Take a fresh look at your lifestyle.

ట్రంప్‌ ‌పర్యటన వ్యూహాత్మకం!

“సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారత పర్యటన గుజరాత్‌లోని పేదలకు కష్టాలు తెచ్చింది. అగ్రరాజ్య అధినేత తమ దేశంలో.. సరిగ్గా చెప్పాలంటే ఆయన ప్రయాణించే మార్గంలో ఎక్కడా పేదరిక ఆనవాళ్ళు కనిపించకూడదని కొంత మంది నేతలు ఆరాటపడతారు. దాని కోసం గోడలైనా కడతారు లేదా ఉన్నపళంగా ఇళ్ళను వదిలి వెళ్లాల్సిందిగా మురికివాడల్లో బతుకీడుస్తున్న వారిపై హూంకారం అయినా చేస్తారు.”

Trump's action is strategic!

అమెరికా అంటే మనకు స్వర్గధామం. ఆ దేశానికి రెక్కలు కట్టుకుని వాలిపోవాలని కలలు కనే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. చదువో, ఉద్యోగమో…ఏదో ఒకటి కేరాఫ్‌ అ‌డ్రస్‌ అమెరికా అయితే చాలు అనుకుంటారు చాలా మంది. ఈ భావజాలం సాధారణ జనంలోనే కాదు నేతల్లోనూ ఉంటుంది. అగ్రరాజ్య అధినేత కటాక్షం కోసం అర్రున చాచని నేతలెవరు? అటువంటి ఆ పెద్ద నేతే స్వయంగా మన దేశానికి వస్తుంటే…మంచీ, మర్యాద కోసం ఎన్ని పాట్లు పడటానికి అయినా సిద్ధంగానే ఉంటారు. ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయలు కుమ్మరించటానికి వెనుకాడరు. ఇంత హంగామా జరుగుతుంటే మీడియా మాత్రం మౌనంగా ఉంటుందా? కథనాల మీద కథనాలు కుమ్మరిస్తూనే ఉంటుంది. ప్రజలకు ఉండే ఆసక్తి అటువంటిది. గొప్ప ఆతిథ్యం ఇవ్వటానికి, తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేసుకోవటానికి ప్రయత్నించడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే కంటెంట్‌ ‌కంటే కటౌట్‌ ‌పెద్దగా ఉంటేనే విమర్శలు వస్తాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌తన భార్య మెలానియాతో కలిసి ఈ నెల 24, 25 తేదీల్లో మనదేశంలో పర్యటించనున్నారు. అమెరికా శ్వేత సౌధ అధిపతి అయిన తర్వాత ట్రంప్‌ ‌చేస్తున్న మొదటి భారత పర్యటన ఇది. 24వ తేదీన గుజరాత్‌ ‌గడ్డ పై కాలు పెట్టగానే ప్రధాని మోడీతో కలిసి ఆర్భాటంగా రోడ్‌ ‌షో జరుగుతుంది. ఈ రోడ్‌ ‌షో దాదాపు 22 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. సుమారు 50 నుంచి 70 లక్షల సాంప్రదాయ వస్త్ర ధారణతో రోడ్డుకు ఇరువైపులా నిలబడి మోడీ-ట్రంప్‌ ‌లకు స్వాగతం చెబుతారట. అలా ఘన స్వాగతాన్ని ఆస్వాదిస్తూ ట్రంప్‌-‌మోడీలు సబర్మతీ ఆశ్రమం చేరుకుంటారు. అక్కడ కాసేపు గడిపిన తర్వాత ఇద్దరూ కలసి మొతెరా క్రికెట్‌ ‌స్టేడియానికి చేరుకుంటారు. మొతెరాలో నిర్మించిన అతి పెద్ద క్రికెట్‌ ‌స్టేడియంను మోడీ-ట్రంప్‌ ‌ప్రారంభిస్తారు.

అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొనడంతో ప్రధాన ఘట్టం ముగుస్తుంది. ఆ రాష్ట్రంలో ఆయన పర్యటన కేవలం మూడు గంటలు మాత్రమే ఉండవచ్చు అన్నది మీడియా కథనాలు. దీని కోసం గుజరాత్‌ ‌ప్రభుత్వం 80 నుంచి 85 కోట్లు వెచ్చిస్తోందట. మన ప్రధాని నరేంద్ర మోడీ గత అమెరికా పర్యటనలో హ్యూస్టన్‌లో ‘‘హౌడీ మోడీ’’ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. హౌడీ అంటే ఎలా ఉన్నారని అమెరికా బాగా వాడుకలో ఉన్న పదానికి అర్థం. ఇప్పుడు ట్రంప్‌ ‌పర్యటనకు కూడా ‘‘కెంచో ట్రంప్‌’’ అని పేరు పెట్టారు. గుజరాతీ భాషలో కెంచో అంటే ఎలా ఉన్నారని అర్థం. తీరా పేరు పెట్టిన తర్వాత ఒక అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి ఒక రాష్ట్ర కార్యక్రమంగా పరిమితం చేసినట్లు అవుతుందన్న అభిప్రాయాలు రావటంతో …’’నమస్తే ప్రెసిడెంట్‌ ‌ట్రంప్‌’’ అని పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన వ్యక్తి కావటంతో భద్రతా పరంగా కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే. 25 మంది ఐపీఎస్‌ అధికారుల పర్యవేక్షణలో పదివేల మంది పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఇవ్వనున్నారు. రెండు రోజుల భారత పర్యటనలో ట్రంప్‌ ‌దంపతులు ప్రపంచ ప్రఖ్యాత ప్రేమ జ్ఞాపకం తాజ్‌మహల్‌ను కూడా సందర్శించే అవకాశాలున్నాయి. అందుకే ఆగ్రా కూడా ముస్తాబవుతోంది. ఢిల్లీలో మహాత్మా గాంధీ స్మారకం రాజ్‌ఘాట్‌ను సందర్శించిన తర్వాత హైదరాబాద్‌ ‌హౌస్‌లో ఇరువురు సమావేశం అవుతారు. తర్వాత సంయుక్త మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారు.

పేదరికంపై పరదాలు..
సుబ్బి పెళ్లి వెంకి చావుకు వచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌భారత పర్యటన గుజరాత్‌లోని పేదలకు కష్టాలు తెచ్చింది. అగ్రరాజ్య అధినేత తమ దేశంలో.. సరిగ్గా చెప్పాలంటే ఆయన ప్రయాణించే మార్గంలో ఎక్కడా పేదరిక ఆనవాళ్ళు కనిపించకూడదని కొంత మంది నేతలు ఆరాటపడతారు. దాని కోసం గోడలైనా కడతారు లేదా ఉన్నపళంగా ఇళ్ళను వదిలి వెళ్లాల్సిందిగా మురికివాడల్లో బతుకీడుస్తున్న వారిపై హూంకారం అయినా చేస్తారు. అహ్మదాబాద్‌లో మురికివాడలు కనిపించకుండా ఎత్తైన గోడలు కడుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గతంలోనూ ఇటువంటి అనుభవాలు మనకున్నాయి. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్‌ ‌క్లింటన్‌ ‌హైదరాబాద్‌ ‌వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇలానే క్లింటన్‌ ‌ప్రయాణం చేసే దారి వెంట రోడ్ల పై ఎక్కడా బిచ్చగాళ్లు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.వారందరిని షెల్టర్స్‌కు తరలించటంపై అప్పుడు కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతెందుకు మొన్నటికి మొన్న కూడా ట్రంప్‌ ‌కుమార్తె ఇవాంకా ట్రంప్‌ ‌హైదారాబాద్‌లో గ్లోబల్‌ ఎం‌టర్‌ ‌ప్రెన్యువర్‌షిప్‌ ‌సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చినప్పుడు కూడా కేసీఆర్‌ ఇదే పద్ధతిని అనుసరించారు. బెగ్గర్స్‌ను తరలించారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్ల విస్తరణ, ఆమె ప్రయాణించే మార్గమంతా సుందరంగా తీర్చి దిద్దటం వంటి చర్యలు తీసుకున్నారు.

