క్యాపిటల్ భవనంపై ట్రంప్ వర్గీయుల దాడి..
అమెరికా చట్టసభల సంయుక్త సమావేశం జరిగిన క్యాపిటల్ భవనంలోకి పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్గీయులు దూసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాన్ని కుట్ర కాదు, ఎన్నికల హింసకు కొనసాగింపువంటిదేనని పరిశీలకులు పేర్కొంటున్నప్పటికీ ఇది ముమ్మాటికీ కుట్ర గానే పరిగణించాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యానికి అచ్చమైన వారసులమని చెప్పుకునే అమెరికన్లు యావత్ ప్రపంచం ముందు తలదించుకోవల్సిన చీకటి రోజు ఇది. ట్రంప్ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి అమెరికా ప్రతిష్టనూ, చరిత్రనూ దిగజారుస్తూనే ఉన్నారు. ట్రంప్ రాజకీయవాది కాకపోయినా రాజకీయవాదుల కన్నా ఎక్కువగా ఎత్తులు, పై ఎత్తులు వేశారు. చివరి క్షణం వరకూ తన పీఠాన్ని కాపాడుకునేందుకు ఎన్నో అడ్డదారులు తొక్కారు. అవి ఏవీ ఫలించలేదు సరికదా చరిత్రలో ఏ అధ్యక్షుడూ పాల్పడని అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన మద్ధతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకుని వొచ్చిన తీరును వార్తా ప్రసార సాధనాల్లో చూసి యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఔరా అమెరికాలో ప్రజాస్వామ్యానికి ఏ గతి పట్టిందని దిగ్భ్రాంతి చెందింది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన అమెరికాకు ఈ అప్రదిష్టను తెచ్చి పెట్టిన ట్రంప్ అధ్యక్షునిగా కొనసాగిన నాలుగు సంవత్సరాల్లో అమెరికా వాణిజ్య, ఆర్థిక, దౌత్య రంగాల్లో ఎన్నో పతనాలను చూసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన ట్రంప్ వర్గీయుల తీరును యావత్ ప్రపంచం ఖండిస్తోంది.
అమెరికా ప్రతిష్ఠను ట్రంప్ హయాంలో ఉపాధ్యక్షునిగా వ్యవహరించిన మైక్ పెన్స్ కాపాడారు. అధ్యక్షనిగా జో బైడెన్ ఎన్నికను ధృవపర్చేందుకు జరిగిన కాంగ్రెస్ సంయుక్త సమావేశాన్ని నిర్వహించిన పెన్స్‌పై ట్రంప్ తీవ్రమైన వొత్తిడి తెచ్చారు. ఎంత లేదన్నా, ఆయన తన కింద పని చేసిన వాడన్న ధైర్యంతో బైడెన్ ఎన్నికైనట్టు ప్రకటన చేయకుండా నిలువరించేందుకు తీవ్రమైన వొత్తిడి తెచ్చారు. ట్రంప్ మాటను గౌరవించలేనంటూ మైక్ పెన్స్ చేసిన ప్రకటన అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్న ట్రంప్ వంటి వారికి గుణపాఠం. అమెరికా అధ్యక్ష ఎన్నికలో అనేక అవకతవకలు జరిగాయని కొందరు తనకు లేఖలు రాశారనీ, చట్టబద్దమైన వారి హక్కును తాను గౌరవిస్తాననీ, అంత మాత్రాన ప్రిసైడింగ్ అధికారిగా తన ధర్మాన్ని వీడలేనంటూ మైక్ పెన్స్ అమెరికన్ కాంగ్రెస్‌కి రాసిన లేఖ ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారందరికీ ఊపిరిని ఇచ్చింది. ఎన్నిక ఫలితాన్ని తిప్పి పంపే అధికారం ప్రిసైడింగ్ అధికారికి ఉందనీ, ఆ అధికారాన్ని వినియోగించుకోవాలని సామాజిక మాధ్యమాల ద్వారా ట్రంప్ పెన్స్‌కి విజ్ఞప్తి చేశారు. తన మద్ధతుదారులను రెచ్చగొట్టేందుకు ట్రంప్ సామాజిక మాధ్యమాలను గడిచిన కొద్ది రోజులుగా గరిష్టస్థాయిలో వినియోగించుకుంటున్నారు. ఆయన ట్వీట్లను చూసి చాలా మంది ప్రజాస్వామ్య ప్రియులు అసహ్యించుకున్నారు. అగ్రరాజ్యం అధినేత పంపాల్సిన ట్వీట్లేనా ఇవి ఏవగించుకున్నారు. ఆఖరికి ఆయన ట్విట్టర్ అకౌంట్‌ను రద్దు చేశారు. ఒక దేశాధ్యక్షునికి ఇంతకన్నా దారుణమైన అవమానం ఎక్కడా ఉండదు. ట్విట్టర్ ఖాతాలను దుర్వినియోగం చేయడం అంటే ఇదే.
