Take a fresh look at your lifestyle.

జాతీయ వాదం పేరుతో నిజాలు దాచలేరు

ఆదానీ గ్రూప్‌ ఆరోపణలను తిప్పికొట్టిన హిండెన్‌బర్గ్
‌న్యూదిల్లీ,జనవరి30: తమ నివేదికను భారతదేశంపై దాడిగా అదానీ గ్రూప్‌ ‌పేర్కొనడాన్ని సోమవారం హిండెన్‌బర్గ్ ‌తిరస్కరించింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని కప్పిపుచ్చలేమని తెలిపింది. హిండెన్‌ ‌బర్గ్ ‌నివేదికకు ప్రతిస్పందనగా ఆదివారం అదానీ గ్రూప్‌ 413 ‌పేజీల ప్రతిస్పందనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్‌ ‌ప్రతిస్పందనపై హిండెన్‌బర్గ్ ‌ఘాటుగా స్పందించింది.  కీలకమైన విషయాల నుంచి దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తున్న  అదానీ గ్రూప్‌.. ‌జాతీయవాద అంశాన్ని లేవనెత్తుతోందని,  భారత్‌పై దాడి చేసేందుకే తమ  నివేదిక అన్నట్లు ప్రచారం చేస్తోందని పేర్కొంది.

ఈ ప్రచారాన్ని తాము ఖండిస్తున్నట్లు పేర్కొంది. .భారత్‌ ‌శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమని, ఉత్తేజకరమైన భవిష్యత్తుతో అభివృద్ధి చెందుతున్న సూపర్‌పవర్‌ అని తాము విశ్వసిస్తున్నామని పేర్కొంది. అటువంటి దేశాన్ని అదానీ సంస్థ క్రమపద్ధతిలో దోచుకుంటూ జాతీయ వాదం పేరుతో భారతదేశ భవిష్యత్తును అడ్డుకుంటున్నదన్నది కూడా కాదనలేని సత్యమని తాము నమ్ముతున్నామని  పేర్కొంది. కొన్ని దశాబ్దాలుగా అదానీ సంస్థ స్టాక్‌ ‌మానిప్యులేషన్‌, అకౌంట్‌లలో మోసాలకు ప్పాడుతోందని గతంలో తామ ఇచ్చిన నివేదికకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.

అదానీ సెక్యూరిటీలు, విదేశీ మారకపు చట్టాల ఉల్లంఘనకు పాల్పడ్డారని పేర్కొంది. ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తి  మోసం చేసినప్పటికీ  మోసంగానే పరిగణిస్తామని తెలిపింది. అదానీ సంస్థ విడుదల చేసిన 413 పేజీల ప్రతిస్పందనలో తమ నివేదికపై కేవలం 30 పేజీల్లో స్పందించిందని పేర్కొంది. మిగిలిన 330 పేజీల్లో కోర్టు రికార్డులు, వాటిలో 53 పేజీల్లో ఆర్థిక సమాచారం, మహిళా వ్యవస్థాపకత, సురక్షితమైన కూరగాయల ఉత్పత్తిని ఎలా ప్రోత్సహిస్తుందన్న అసంబద్ధమైన కార్పోరేట్‌ ‌కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయని తెలిపింది. తమ నివేదికలో అదానీ గ్రూప్‌పై 88 నిర్థిష్ట ప్రశ్నలు సంధించగా, వాటిలో 62 ప్రశ్నలకు సమాధానమివ్వలేదని  పేర్కొంది.

Leave a Reply