Take a fresh look at your lifestyle.

వ్యతిరేక సర్వేలతో ప్రత్యర్ధులపై ట్రంప్‌ అసహనం

అమెరికా అధ్యక్ష పదవికి వొచ్చే నెల 3వ తేదీన జరగనున్న ఎన్నికలో ఈసారి డెమోక్రాటిక్‌ ‌పార్టీ అభ్యర్ధి బైడేన్‌ ‌కే ఎక్కువ విజయావకాశాలున్నాయని సర్వేల ఫలితాలు వెలువడుతుండటంతో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్‌ ‌పార్టీ అభ్యర్ది డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌సహనాన్ని కోల్పోతున్నారు. ప్రత్యర్ధులపై నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. బైడేన్‌ ‌నెగ్గితే లాబీయిస్టులు, విదేశీ పెట్టుబడిదారుల ప్రభావం పెరుగుతుందని దేశాన్ని ఆయన దోచి పెట్టేస్తారని శాపనార్ధాలు పెడుతున్నారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకేనన్న నినాదంతో ఆయన మళ్ళీ బరిలోకి దిగారు. నాల్గేళ్ళ క్రితం ఇదే నినాదంతో ఆయన ఒరగబెట్టిందేమీ లేదన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ట్రంప్‌ ‌తీసుకున్న నిర్ణయాలన్నీ బెడిసి కొట్టి అమెరికన్లకు చేటు తెస్తున్నాయి. తాజాగా , హెచ్‌ -1 ‌బీ వీసా నిబంధనలను కఠిన తరం చేయడం వల్ల అమెరికా ప్రయోజనాలకే చేటు అని దేశంలో మేధావి వర్గం హెచ్చరించింది.అయినా ఆయన లెక్క చేయడం లేదు.

హెచ్‌ -1 ‌బీ వీసాలను కఠినతరం చేయడం వల్ల భారత ఐటి కంపెనీలకు నష్టం వాటిల్లుతుంది. అదే సందర్భంలో చైనా ఐటి ఉద్యోగులకు కూడా హాని జరుగుతుంది. చైనాను దృష్టిలో ఉంచుకుని ఆయన తీసుకున్న నిర్ణయం మన ఐటీ నిపుణులకు కూడా హాని చేస్తుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రవాస భారతీయుల వోట్లే కీలకం. ప్రవాస భారతీయులు తరతరాలుగా అమెరికా అభివృద్దిలో భాగస్వాములవుతున్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌ ‌స్వయంగా గత ఏడాది మన ప్రధాని మోడీ టెక్సాస్‌ ‌సందర్శించిన సందర్భంగా జరిగిన హౌడీ-మోడీ ర్యాలీలో అంగీకరించారు. ప్రవాస భారతీయులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందనీ , మళ్ళీ అధికారంలోకి వొచ్చినప్పుడు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తామని ఆ ర్యాలీలో మోడీ సమక్షంలో ప్రకటించారు. దాంతో మోడీ కూడా పొంగి పోయారు. ట్రంప్‌ ‌కోరినట్టుగా అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అమెరికాతో రక్షణ రంగంలో భాగస్వామ్య ఒప్పందం ఈ తరహా చేసుకున్నదే. దీని వల్ల ఎన్నో నష్టాలున్నాయి. రక్షణ రంగంలో భాగస్వామ్యం వల్ల అమెరికా నిర్వహించే విన్యాసాలన్నింటిలో మన సేనలు పాల్గొనాల్సి వొస్తుంది.అంతేకాక, చైనాకు మన దేశంపై గుర్రు పెరగడానికి ఇదే ప్రధాన కారణం. ట్రంప్‌ ‌మోడీని ఆకాశానికి ఎత్తేస్తూనే, భారతీయ ఐటి నిపుణులు,ఇతర ఉద్యోగులకు హాని చేసే నిర్ణయాలను తీసుకున్నారు.

