Take a fresh look at your lifestyle.

రాజకీయ ప్రయోజనానికే ట్రంప్‌ ‌పర్యటన

“అయినా ట్రంప్‌ ‌మాత్రం ఓ వైపు ఉగ్రవాదం అణిచివేతకు భారత్‌తో కలిసి పనిచేస్తామని చెబుతూనే  మోడీ సమక్షంలో భారత్‌-‌పాకిస్థాన్‌ ‌రెండు దేశాలతోనూ అమెరికాకు సత్ససంబంధాలను నెరుపుతుందని మోహమాటం లేకుండా చెప్పారు. కాశ్మీర్‌ ‌విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధం అని చెప్పటం కూడా మనకు ప్రతికూల వైఖరే. భారత్‌-‌పాకిస్థాన్‌ ‌రెండూ సమాన మిత్రదేశాలే అయితే ఇంత ఆర్భాట కార్యక్రమాలు, పర్యటనలు, ప్రకటనల వల్ల మనం సాధించింది ఏముంది ప్రత్యేకంగా? మతతత్వ వైఖరితో ఉండే దాయాది దేశాన్ని మనల్ని ఒకే గాటన కట్టేసిన తర్వాత మోడీ అంటే చాలా ఇష్టం అన్న ట్రంప్‌ ‌వ్యాఖ్యని ఏ రకంగా అర్థం చేసుకోవాలో మనమే తేల్చుకోవలసి ఉంటుంది.”

Trump's campaign for political gain

అగ్రరాజ్య అధినేత రెండు రోజుల భారత పర్యటన జనరంజకంగా ముగిసింది. సతీసమేతంగా విచ్చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఘనంగా స్వాగతం పలికి ప్రసన్నం చేశారు. ఈ పర్యటనకు ట్రంప్‌ ‌కుమార్తె ఇవాంకా, అల్లుడు క్రూషర్‌ ‌కూడా హాజరైనా ఇద్దరూ అధ్యక్షుడి కుటుంబ సభ్యుల హోదాలో కాకుండా సీనియర్‌ ‌సలహాదారుల హోదాలో విచ్చేశారు. ఏరకంగా వచ్చినా ట్రంప్‌కు, ఆయన పరిహారానికి మన దేశం అద్భుత ఆతిథ్యం ఇచ్చిందనటంలో మరో మాటకు ఆస్కారం లేదు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలకు వ్యతిరేకంగా ఓ వైపు ఢిల్లీ గల్లీలు హింసతో అట్టుడికిపోతున్నా… అతిథికి ఎక్కడా ఆటంకం కలుగకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. గుజరాత్‌ ‌గడ్డపై మురికి వాడలు కనిపించకుండా గోడలు కట్టిన విషయాన్ని అంతర్జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రస్తావించినా ఇరు దేశాల అధినేతల మైత్రీ మరింత బలోపేతం కావటంలో ఇటువంటి విషయాలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. అమెరికాలో ‘హౌడీ మోడీ,’ ఇండియాలో ‘నమస్తే ట్రం•’• కార్యక్రమాలు ఆశించినస్థాయిలో ఘనవిజయం సాధించాయి. ఒక కార్యక్రమానికి ప్రజలు లేదా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో వచ్చారంటే ఆయా నాయకులకు ఉన్న ప్రజాకర్షణ అనే అర్థం చేసుకోవచ్చు. న్యూయార్క్ ‌టైమ్స్ ‌మాటల్లో చెప్పాలంటే ‘‘నమస్తే ట్రంప్‌’’ ‌సభను ‘‘హౌడీ మోదీ-2 ’’గా చెప్పవచ్చు. ఇది ట్రంప్‌కు నిస్సంకోచంగా, ఉల్లాసపరిచేందుకు సమర్పించిన ప్రశంస..ఈ పర్యటనను ఓ కీలక శిఖరాగ్ర సదస్సుగా కంటే, సీరియస్‌ అం‌శాల కంటే ఓ పీఆర్‌ ‌వ్యవహారంగా, ప్రజాకర్షకంగా మలచడానికి భారత్‌ ‌ప్రయత్నించింది.’’

