Take a fresh look at your lifestyle.

దిగిపోతూ అహం వీడని ట్రంప్‌…

అమెరికా చరిత్రలో అత్యంత వివాదాస్పద అధ్యక్షునిగా పేరుమోసిన డొనాల్డ్ ‌ట్రంప్‌ అధికార భవనం వైట్‌ ‌హౌస్‌ ‌ను వీడటానికి కొద్ది గంటల ముందు చేసిన ప్రసంగం ఆయనలోని అహంకార ధోరణికి అద్దం పడుతున్నది. కొత్త అధ్యక్షునిగా డెమోక్రాటిక్‌ ‌పార్టీ అభ్యర్ధి జో బైడెన్‌ ‌ను గుర్తించేందుకు ఆయన అహం అడ్డు వచ్చిందో ఏమో, కానీ, కొత్త పాలక వర్గానికి శుభాకాంక్షలు అని అన్నారు.అంటే బైడెన్‌ ‌పేరు ప్రస్తావించేందుకు నిరాకరించారు.అలాగే , ఆయన తీసుకున్న చివరి నిర్ణయంగా చెబుతున్న 73 మందికి క్షమాభిక్ష ప్రసాదించడం, మరో 70 మందికి శిక్షను తగ్గించడం వంటి చర్యలను ఉదహరిస్తున్నారు.ఇంత మందికి క్షమాభిక్ష ప్రసాదించిన ట్రంప్‌ ‌స్వీయ క్షమాభిక్షకు మొగ్గు చూపలేదు. జనవరి ఆరవ తేదీన పార్లమెంటు భవనంపై తన మద్దతుదారులు జరిపిన దాడికి ఆయన క్షమాపణ చెప్పి ఉంటే ఎంతో హుందాగా ఉండేది.అసలు ఆ రోజున తన మద్దతుదారులు జరిపిన దాడికి తానే నాయకత్వం వహించాలని ట్రంప్‌ అనుకున్నారనీ, ఏదైనా జరిగే అవకాశం ఉందనీ, రక్షణ కల్పించలేమని ఇంటిలిజెన్స్ అధికారులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గారని వార్తలు వచ్చాయి. తన హయాంలో అమెరికా ప్రపంచంలో ఘనత వహించిన దేశంగా పేరొందిందని ట్రంప్‌ ‌గొప్పలు చెప్పుకున్నారు. వాణిజ్యాన్ని పెంచాననీ,అన్ని దేశాలూ అమెరికా వైపు చూసేట్టు అభివృద్ధి చేశానని కూడా ట్రంప్‌ ‌గొప్పలు చెప్పుకున్నారు.

అన్ని వర్గాలు,వర్ణాల వారికీ రక్షణ కల్పించానని చెప్పారు.ఆయన హయాంలో మిన్నోసోటా రాష్ట్రంలోని మినియా పోలిస్‌ ‌లో ఒక నల్లజాతి వ్యక్తి మెడపై పోలీసు అధికారి మోకాలు పెట్టి ఊపిరాడకుండా చేసిన ఘటన ట్రంప్‌ అధికారాంతంలో జరిగిన సంఘటన. ఆయన పదవి నుంచి దిగిపోవడానికి కొద్ది నెలల క్రితం జరిగింది.అయితే,ఇది జనం మరిచి పోయారనుకుని ట్రంప్‌ అన్ని వర్ణాలకూ రక్షణ కల్పించానంటూ చెప్పుకొచ్చారు. ట్రంప్‌ ‌హయాంలో వృద్ది రేటు బాగా తగ్గింది. ఉత్పత్తి, తయారీ రంగాలు దెబ్బతిన్నాయి. ఎగుమతులు దిగజారాయి. ఈ అవకాశాన్ని చైనా బాగా వినియోగించుకుంది. అంతేకాక, కొ•రోనా వైరస్‌ ‌వల్ల దేశంలో లక్షలాది మంది మరణించారు. వారికి సకాలంలో వైద్య పరీక్షలు జరిపించలేదు. మాస్క్ ‌లు, పీపీటీ కిట్లు సరఫరా చేయించలేకపోయారు. అంతేకాక, మాస్క్ ‌లపై చాలా మొదట్లో చాలా తేలికగా మాట్లాడారు. ఆయన నిర్లక్ష్యం చేయడం వల్లనే అమెరికాలో అతి స్వల్పకాలంలో ఈ వైరస్‌ ‌వ్యాపించిందన్న ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, మాజీ అధ్యక్షుడు, డెమోక్రాటిక్‌ ‌పార్టీ నాయకుడు బరాక్‌ ఒబామాపై అసూయతో ఆయన హయాంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలను తిరగతోడారు. వీటిలో ముఖ్యమైనది పారిస్‌ ఒప్పందం నుంచి వైదొలగడం. భూతాపాన్ని తగ్గించేందుకు ఐక్యరాజ్య సమితి పారిస్‌ ‌లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సదస్సులో కుదిరిన ఈ ఒప్పందానికి ఒబామా సూత్రధారి.దీంతో అమెరికాకు మంచి పేరు వచ్చింది.

