Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ‌వర్సెస్‌ ‌బిజెపి

Trs vs bjp in politics

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలంగాణ రాష్ట్రసమితికి, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతోంది. రాష్ట్రంలోని బిజెపి నాయకులు చాతకాని వారని టిఆర్‌ఎస్‌ ‌విమర్శిస్తే, తెలంగాణ నయా గజనీ అంటూ భారతీయ జనతాపార్టీ దానికి కౌంటర్‌ ఇవ్వడంతో ఈ రెండు పార్టీలు మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌ ‌పట్ల రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నాయన్న విషయాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించిందంటూ ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి. రాష్ట్రంలోని అధికార పార్టీని నిత్యం విమర్శించుకుంటూ కూర్చునే, రాష్ట్ర బిజెపి నాయకులకు రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేంద్రం ద్వారా సమకూర్చే విషయంలో వారి చేతగానితనాన్ని టిఆర్‌ఎస్‌ ఎత్తిచూపుతుంటే.. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి అందించిన ఆర్థిక సహకారాన్ని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం విస్మరించి విమర్శించడంపై రాష్ట్ర బిజెపి వర్గాలు ఎదురుదాడి ప్రారంభించాయి. ఢిల్లీలో కాళ్ళు.. తెలంగాణలో కన్నీళ్ళు పెట్టడం టిఆర్‌ఎస్‌ ‌నేతలకు అలవాటేనని బిజెపి విమర్శిస్తోంది. స్వయం ఆదాయ వనరులను పెంచుకోకుండా ప్రతీదానికి కేంద్రంపై ఆధారపడుతూ, నిధులు ఇవ్వలేదన్న నెపం వేయడాన్ని ఎత్తిచూపుతున్న టిఆర్‌ఎస్‌ ‌నాయకులదే అసలైన చేతకాని తనమంటూ బిజెపి నేతలు టిఆర్‌ఎస్‌ను దుయ్యబడుతున్నది. చేతకానితనం అన్నవిషయంపై ఇరువర్గాలు తీవ్రంగా స్పందించడం చూస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పెద్ద అఘాథమే ఏర్పడనుందనిపిస్తోంది. ఈ విషయమై తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఒక విధంగా టిఆర్‌ఎస్‌పై విరుచుకుపడ్డాడనే చెప్పాలి.

ముఖ్యంగా ఆయన రాష్ట్ర ఐటి, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కల్వంకుంట్ల తారకరామారావును తీవ్రంగా విమర్శించారు. కెటిఆర్‌ను ఆయన తెలంగాణ నయా గజనీగా అభివర్ణిస్తూ, రాష్ట్ర రాజధాని రోడ్లను కూడా సక్రమంగా నిర్వహించే పరిస్థితిలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వముందని, ప్రతీ చిన్న పనికీ కేంద్రంపైనే ఆధారపడినట్లుగా, ప్రతీదానికి కేంద్రం నిధులివ్వడంలేదని ఆరోపించడం అలవాటుగా మారిందంటూ ఆయన అంతకు ముందు కెటిఆర్‌ ‌కేంద్రంపై చేసిన విమర్శపై ప్రతివిమర్శ చేశారు. ఆరు ఏళ్ళుగా కేంద్రం ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదంటూ కెటిఆర్‌ ‌విమర్శించడం పైన లక్ష్మణ్‌ ‌సీరియస్‌గానే రియాక్టు అయ్యారు. ఈ విషయంలో బహిరంగ చర్చకు తాము సిద్ధమేనని, కెటిఆర్‌ ‌సిద్ధంగా ఉంటే పూసగుచ్చినట్లు కేంద్రం ఎన్నినిధులు దేనికోసం ఇచ్చింది, ఎన్నినిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏమేరకు వాడుకుందీ అన్నీ వివరిస్తామంటూ సవాల్‌ ‌చేశాడు. సంక్షేమ పథకాలకు, అభివృద్ధి పనుల నిర్వహణకు ఒక్క తెలంగాణకే కాకుండా అన్నిరాష్ట్రాలకు వేలకోట్ల రూపాయల నిధులను అందజేస్తున్నా, తెలంగాణకు ఆరేళ్ళలో ఇచ్చింది గుండు సున్నా అనడం సరైందికాదన్న విషయాన్ని లక్ష్మణ్‌ ‌చెబుతున్నారు. ప్రధాన మంత్రి ఆవాస యోజన, మున్సిపాలిటీల అభివృద్ధి, అమృత్‌ ‌పథకం, స్మార్ట్ ‌సిటీల అభివృద్ధి, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ ‌యోజన, రహదారుల నిర్మాణం,లాంటి పలు అంశాలకు సంబందించి వేలాదికోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందజేసింది. ఈ నిధులతో చేపట్టాల్సిన పనులేవీ రాష్ట్ర ప్రభుత్వం నేటికీ సంపూర్ణంగా నిర్వహించలేకపోయిందని, కొన్ని పథకాలకు తన వంతు వాటాను కేటాలయించడంలో తీవ్ర జాప్యంచేస్తూ, ఆ జాప్యాన్ని కేంద్రంపై నెడుతోందని లక్ష్మణ్‌ ‌విరుచుకు పడుతుంటే… ఇప్పటికి కేంద్రం ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని, ఈ ఆరు బడ్జెట్‌లలోకూడా తెలంగాణకు చట్టప్రకారం, రాజ్యాంగం ప్రకారం రావాల్సినదానికంటే ఆరపైసాకూడా ఎక్కువ ఇవ్వకపోవడాన్ని కెటిఆర్‌ ‌పదపదే బిజెపి నాయకులకు గుర్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయాలనుకున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మాసిటీకి మూడు నుండి నాలుగు వేలకోట్ల నిదులు అవసరమని, వాటిని సమకూర్చాలని అడిగితే కనీసంగానైనా తమ మాటను పట్టించుకోకపోవడాన్ని ఆయన ఎత్తి చూపిస్తున్నారు. అలాగే వరంగల్‌, ‌నాగపూర్‌, ‌బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌కు సాయమడిగితే దానికీ మొండిచెయ్యి చూపించారు. మిషన్‌ ‌భగీరథ, మిషన్‌ ‌కాకతీయకు 24వేల కోట్లు ఇవ్వాలంటే దానికీ సమాధానంలేదు. విభజన నిబంధనల చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవేవీ సమకూర్చకపోగా, కనీసం జిఎస్టీకింద రావాల్సిన వేలకోట్ల రూపాయలనుకూడా కేంద్రం రాష్ట్రానికి విడుదల చేయకపోవడం, రాష్ట్రాభివృద్ధిని కాంక్షిస్తున్నామని చెబుతున్న రాష్ట్ర బిజెపి నేతలు ఈ నిధులను కేంద్రంనుండి విడుదలచేయించే విషయంలో ఏమాత్రం ప్రయత్నంచేయక పోవడం వారి చేతగాని తనానికి నిదర్శనమంటూ వ్యాఖ్యానించడం ఈరెండు పార్టీల మధ్య తీవ్ర స్థాయి విమర్శ ప్రతివిమర్శలకు దారితీస్తోంది.

manduva ravindar rao

మండువ రవీందర్‌ ‌రావు

Leave a Reply