Take a fresh look at your lifestyle.

మొగ్గు బైడెన్‌కే ఉన్నా అంగీకరించని ట్రంప్‌

అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నిక పూర్తయి నాలుగు రోజులు గడుస్తున్నా, ఫలితం ఇంతవరకూ వెల్లడి కాలేదు. ఈసారి అధిక సంఖ్యలో పోస్టల్‌, ‌మెయిల్‌ ‌వోట్లు పోలు కావడంతో లెక్కింపు పక్రియలో జాప్యం జరుగవచ్చు. ఇంతవరకూ వెలువడిన ఫలితాల సరళిని బట్టి డెమోక్రాటిక్‌ ‌పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ ‌సాధారణ విజయానికి(మ్యాజిక్‌ ‌ఫిగర్‌కి) ఆరు వోట్లు తక్కువగా వొచ్చాయి. వోట్ల లెక్కింపు జరుగుతున్న రాష్ట్రాల్లో కూడా ఆధిక్యతల ధోరణి ఆయనకు అనుకూలంగానే ఉంది. అయితే, ప్రత్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కొన్ని చోట్ల రిపబ్లికన్‌ ‌పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌కోర్టులకు ఎక్కారు. పలు చోట్ల ఇరు పార్టీల మద్దతుదారులు ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. ఓటమి అంచువరకూ వోచ్చినా, దానిని అంగీకరించేందుకు ట్రంప్‌ ‌సిద్ధంగా లేరు. ఎలాగైనా గెలవాలన్న కృతనిశ్చయంతో ఆయన పావులు కదుపుతున్నారు. అయితే, కిందటి సారి మాదిరిగా ఈసారి ఆయనకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఆయన ఓడిపోవాలని కోరుకుంటున్నవారే ఎక్కువమంది ఉన్నారు. దానికి తగ్గట్టు మొదటి నుంచి డెమోక్రాటిక్‌ ‌పార్టీ అభ్యర్థి బైడెన్‌ ‌కొద్దోగొప్పో ఆధిక్యంలోనే ఉన్నారు. ట్రంప్‌ ‌సంగతి తెలుసు కనుక ఎలాంటి అక్రమాలు జరిగినా ఊరుకునేది లేదని కార్మిక, ఉద్యోగ సంఘాలు పిలుపు ఇచ్చాయి.

పోలింగ్‌ ‌ముందు నిర్వహించిన సర్వేలో బైడైన్‌కు 52 శాతం వోట్లు, ట్రంప్‌కు 43 శాతం వోట్లు వొస్తాయని వెల్లడైంది. అయితే, ఆ సర్వేలన్నీ తప్పుడు సర్వేలంటూ ట్రంప్‌ ‌కొట్టిపారేశారు. పోలింగ్‌ ‌పూర్తి అయిన వెంటనే ట్రెండ్స్ ‌గురించి పట్టించుకోకుండా మేం గెలవబోతున్నాం అంటూ ప్రకటన చేసేశారు. ఎలక్టోరల్‌ ‌కాలేజీలో మొత్తం 538 మంది సభ్యులుంటారు. వీరిలో 270 మంది వోట్లను సంపాదించుకున్నవారే విజేత అవుతారు. ఇంతవరకూ, బైడైన్‌కి 264 వోట్లు, ట్రంప్‌కు 214 వోట్లు వొచ్చినట్టు తాజా సమాచారం. అయితే, కొన్ని చోట్ల వోట్ల లెక్కింపు సాగుతోంది. ఇప్పుడు లెక్కించే స్థానాలన్నీ ట్రంప్‌కే వొస్తే ఆయన ఎన్నిక కావచ్చు. కానీ, అలాంటి అవకాశం లేదు. బైడైన్‌కు కూడా వోట్లు వొస్తున్నాయి. ఈ నేపత్యంలో ట్రంప్‌లో అసహనం పెరిగిపోతోంది. ప్రత్యర్థులపై మాటల తూటాలను విసురుతున్నారు. ఆయన మద్దతుదారులు సామదానభేద దండోపాయాలను ప్రయోగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే బైడైన్‌కి భద్రత పెంచారు.

