిక ఆలోచనతో, శాస్త్రీయ వైఖరులను కలిగి సమసమాజం ఏర్పాటు కోరుతూ మరింత ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశించే మేధావులు తమ బాధ్యతను విస్మరించడం కొత్తేమీ కాదు. కానీ వివక్షత ముసుగులో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి రుగ్మత కొనసాగడం ఆందోళనకరం.
మేధావులకు విజ్ఞప్తి:-మా కష్టసుఖాలలో వెన్నంటి, మా జీవితాలకు భరోసా ఇచ్చి, మా కళ్ళల్లో వెలుగులు చూడాలని ఆశపడే ఓ మేధావు లారా! తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత మీ బాధ్యత ఎందుకు మరిచి పోయినారు? గుడ్డిగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం ద్వారా మాకు జరుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు. ప్రజల పక్షాన ఉండవలసిన మీరు బలమైన శక్తి అయినటువంటి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లో ఏం ఆశిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. దయచేసి మా విజ్ఞప్తిని మన్నించండి. మా కళ్ళల్లో కన్నీరు చూసి అయినా మా బతుకుల్లో మార్పు కోరండి. మాకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగ
ట్టండి. మా ప్రశ్నలకు బలాన్నిచ్చే నిరసనలకు ఆలోచన నిచ్చి మా ఆకాంక్షలకు ఊపిరి పొయ్యండి. మా విజ్ఞప్తిని మన్నించకపోతే దిక్కు మొక్కు లేని అనాధలు గా మారి పోతాము కావచ్చు!!! కానీ మీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మేధావుల ఉనికికే ప్రమాదం ఏర్పడడం వాంఛనీయం కాదు. ప్రపంచము నివ్వెరపోయేలా జరగాల్సిన పరిపాలనలో మేధావుల మౌనం అత్యంత విషాదకరం. విచారకరంగమ్యానికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్న మీరు ఇలాగే కొనసాగితే ఈ సమాజాన్ని ప్రజల జీవిత నావను ఒడ్డుకు చేర్చలేరు. కాబట్టి మీ గమన దిశ ను గమ్యాన్ని పునర్‌ ‌నిర్వచించుకోండి. వచ్చీరాని చదువులతో కాయకష్టాన్ని నమ్ముకున్న సామాన్య ప్రజల మైన మేము మీ బాధ్యతలను గుర్తింప చేయకముందే మాకు బాసటగా నిలవండి మీ మౌనాన్ని వీడండి. ఒక్క మాటలో చెప్పాలంటే మేధావులు సమాజంలో లేకపోతే అభివృద్ధి పూర్తిగా ఖుషి కు పోయే ప్రమాదం లేకపోలేదు. కాబట్టి మేధావులందరూ కలిసికట్టుగా సామాజిక బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సమాజానికి ముఖ్యంగా వర్తమాన సమాజానికి ఎంతగానో దోహదపడుతుంది.
– డాక్టర్‌ . ‌రక్కిరెడ్డి ఆదిరెడ్డి
కాకతీయ విశ్వవిద్యాలయం

Leave a Reply