అందువల్ల ప్రవాస భారతీయులు ఈసారి ట్రంప్‌ ‌కి వ్యతిరేకంగా వోటు వేయవచ్చని సర్వేలు తెలుపుతున్నాయి.అంతేకాకుండా కొరోనా తీవ్రతను గుర్తించకుండా , ముందు జాగ్రత్తల గురించి ప్రచారం జరిపించకుండా నిర్లక్ష్యం వహించడం వల్లనే కొరోనా మరణాలు పెరిగాయని ట్రంప్‌ ‌పై అమెరికా అంటువ్యాధుల చికిత్సా నిపుణుడు ఫౌచీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అలా చేసినందుకు ఆయనను ట్రంప్‌ ‌తీవ్రమైన దుర్భాషలాడారు. ఫౌచీ సలహాలను పాటించి ఉంటే అమెరికాలో కోరనా మరణాలు ఆరు లక్షలకు పెరిగి ఉండేవంటూ ఎద్దేవా చేశారు. కొరోనా నియంత్రణలో ట్రంప్‌ ‌విఫలమైనారన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. జనవరి వరకూ ట్రంప్‌ ‌కి అనుకూలంగా ఉన్న గాలి ఒక్కసారిగా మారడానికి కొరోనా నియంత్రణ విషయంలో ఆయన ప్రదర్శించిన నిర్లక్ష్యమే. చివరికి తాను, తన భార్య కొరోనా బారిన పడిన తర్వాత కూడా వైరస్‌ ‌ను సీరియస్‌ ‌గా తీసుకోకుండా ట్రంప్‌ ‌పేల్చిన జోక్‌ ‌లు జనంలో వెగటు పుట్టించాయి. ట్రంప్‌ అధికారం చేపడుతూనే ఏడు ముస్లిం దేశాల పౌరుల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు ప్రకటించారు.దానిపై గగ్గోలు పెరగడంతో ఆరు ముస్లిం దేశాలపై నిషేధం అంటూ జీవో సవరించారు. దానిపై జరిపిన న్యాయపోరాటోంలోనూ ట్రంప్‌ ‌కు ఎదురు దెబ్బలు తగిలాయి.

చివరికి కోర్టు సూచించిన సవరణలను అమలులో పెట్టారు. చైనా తో వాణిజ్య యుద్ధం వరకూ వెళ్ళి వెనక్కి తగ్గారు.దీని ప్రభావం ఇతర దేశాలతో కూడా వాణిజ్య సంబంధాలపై కూడా పడింది. మన దేశాన్ని పొగడ్తలతో ముంచెత్తుతూనే వాణిజ్య రంగంలో మన దేశానికి ప్రాధాన్యతను తగ్గించిన ఘనత ట్రంప్‌ ‌దే. ఇప్పుడు ఎన్నికల సమయంలో కొన్ని పోస్టులకు ప్రవాస భారతీయులను ఎంపిక చేసినప్పటికీ, ట్రంప్‌ ‌తీసుకున్న నిర్ణయాల్లో అత్యధికం మనకు చేటు తెచ్చేవే. ముఖ్యంగా, ఇన్ఫర్మేషన్‌ ‌టెక్నాలజీ రంగంలో భారతీయ నిపుణులకు అమెరికా లో ఇతర దేశాల వారి కన్నా ఎక్కువగా ఉంది. అమెరికాలోని సిలికాన్‌ ‌లో ఐటి పరిశ్రమల్లో పని చేసే నిపుణుల్లో అత్యధికులు భారతీయులే. వారిలోనూ తెలుగువారు ఎక్కువ మంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు పూర్వపు అధ్యక్షుడు ఒబామా తెచ్చిన వర్క్ ‌పర్మిట్‌ ‌లపై కూడా ట్రంప్‌ ‌వేటు వేశారు. ఇది కూడా ప్రవాస భారతీయుల్లో అసంతృప్తిని రేపింది. అంతేకాకుండా, డెమోక్రాటిక్‌ ‌పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న కమలా హ్యారీస్‌ ‌ప్రవాస భారతీయురాలు కావడంతో సహజంగానే ఆమె పట్ల,ఆమె ద్వారా డెమోక్రాటిక్‌ ‌పార్టీ పట్ల ఎన్నారైలు మొగ్గు చూపుతున్నారు.దీనిని కూడా ట్రంప్‌ ‌సహించలేకపోతున్నారు. కమలా హ్యారీస్‌ ‌పై వ్యక్తిగతంగా విమర్శలు,ఆరోపణలు చేశారు. దాని వల్ల కూడా ప్రవాస భారతీయుల్లో ట్రంప్‌ ‌పట్ల వ్యతిరేకత పెరిగింది. ఈసారి తాను నెగ్గడం కష్టమని తెలియడంతో ట్రంప్‌ ‌వీరంగం చేస్తున్నారు.

Leave a Reply