మనకు ఒరిగింది ఏమిటి?
మన ప్రధాని అమెరికా వెళ్లినప్పుడు ట్రంప్‌ ఆత్మీయంగా స్వాగతం పలికారు. వాళ్లు వచ్చినప్పుడు మనం గొప్పగా ఆతిథ్యం ఇచ్చాం….శ్వేత సౌథ అధిపతి మనస్సు పులకించింది. బాగా ఉంది. కాని రెండు దేశాల మధ్య మైత్రి అంటే ఇది మాత్రమే కాదు. దీని వల్ల భారత దేశానికి ఒరిగేది ఏమిటి? అనేది ముఖ్యమైన ప్రశ్న. ఇది ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత వ్యవహారం కాదు. భారత దేశ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ప్రధాని మోడీ అంటే చాలా ఇష్టం అని ట్రంప్‌ ‌చేసిన వ్యాఖ్యలు పరిశీలించదగినవి. వాణిజ్య సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం కావల్సిన సందర్భంలో ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహబంధానికే పరిమితం అయితే ప్రయోజనం ఉండదు. మరో అడుగు ముందుకు వేసి కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం ఓట్ల రాజకీయం చేస్తే , వ్యక్తిగత ఇమేజ్‌ ‌పెంచుకునేందుకే పరిమితం అయితే మరింత నిరుత్సాహపడక తప్పదు. ట్రంప్‌ ‌తాజా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య రక్షణ రంగంలో 300 కోట్ల డాలర్ల మేర ఒప్పందం ఖరారైందని భారత ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌లు సంయుక్తంగా ప్రకటించారు. మన రక్షణ వ్యవస్థ మరింత మెరుగుపడితే అటు అమెరికా ఈ ఒప్పందం ద్వారా ఆర్థికంగా లబ్థిపొందుతుంది. పలు వాణిజ్య అంశాలకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు పురోగతి దశలో ఉన్నాయని, త్వరలోనే పెద్ద ఒప్పందం కుదురుతుందని ఢిల్లీలోని హైదరాబాద్‌ ‌హౌస్‌లో జరిగిన భేటీ అనంతరం వెల్లడించారు. ఈ పెద్ద ఒప్పందం అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత మాత్రమే ఉండే అవకాశం ఉందని భారత దేశ ప్రయాణానికి ఒక రోజు ముందు అక్కడి మీడియాతో ట్రంప్‌ ‌వ్యాఖ్యానించటాన్ని కూడా పరిగనలోకి తీసుకోవాలి. ఈ భేటీలో వారిద్దరి మధ్య రక్షణ, భద్రత, పెట్టుబడులు, వాణిజ్యానికి సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయి.