అమెరికా అధ్యక్ష ఎన్నిక వోట్ల లెక్కింపు సరళిని చైనా ఆసక్తిగా గమనిస్తోంది. అమెరికాతో వాణిజ్య, దౌత్య సంబంధాలను పెంచుకోవాలనే తాము కోరుతున్నామనీ, త్వరలోనే ఇరుదేశాలకు అనుకూలమైన పరిణామాలు సంభవించవొచ్చని ఆశిస్తున్నామంటూ చైనా విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు. అంటే, ట్రంప్‌ ఓటమి తథ్యమన్న మీడియా వార్తల ఆధారంగా ఆయన ఈ వ్యాఖ్య చేశారు. చైనాతో ట్రంప్‌ ‌వాణిజ్య యుద్ధం ప్రకటించారు. చివరికి వెనక్కి తగ్గారు. ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. ఈ కారణంగా ట్రంప్‌ ‌హయాంలో అమెరికాకు మిత్రుల కన్నా శత్రువుల సంఖ్య పెరిగింది. ఆయన ఓటమిని చాలా దేశాలు కోరుకోవడానికి కారణం ఇదే. అయితే, చివరి క్షణంలో ఏదో మాయ చేసి గెలుపు తనదేనని ఆయన ప్రకటించుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు. ఏమైనా ఈసారి అమెరికా ఎన్నికల ఫలితాలు ట్రంప్‌కి వ్యతిరేకంగానే ఉండవచ్చునంటున్నారు. కీలక రాష్ట్రాలుగా పరిగణిస్తున్న చోట కూడా బైడెన్‌ ‌స్వల్ప మెజారిటీలో ఉన్నట్లు సమాచారం.. ఎందుకైనా మంచిదని ట్రంప్‌ ‌ముందే ఈ ఎన్నికలను పెద్ద కుంభకోణంగా అభివర్ణించారు. ఓడిపోతే వివాదాన్ని రేపాలనే ఆలోచన ట్రంప్‌కు ముందు నుంచి ఉంది. కొరోనాతో నిమిత్తం లేకుండా గత మూడు ఎన్నికల సర్వేలను చూసినప్పుడు ముందుస్తుగా వోట్లు వేసిన వారి వోట్లలో డెమోక్రాట్లకే ఎక్కువ వోట్లు వొచ్చాయి. ఈ సారి కూడా వారిదే పైచేయి అని వార్తలు వొచ్చాయి. అందుకే పోస్టల్‌ ‌వోట్లను పరిగణనలోకి తీసుకోవద్దని ట్రంప్‌ ‌వాదిస్తున్నాడు. పోలింగ్‌ ‌రోజు వేసినవే అసలైన వోట్లు అంటున్నాడు. అయితే పోలింగ్‌ ‌తరువాత అందిన పోస్టల్‌ ‌వోట్లను కూడా పరిగణించాలని సుప్రీమ్‌ ‌కోర్టు చెప్పింది. వీటిని పరిగణనలోకి తీసుకోవటాన్ని రిగ్గింగ్‌ అని ట్రంప్‌ ఆరోపిస్తున్నాడు.

ట్రంప్‌ ‌గనుక ఓడిపోతే పలుచోట్ల హింసాకాండ తలెత్తే అవకాశం ఉందని పది రోజుల ముందు ఒక నివేదిక వెలువడింది ట్రంప్‌ ‌శ్వేతజాతి దురహంకారి, మహిళా వ్యతిరేకి కూడా. విస్కాన్సిన్‌ ‌రాష్ట్రంలోని కెనోషా ఎన్నికల సభలో డెమోక్రటిక్‌ ‌పార్టీ ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి కమలా హారిస్‌పై నోరుపారవేసుకున్నాడు. నవంబరు మూడున ఎన్నికలు జరిగిన తరువాత డిసెంబరు 14న ఎలక్ట్రోరల్‌ ‌కాలేజీ సభ్యులు అధ్యక్ష ఎన్నికల్లో వోట్లు వేస్తారు. జనవరి ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు పార్లమెంట్‌ ‌సమావేశమై వోట్ల లెక్కింపు, విజేతల ప్రకటన చేస్తుంది. జనవరి 20న నూతన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన వారు పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఒక వేళ ఫలితాన్ని ప్రకటించే పార్లమెంట్‌ ఉభయ సభలు ఆపని చేయకపోతే వివాదం సుప్రీమ్‌ ‌కోర్టు ముందుకు వెళుతుంది. మొత్తం మీద ఎన్నికల తుది ఫలితం వెలువడకుండా గందరగోళాన్ని సృష్టించేందుకు ట్రంప్‌ ‌వర్గం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తిమ్మిని బమ్మి చేసి ట్రంప్‌ ఎన్నికైనట్టు ప్రకటించుకున్నా, నైతికంగా ఆయన ఇప్పటికే ఓడిపోయారు.

Leave a Reply