ట్రంప్ చేసిన, ప్రకటనలు, ట్వీట్లు అమెరికా ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పలువురు వ్యాఖ్యానించారు. అంతేకాక, సామాజిక మాధ్యమాల్లో ట్రంప్ తన అనుచరులను కీర్తిస్తూ చేసిన ట్వీట్లపై తీవ్ర ఆక్షేపణ తెలిపారు. క్యాపిటల్ భవనంలోకి దూసుకుని వొచ్చిన వారిని దేశభక్తులనడం ట్రంప్ అహంకార ధోరణికి నిదర్శనం. పార్లమెంటు భవనంలోకి దూసుకుని వెళ్ళే వారు పౌరులైనా, ఇంకెవరైనా వారికి కఠిన శిక్షలు విధించాల్సి ఉంది. బైడేన్ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ఎటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల తిరుగుబాటు జరిగినా, రాజ్యాంగ సంక్షోభాలు ఏర్పడినా, నీతివాక్యాలను వల్లించే అమెరికాలోనే అటువంటి పరిస్థితి దాపురించడానికి బాధ్యుడైన ట్రంప్‌ను చరిత్ర క్షమించదని పలువురు రాజ్యాంగ నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే, ట్రంప్ వర్గీయుల చర్యను తిరుగుబాటు అనడానికి వారు అంగీకరించడం లేదు. సైన్యం, లేదా ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఆ విధంగా చట్టసభల్లోకి దూసుకుని వొచ్చినప్పుడు మాత్రమే అది తిరుగుబాటు అవుతుందని వారు పేర్కొంటున్నారు.
ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేవే. అన్ని మతాలను సమానంగా చూడాలన్న అమెరికా సంస్కృతికి భిన్నంగా ట్రంప్ అధికారంలోకి రాగానే ఏడు ముస్లిం దేశాల పౌరులపై ట్రావెల్ బ్యాన్ ప్రకటించారు. దీనిపై జరిగిన న్యాయపోరాటంలో చివరికి రాజీ పడాల్సి వొచ్చింది. ఇరాన్‌పై ఆంక్షలు విధించడంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యంగా, ఇరాన్‌తో చమురు లావాదేవీలు జరపరాదంటూ జారీ చేసిన హుకుమ్‌ను చాలా దేశాలు పాటించలేదు. పైగా ట్రంప్ నిర్ణయాన్ని నియంతృత్వ వైఖరిగా అభివర్ణించాయి. ఇరాన్ వైఖరితో ఏకీభవించని దేశాలు కూడా వాణిజ్య రంగంలో ఇలాంటి వివక్షలు పనికిరావని హెచ్చరించాయి. ప్రపంచంలో ఏ మూల ఇంధన వనరులున్నా వాటిని ప్రపంచ పౌరులందరి వినియోగానికి తేవల్సిన బాధ్యత అగ్రరాజ్యంపై ఉందనీ, ఇరాన్‌తో వ్యక్తిగత వైరం కారణంగా చమురు వ్యాపారాన్ని నిలిపివేయాలనడం ఏవిధంగా చూసినా సమర్ధనీయం కాదని చాలా దేశాలు మండిపడ్డాయి. అలాగే, చైనాతో వైరాన్ని ట్రంప్ కొని తెచ్చుకున్నప్పటికీ, కొరోనా వైరస్ విషయంలో ట్రంప్ చైనాని దోషిగా నిలబెట్టేందుకు చేసిన ప్రయత్నం చాలా వరకూ ఫలించింది. ట్రంప్ తొందరపాటు నిర్ణయాలు, ప్రకటనల వల్ల అమెరికా ప్రతిష్ఠ దిగజారింది. ఇప్పుడు అధికారం బదిలీ సమయంలో ఆయన అనుసరించిన అనుచిత వైఖరిని యావత్ ప్రపంచం గర్హిస్తోంది.