రక్షణరంగంలో ఒప్పందంతోపాటు రెండు దేశాలకు సంబంధిత విభాగాల మధ్య మానసిక వైద్యంపై సహకారం, వైద్య ఉత్పత్తులు, ఇంధన రంగంలో ఐఒసి, ఎక్సాన్‌మోబిల్‌ల మధ్య మూడు ఎంఓయులు కుదిరాయి. భారతదేశానికి చైనా తర్వాత రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికానే. ద్వైపాక్షిక వస్తువులు, సేవల వాణిజ్యం 2018లో 1,42,600 కోట్ల డాలర్లు. అయితే అమెరికా తన తొమ్మిదో అతిపెద్ద సరుకుల వాణిజ్య భాగస్వామి అయిన భారతదేశంతో 2019లో 23,200 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు చవిచూసింది. దీనితో అమెరికా అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రమే వర్తింపజేసే ‘జనరలైజ్డ్ ‌సిస్టమ్‌ ఆఫ్‌ ‌ప్రిఫరెన్స్ – ‌జీఎస్‌పీ’ కింద భారతదేశానికి అంతకుముందు ఇస్తూ వచ్చిన ప్రత్యేక హోదాను తొలగించింది. జీఎస్‌పీ హోదా ఉండటం వల్ల నిర్దిష్ట భారతీయ ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లోకి సుంకాలు లేకుండా ప్రవేశించేవి. కానీ భారత వాణిజ్య ప్రతిబంధకాలు తమ ఎగుమతుల మీద ప్రభావం చూపుతున్నాయని అమెరికా డెయిరీ, వైద్య పరికరాల రంగం ఫిర్యాదు చేయటంతో భారతదేశానికి జీపీఎస్‌ ‌ప్రయోజనాన్ని 2019 జూన్‌ 5‌న అమెరికా ఉపసంహరించింది. ఇది మన వాణిజ్యం పై కీలక ప్రభావం చూపింది. ఇరు దేశాల వాణిజ్య సంబంధాల్లో ఆటుపోటులు మొదలయ్యాయి. ట్రంప్‌ ‌ప్రభుత్వం భారతదేశం నుంచి ఉక్కు దిగుమతి మీద 25 శాతం సుంకం, అల్యూమినియం ఉత్పత్తుల మీద 10 శాతం సుంకం విధించింది. మన దేశం కూడా ఊరుకోలేదు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే 28 రకాల ఉత్పత్తుల మీద 2019 జూన్‌ 16 ‌నుంచి అమలయ్యేలా ప్రతీకార సుంకాలు విధించింది. దీనిపై భారతదేశం మీద అమెరికా ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)కు ఫిర్యాదు కూడా చేసింది.

రాజకీయ రంగు..
ఇరు దేశాల అధినేతలకు వారి రాజకీయ అవసరాలు వారికి ఉన్నాయి. ఈ నవంబర్‌లో జరుగనున్నఅధ్యక్ష ఎన్నికల్లో గెలిచి మరోసారి శ్వేతసౌధ అధిపతి కావాలనుకుంటున్న ట్రంప్‌కు భారత్‌ ‌పర్యటన కీలకమైంది. అమెరికాలో ఉంటున్న భారతీయ ఓట్‌ ‌బ్యాంకు ఆయనకు ఎన్నికల్లో అవసరం. ఒకసారి అమెరికా గత ఎన్నికల ఓటు సరళి గమనిస్తే ప్రవాస భారతీయులందరూ డెమొక్రాట్లకే అండగా నిలిచారు. ఒక సర్వే ప్రకారం డెమొక్రటిక్‌ ‌పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 84 శాతం మంది భారతీయ ఓటర్లు మద్దతు పలికితే ట్రంప్‌ ‌ఖాతాలో ఈ క్యాటగిరి నుంచి కేవలం 16 శాతం ఓట్లే పడ్డాయి. ఈ లెక్కల్లో మార్పు రావాలంటే ఎన్‌ఆర్‌ఐ ఓటర్లను తన వైపుకు తిప్పుకోవాల్సిన పరిస్థితి ట్రంప్‌కు ఉంది. ఈ విషయాన్ని బీబీసీ కూడా ప్రస్తావించింది.‘‘అమెరికాలో ఉన్న లక్షలాది మంది భారతీయ అమెరికన్‌ ఓటర్లలో సింహభాగం సాధారణంగా  డెమొక్రాట్ల వైపు మొగ్గుతారు. ట్రంప్‌కు వచ్చిన ఓట్లు 16 శాతమే. మోదీతో చెట్టపట్టాల్‌ ‌వేసుకుని మసలడం ద్వారా ట్రంప్‌ ‌భారతీయుల మనసుల్ని గెలవాలనుకుంటున్నారు.’’ అని బీబీసీ ట్రంప్‌ ‌పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించింది. ఎన్నికల వేళ విదేశీ సంబంధాల్లో తాను ఎంత బలమైన నేతో అమెరికా ఓటర్లకు చెప్పుకోవటం కూడా ఒక ఎన్నికల వ్యూహంలో భాగమే. ఇటు మన దేశ కోణంలో చూసినా వ్యక్తిగత ఇమేజ్‌ను మరింత పెంచుకునేందుకు ట్రంప్‌ ‌పర్యటన దోహదపడుతుంది అనటంతో సందేహం లేదు. ఇక్కడ మరో అంశం కూడా గమనించాలి. అహ్మదాబాద్‌లోని గాంధీ ఆశయాలకు నిలువెత్తుగా సాక్ష్యంగా పరిగణించే సబర్మతి ఆశ్రమానికి మోదీ వెంట ట్రంప్‌ ‌బృందం వెళ్లింది. అక్కడ గాంధీ చరఖాను, నూలు వడికే విధానాన్ని,  గాంధీ సిద్ధాంతానికి ఉజ్జాయింపుగా భావించే మూడుకోతుల బొమ్మల గురించి మోడీ ద్వారా విని తెలుసుకున్నారు. ఫోటోలు దిగారు. కాని విజిటర్స్ ‌బుక్‌లో మహాత్ముడి గురించి ట్రంప్‌ ‌కనీసం ప్రస్తావించకపోవటం నేతల వైఖరిలో ఉన్న చిత్తశుద్ధిని ఎత్తి చూపుతుంది.