ఉద్గారాల తగ్గింపు విషయంలో అమెరికా లీడ్‌ ‌తీసుకున్నందుకు యావత్‌ ‌ప్రపంచం అభినందించింది.అయితే, ఈ ఒప్పందంలో అమెరికా భాగస్వామ్యం వల్ల ఆర్థికంగా అదనపు భారం పడుతుందంటూ ట్రంప్‌ ‌దీనినుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. అంతేకాక, ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించడంపై విధించిన ట్రావెల్‌ ‌బ్యాన్‌ ‌వల్ల కూడా ట్రంప్‌ అపఖ్యాతి పాలయ్యారు. కొత్త అధ్యక్షుడు బైడెన్‌ ‌తన తొలి ప్రాథమ్యాలుగా వీటినే ఎంచుకున్నారు. ట్రంప్‌ ‌వల్ల దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే తన తొలి ప్రాథమ్యమని బైడెన్‌ ఇప్పటికి చాలా సార్లు స్పష్టం చేశారు. అమెరికా తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వివాదాస్పదమైనది హెచ్‌ -1 ‌బీ వీసాల కుదింపు. దీని వల్ల అమెరికా ఐటి రంగం ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. చైనా,భారత్‌ ‌ల ఐటి నిపుణులు ఐటి రంగంలో ఉద్యోగాలన్నింటినీ కొల్ల గొడుతున్నారంటూ వీసాలపై కత్తెర వేశారు.అయితే, దీంతో అమెరికాలో ఐటి నిపుణుల కొరత ఏర్పడింది.ముఖ్యంగా, భారత్‌ ‌నుంచి వెళ్ళే ఐటి నిపుణుల ఉద్యోగాల కు గండం ఏర్పడింది. అంతేకాకుండా, ట్రంప్‌ ‌భారత్‌ ‌వంటి దేశాలను రక్షణ రంగంలో భాగస్వామ్యం చేయడం వల్ల ఇంతవరకూ తటస్థంగా ఉంటూ వచ్చిన దేశాలు అమెరికా పంచన చేరాల్సి వచ్చింది.

ప్రధాని నరేంద్రమోడీ ట్రంప్‌ ‌మాయమాటలకు మెత్తబడ్డారు. నెహ్రూ హయాం నుంచి అనుసరిస్తున్న అలీన విధానాన్ని తుంగలోకి తొక్కి అమెరికాతో రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు.అలీన విధానం ప్రపంచీకరణ వచ్చిన తర్వాత బలహీన పడిన మాట నిజమే అయినప్పటికీ, ట్రంప్‌ ‌తో మోడీ దోస్తీ కారణంగా అది మరింత నిర్వీర్యమై పోయింది. ఈ భాగస్వామ్య ఒప్పందం వల్ల చైనా మన దేశంపై మరింత గుర్రు పెంచుకుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మన దేశం చేస్తున్న యత్నాలను పదే పదే అడ్డుకుంటోంది. మన దేశంపై ఉగ్రదాడుల సూత్రధారి మసూద్‌ అజార్‌, ‌హపీజ్‌ ‌సయీద్‌ ‌వంటి కరుడుకట్టిన ఉగ్రవాద నాయకులపై వేటు పడకుండా కాపాడుతోంది. ట్రంప్‌ ‌విధానాల వల్ల అమెరికన్లే కాకుండా,ఆయనతో జత కట్టిన దేశాల అధినేతలు కూడా ఇబ్బందులకు గురి అయ్యారు. ట్రంప్‌ ‌నాల్గేళ్ల పాలనలో అమెరికా అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళింది.ఇప్పుడు పాలనా రంగంలో సంస్కరణలను తీసుకుని వచ్చి అమెరికాకు పూర్వ వైభవం తెస్తానంటూ బైడెన్‌ ‌తన ప్రసంగాల్లో హామీ ఇస్తున్నారు. బైడెన్‌ ‌హయాంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్‌ ‌దే హవా అనే వార్తలు ఇప్పటికే వచ్చాయి. భారత మూలాలు ఉన్న ఆమె తొలి ఉపాధ్యక్షురాలిగా అమెరికా చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందనున్నారు. ఆమె చొరవ వల్లనే బైడెన్‌ ‌పాలనా యంత్రాంగంలో ఇండో అమెరికన్లకు స్థానం దక్కింది. ఆమె చొరవతో మన దేశానికి మరిన్ని మేళ్లు జరగవచ్చు.

Leave a Reply