Take a fresh look at your lifestyle.

తన పని ముగించుకున్న ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ‌ట్రంప్‌ ఏదైతే ఆశించి భారత్‌లో పర్యటించాడో దాదాపుగా ఆ ఆశయాన్ని నెరవేర్చుకుని వెళ్ళాడు. స్వతహాగా బిజినెస్‌ ‌మ్యాన్‌ ‌కావడంతో తమ దేశ తయారీ వస్తువుల విక్రయించుకోవడంలో ఆయన సఫలీకృతుడైనాడు. అయితే మరికొన్ని వాణిజ్య ఒప్పందాల విషయంలో ఇంకా ఇండియా గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వకపోవడం ఆయనకు కొంత అసంతృప్తిని కలిగించి ఉండవచ్చు. కానీ, భారతదేశంపై, ప్రధానంగా ప్రధాని నరేంద్రమోదీ పై ఆయనచేసిన ప్రశంసలను బట్టిచూస్తే కొంత సమయం తీసుకునైనా ఇండియా ఆయన కోరికను తీరుస్తుందేమోనన్న అనుమానాలు లేకపోలేదు. అమెరికన్‌ ‌వ్యవసాయ, పాడి, కోడి వ్యాపారాన్ని ఇండియాలో విస్తరింపజేయాలన్న ఆయన సంకల్పం ప్రస్తుతానికైతే నెరవేరనట్లే కనిపిస్తున్నది. ఆయన పర్యటనకు ముందే వీటి విషయంలో ఇండియా మీడియాలో వచ్చిన కథనాల కారణంగా ఈ ఒప్పందాలను ఇరు దేశాలు తాత్కాలికంగా పక్కకు పెట్టాయన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇప్పుడు కాకపోయినా మరెప్పుడైనా వీటిపైన ఒప్పందం కుదిరిన పక్షంలో భారతదేశంలోని ఆయారంగాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. అయినా ఉట్టి చేతులతో తిరిగి వెళ్ళకుండా భారీగానే రక్షణ ఉత్పత్తులను భారత్‌తో ట్రంప్‌ ‌కొనిపించగలిగాడు. మూడు బిలియన్‌ ‌డాలర్ల విలువైన అమెరికన్‌ ‌రక్షణ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో ఇరుదేశాలు ఈ సందర్భంగా ఒప్పందాన్ని చేసుకున్నాయి. అలాగే ఆరోగ్యం, ఆయిల్‌ ‌కార్పోరేషన్లపైనకూడా ఒప్పందాలు జరిగాయి. ఇంధనంపై రెండు దేశాల మధ్య ఇరవై బిలియన్‌ ‌డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న ట్రంప్‌ ‌భారత్‌కు చాలాకాలంగా కొనసాగుతున్న వెసులుబాటుల అడ్డును తొలగించే విషయంలో ఏమాత్రం హామీ ఇవ్వకపోవడం ఆతిథ్యమిచ్చిన దేశప్రజలకు అసంతృప్తినిచ్చింది. మనదేశానికి చెందిన ఉక్కు , అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా ప్రభుత్వం అదనపు సుంకాలను విధించిన విషయం తెలిసిందే.

- Advertisement -

జనరలైజ్డ్ ‌సిస్టమ్స్ ఆఫ్‌ ‌ప్రిఫరెన్స్ ‌పేర కొన్ని రకాల సామగ్రిని ఎటువంటి సుంకాలు లేకుండా అమెరికాకు ఎగుమతి చేసుకునే దేశాల జాబితానుండి ఇండియాను తొలగించిన విషయంపై ఆయన ఏమాత్రం మాట్లాడకపోవడంకూడా తీవ్ర ఆసంతృప్తినిచ్చింది. అభివృద్ది చెందుతున్న దేశాల జాబితానుండి ఇండియాను తొలగించి, ఎగుమతిచేసే కొన్నిరకాల వస్తువులకు పన్నురాయితీ లేకుండా ట్రంప్‌ ‌చేశాడు. ఇరాన్‌నుంచి అయిల్‌ను సులభతరంగా దిగుమతిచేసుకునే అవకాశానికి కూడా గండికొట్టి, అమెరికానుండే ఆయిల్‌ ‌దిగుమతిచేసుకునేలా చేశాడు. పైగా భారత్‌ ‌గడ్డపైనుంచి పాక్‌కూడా తనకు మిత్ర దేశమని ప్రకటించడం, కశ్మీర్‌ ‌విషయంలో కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహిస్తాననడం భారత ప్రజానీకానికి కొరుకుడుపడని విషయాలుగా మారాయి. ఒకపక్క ఇండియాను, ఇక్కడి ప్రజలను, ప్రశంసిస్తూనే, ముఖ్యంగా ప్రధాని మోదీ తనకు అత్యంత ఆత్మీయ మిత్రుడిగా చెబుతూనే భారత్‌పై వివిధ రకాలుగా పెడుతున్న ఆంక్షల సడలింపుపై ఏమాత్రం మాట్లాడకపోవడం చూస్తుంటే సహజ వ్యాపారవేత్త అయిన ట్రంప్‌ ఈ ‌పర్యటనను కూడా వ్యాపారపరంగానే వినియోగించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలాఉంటే మరికొద్దిరోజుల్లో అమెరికా అధ్యక్షపదవికి ఎన్నికలు జరుగనుండగా ట్రంప్‌ ఇం‌డియా పర్యటన ప్రత్యేకతను సంతరించుకుంది. అమెరికాలో ఉన్న భారతీయుల ఓట్లను సాధించుకునేందుకే ట్రంప్‌ ‌పర్యటన వెనుకున్న మతలబని, అమెరికా నుండే విమర్శలు వస్తున్నాయి. ఆయన ఇండియాకు రావడానికి ముందునుండే తనకు భారతదేశంలో ఘనస్వాగతం పలుకుతానని మిత్రుడు మోదీ అన్నాడని బాహాటంగానే ప్రకటించడంద్వారా తను అపూర్వ స్వాగతాన్ని కోరుకుంటున్న విషయాన్ని బయ•పెట్డాడు. ఇదిఆయనకు త్వరలో ఆదేశంలో జరుగబోయే ఎన్నికలకు ఎంతో తోడ్పడుతుందన్నది ఆయన అంచనా అయి ఉంటుంది. తనకు జరిగినంత స్వాగతం గతంలో ఏ అమెరికా అధ్యక్షుడికి జరుగలేదని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు కూడా. ఇది ఇరుదేశాల మధ్య గతంలో ఎన్నడూ లేనంత ఘనమైన అనుబంధాన్ని ఏర్పరిచిందని ఉద్వేగపూరితంగా ఆయన పలుసార్లు వల్లెవేశాడు. ఇంత ఘనసత్కారాన్ని పొందిన ట్రంప్‌, ఆయన కుటుంబం తమ పనిని తాము చేసుకుపోయారేగాని, భారత్‌కు పెద్దగా ఒనగూర్చిన లాభం మాత్రం ఏమీ కనిపించడంలేదంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు.

Leave a Reply