తెల్లగా ఉన్నవన్ని పాలు కాదు..
ఇల్లలుకగానే పండుగ కాదన్నట్లు పొగడ్తలతో ముంచెత్తినంత మాత్రాన అమెరికా నమ్మదగిన భాగస్వామి అని సంబరపడటానికి లేదు. ఈ విషయం ట్రంప్‌ ‌తన పర్యటన సందర్భంగా మన గడ్డ పైనే స్పష్టం  చేశారు. మాటలు కోటలు దాటిన తీరు చూస్తే ఉగ్రవాదం విషయంలో అమెరికా మన దేశానికి మరో ఆలోచన లేకుండా మద్దతుగా నిలబడాలి. పాకిస్థాన్‌ ఏ ‌విధంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో, మన దేశ సరిహద్దుల్లో ఆ దేశ సైన్యం ఏ రకంగా కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో, జమ్ము-కాశ్మీర్‌ను ఆరని కుంపటిగా ఏ రకంగా మారుస్తుందో అగ్రరాజ్యానికి తెలియంది కాదు. తాజాగా పుల్వామా దాడి కళ్ళ ముందు ఉన్న సాక్ష్యం. కాశ్మీరీ యువకుడికి తమ గడ్డపై శిక్షణ ఇచ్చి.. మానవబాంబుగా మన జవాన్ల మీదే ఏ రకంగా దాడికి ప్రయోగించిందో ప్రపంచం అంతా చూసింది. అయినా ట్రంప్‌ ‌మాత్రం ఓ వైపు ఉగ్రవాదం అణిచివేతకు భారత్‌తో కలిసి పనిచేస్తామని చెబుతూనే  మోడీ సమక్షంలో భారత్‌-‌పాకిస్థాన్‌ ‌రెండు దేశాలతోనూ అమెరికాకు సత్ససంబంధాలను నెరుపుతుందని మోహమాటం లేకుండా చెప్పారు. కాశ్మీర్‌ ‌విషయంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధం అని చెప్పటం కూడా మనకు ప్రతికూల వైఖరే. భారత్‌-‌పాకిస్థాన్‌ ‌రెండూ సమాన మిత్రదేశాలే అయితే ఇంత ఆర్భాట కార్యక్రమాలు, పర్యటనలు, ప్రకటనల వల్ల మనం సాధించింది ఏముంది ప్రత్యేకంగా? మతతత్వ వైఖరితో ఉండే దాయాది దేశాన్ని మనల్ని ఒకే గాటన కట్టేసిన తర్వాత మోడీ అంటే చాలా ఇష్టం అన్న ట్రంప్‌ ‌వ్యాఖ్యని ఏ రకంగా అర్థం చేసుకోవాలో మనమే తేల్చుకోవలసి ఉంటుంది.

rehana

Leave a Reply