ఇండో-అమెరికా సంబంధాలు- నీటి మీది రాతలు..
ట్రంప్‌ ‌పర్యటనకు సంబంధించి ఇంత హడావుడి జరుగుతున్నా…అగ్రరాజ్యం వాణిజ్య సంబంధాల్లో మనకు రెడ్‌ ‌కార్పెట్‌ ఏమీ పరవటం లేదు అన్నది గమనించాల్సిన అంశం.అయితే మరో రెండు మూడు రోజుల్లో భారతదేశానికి బ్యాగ్‌ ‌సర్దుకుంటూ ట్రంప్‌ అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన అంశాలు కీలకమైనవి. ఈ పర్యటనలో వాణిజ్య ఒప్పందాల గురించి మాట్లాడుతూ…భారత దేశంతో భారీ ఒప్పందాలు ఉంటాయని చెబుతూనే…అయితే ఎన్నికల తర్వాతే ఉండొచ్చు అనే సంకేతాలు ఇచ్చారు. అంతే కాదు మోడీని ఇష్టపడతాను కాని భారత దేశంతో వాణిజ్యం సంబంధాల పట్ల మాత్రం అసంతృప్తిగా ఉన్నాను అని కూడా ట్రంప్‌ ‌వ్యాఖ్యానించారు. భారత్‌కు రానున్న ట్రంప్‌బృందంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి లైట్‌ ‌హైజర్‌ ఉం‌డటం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ అనుమానాలే నిజమైతే ఈసారికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చాం అని చప్పట్లతో సరిపెట్టుకోవాల్సిందేనేమో. గత ఏడాది కూడా ఆ దేశం మనకు గట్టిగా షాక్‌ ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఆ దేశం ఇస్తూ వస్తున్న రాయితీలకు చెక్‌ ‌పెట్టింది. మన ఎగుమతులకు పన్ను మినహాయింపులు దొరికే అవకాశాలకు చెల్లు చీటీ పాడింది. మన వ్యవహార శైలి కూడా తక్కువగా ఏమీ లేదు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే స్టంట్‌లు వంటి వైద్య పరికరాలపై ఉన్న నిబంధనలు ఆ దేశానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. తాజా బడ్జెట్‌లో కూడా వైద్య పరికరాల దిగుమతుల పై సుంకాన్ని కేంద్రం మరింత పెంచింది. అటు అమెరికా కూడా స్టీలు, అల్యూమినియం దిగుమతులపై పన్నులు పెంచింది. ఈ టారిఫ్‌ ‌పెంపు మనకు చికాకు కలిగించేదే. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక కొత్తగా హెచ్‌-1‌బీ వీసాల జారీని కఠినతరం చేశారు. ఒక లెక్క ప్రకారం ఈ ఏడాది జనవరి నాటికి 2లక్షలకు పైగా వీసా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కాశ్మీర్‌ ‌విషయంలోనూ ట్రంప్‌ ‌కప్పదాట్లు వేస్తూ వచ్చారు.

భారత-పాకిస్థాన్‌ ‌దేశాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని కాసేపు, రెండు దేశాలు పరస్పరం పరిష్కరించుకోవాలని మరి కాసేపు మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. ట్రంప్‌ ‌భారత పర్యటన వెనుక అసలు వ్యూహం రాజకీయ కారణాలే అనుకోవచ్చు. ఈ ఏడాది అమెరికాకు ఎలక్షన్‌ ఇయర్‌. ‌కొత్త అధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అవుతోంది. ఈ జూలైలో డెమోక్రటిక్‌ ‌పార్టీ, ఆగష్ట్‌లో రిపబ్లిక్‌ ‌పార్టీ జాతీయ కన్వెన్షన్‌ ‌జరుగుతాయి. ఈ కన్వెన్షన్లలోనే తమ పార్టీ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులెవరో ఖరారు చేస్తారు. నవంబర్‌ 3‌న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అమెరికాలో ఉన్న భారతీయుల ఓట్లు కీలకం. ఆర్థికరంగంలోనూ మన భారతీయుల తోడ్పాటు చాలా ఉంది. 2017లో అమెరికా జీడీపీకి అక్కడ ఉన్న భారతీయ కంపెనీలు 57 బిలియన్‌ ‌డాలర్లు సమకూర్చాయని ఐహెచ్‌ఎస్‌ ‌మార్కెట్‌ ‌రీసెర్చ్ అనే సంస్థ తేల్చింది. ట్రంప్‌ ‌మరోసారి వైట్‌ ‌హౌస్‌లో పాగా వేయాలంటే అక్కడి భారతీయుల తోడ్పాటు అవసరం. అందుకే ఈ వ్యూహాత్మక పర్యటన ఎత్తుగడ.

rehana

Leave a Reply